12, మార్చి 2012, సోమవారం

సకల జనుల సమ్మె...సాధించిందేమిటి?



తెలంగాణ రాజకీయ నాయకులు శిఖండి పాత్రను

పోషిస్తున్నారు. పొద్దున రాస్తారోకోలు, మధ్యాహ్నం

కాంట్రాక్టులు, సాయంత్రం వ్యాపారాలు చేసుకుంటుంటే,

ఉద్యోగులు మాత్రం ఉద్యమాలు చేయాల్సి వస్తోంది’, అని

అక్టోబర్ 14న జూబ్లీహాల్లో తెలంగాణ సమన్వయ సమితి

ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో

స్వయంగా ఉద్యోగ ఐకాస చైర్మన్, టిఎన్‌జివో అధ్యక్షులు

కె.స్వామిగౌడ్ అన్నమాటలివి. తెలంగాణ ఉద్యమంలో

తాము ముందుంటామన్న రాజకీయ నేతలు పదవులు

కాపాడుకునేందుకు ముఖం చాటేసి, సకల జనుల

సమ్మెను ‘సకల ఉద్యోగుల సమ్మె’గా మార్చారని ఆ

సమావేశంలో తెలంగాణ రాజకీయ నాయకులపై

స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. నాటికి సకల జనుల సమ్మె

30వ రోజులకు చేరుకుంది. సమ్మెనైతే ప్రారంభించారు

గాని ముగింపు మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. ఈ

నేపధ్యంలోనే సెప్టెంబర్ 30న రాజకీయ జెఎసి (టిఆర్‌ఎస్

మాత్రమే)తోపాటు 40 మంది ఉద్యోగ జెఎసి బృందం 2న

రాజ్‌ఘాట్ వద్ద వౌనవ్రతం చేపట్టారు. గత మార్చిలో

జైపాల్‌రెడ్డిని కలిసిన ఉద్యోగులకు, ఈసారి తిరిగి కలిసినా

పెద్దగా స్పందన లేదు.
 ఊహించిన దానికంటే ఉధృతంగా సకల జనుల సమ్మె

జరుగుతుంటే, అన్ని రాష్ట్రప్రభుత్వ శాఖల ఉద్యోగులు

జెఎసిలుగా ఏర్పడి సమ్మెలో

భాగస్వాములయ్యారు.సమ్మె రూపాలను

మార్చుకుంటూ ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన

సమయంలో రాజకీయ జెఎసి ముసుగులో టిఆర్‌ఎస్‌తో

ఉద్యోగ సంఘాల జెఎసి సభ్యులు ఢిల్లీకి పోవడం అనేక

అనుమానాలకు తావిచ్చింది. ప్రధానమంత్రి

అపాయింటుమెంటుకోసం, జైపాల్‌రెడ్డిని కలవడానికి

ఉద్యోగులు పాకులాడడం ఉద్యమస్ఫూర్తితో కాదు. ఈ

యాత్ర వెనుక కెసిఆర్ వ్యూహం ఉన్నట్లు తెలిసినా,

ఉద్యోగ సంఘాల జెఎసి సభ్యులు ఆయన వెనుక ర్యాలీ

కావడం విచిత్రం. ఇక్కడ తెలంగాణ సాధనకన్నా,

టిఆర్‌ఎస్ రాజకీయ లబ్ది ఎక్కువగా ఉంది. యావత్

తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,

ప్రజలు, వీరితోపాటుగా ప్రైవేట్ విద్యాలయాల ఉద్యోగులు,

ప్రైవేట్ రంగాల కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

కూడా సమ్మెకు మద్దతు తెలపడంతో బహుశ తాము

చాలా బలవంతులమని ఉద్యోగ జెఎసి భావించి, తమ

బలప్రదర్శనను ఢిల్లీలో చూపించి తెలంగాణకు ఓ రూట్

మ్యాప్‌ను సాధించాలని ఆశపడి ఉంటారు. కాని

తమకున్న బలహీనతల్ని గుర్తించక,యుపిఎ వ్యూహాన్ని

తక్కువగా అంచనా వేసింది. రాజకీయ పరిష్కారాలు

రాజకీయ పార్టీలతోటే సాధ్యమనే రాజనీతి సూత్రాన్ని

ఉద్యోగ సంఘాలు గుర్తించలేకపోయాయి.
 నిజానికి సకల జనుల సమ్మె సెప్టెంబర్ 6నుంచి ప్రారంభం

కావాలి. జులైలో సమర్పించిన రాజీనామాలతో

డ్రామాలాడుతున్న రాజకీయ నాయకులపై ఒత్తిడిని

పెంచడానికని సమ్మెకు వ్యూహరచన చేసిన రాజకీయ

జెఎసి, రాజీనామాల్ని ఆమోదించుకోవడానికి సెప్టెంబర్

13దాకా అవకాశమిచ్చి, అప్పటికీ ఆమోదించుకోకపోతే,

నిరవధిక సమ్మెకు పోవాలని నిర్ణయించింది. ఆ విధంగా

రాజకీయ జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసిని సమ్మె

ముగ్గులోకి దించింది. రాజకీయ నాయకుల ద్వంద

వైఖరిని గుర్తెరిగిన కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు

సకల జనుల సమ్మెతో తమనెక్కడ బలి పశువుల్ని

చేస్తారోనని ఆగస్టు 30న వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా

గమనించాలి.
 ఆ విధంగా అనుమానాలతో మొదలైన సకల జనుల

సమ్మె అవమానభారంతో ముగిసింది. ఆ విధంగా

రాజకీయ పార్టీ, లేదా పార్టీల సారధ్యంలో జరిగే ఎలాంటి

ఉద్యమానికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు,

విద్యార్థులు, ప్రజలు అవసరాన్నిబట్టి ఊతమిస్తూ,

ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా ఆ పార్టీలకు

వెన్నుదన్నుగా నిలవాలి. అంతేగాని ఓ రాజకీయ

పరిష్కారంకోసం, రాజకీయ పార్టీలు నాటకాలాడుతుంటే,

ఆ పనిని తమ భుజాలపై వేసుకోవడం తనకుమాలిన

ధర్మమే అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి

ఉద్యోగులకెప్పుడూ ఉండదు. ఈ బలహీనతల్ని గుర్తెరిగే

పాలకపక్షాలు ఉద్యోగుల సమ్మెల్ని దెబ్బకొడుతూ

ఉంటాయి. సకల జనుల సమ్మెలో జరిగింది కూడా ఇదే!
 ఏ పాలక పక్షానికైనా ఆర్థిక మూలాలే బలాన్నిస్తాయి. ఆ

ఆర్థిక మూలాల్ని గుర్తించి, దెబ్బతీసినప్పుడు, విధిగా

పాలకపక్షాలు దిగి వస్తాయి. ఈ పనిని ఓ బలమైన

రాజకీయ పార్టీ కార్మికుల సహకారంతో మాత్రమే

చేయగలుగుతుంది. దీనికోసం విభిన్న ఉద్యమరూపాల్ని

రూపొందించుకుంటుంది. అప్పుడు ప్రభుత్వం తీవ్ర

నిర్బంధాన్ని కలిగిస్తుంది. అరెస్టుల్ని చేస్తుంది. క్రిమినల్

కేసుల్ని బనాయిస్తుంది. వీటిని రాజకీయ నాయకులు

ఎదుర్కొంటారు గాని, సర్వీసు నిబంధనల ఛట్రంలోగల

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కోలేరు. వీటిని

ఎదుర్కునే విద్యార్థులు తర్వాతి కాలంలో రాజకీయాల్లో

రాణించగలుగుతారు. కాని తెలంగాణ ఉద్యమంలో ఈ

లక్షణాలెక్కడా కనపడడం లేదు. పైగా ఆత్మహత్యలకు

నెట్టివేయబడడం శోచనీయం. దీన్ని నిలవరించే స్థితిలో

లేని రాజకీయ పార్టీలు సొమ్ముచేసుకుంటున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో ఇదో విచిత్రమైన స్థితి.

ఉద్యమాలు వైఫల్యం చెందినప్పుడు, పోగొట్టుకున్న

నష్టాన్ని పూరించుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు సమ్మె

సందర్భంగా ఉద్యోగులకు ఎదురైంది ఇదే! కొంతలోకొంత

ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు గాని, నష్టపోయింది

ప్రధానంగా ఉద్యోగులు, ఆర్‌టిసి, సింగరేణి కార్మికులే!
 అనుకున్నట్లుగా సకల జనుల సమ్మెతో తెలంగాణ

రాజకీయ నాయకుల్ని కట్టడి కూడా చేయలేకపోయారు.

అంటే, రాజకీయ నాయకుల్ని తమతమ రాజీనామాల్ని

ఆమోదించుకునేలా, లేదా తిరిగి రాజీనామా చేసేలా

ఒత్తిడి చేయలేకపోయింది. నిజానికి అధిష్టాన బలమంతా

తెలంగాణ రాజకీయ నాయకుల్లోనే ఉంది. వీరి బలంతోటే

సకల జనుల సమ్మె విచ్ఛిన్నం చేయగలిగారు. వారు

జానారెడ్డి కావచ్చు! మోహన్‌రెడ్డి కావచ్చు! దామోదరం

రాజనర్సింహ కావచ్చు! ఇలాంటి రాజకీయ నాయకుల్ని

నిర్దేశించాల్సిన సమ్మె, సమ్మెలోకి వెళ్ళిన వారినే ఈ

నాయకులు నిర్దేశించడం శోచనీయం! దీనికి సమ్మె

కాలంలో జరిగిన రెండు దఫాల రైల్‌రోకోను

ఉదహరించవచ్చు! సెప్టెంబర్ 24, 25వ తేదీలలో జరిగిన

రెండురోజుల రైల్‌రోకో మార్చి 10న జరిగిన మిలియన్

మార్చ్‌లాగా మహోజ్వల ఘట్టమే! కాని రెండవ దఫా

ఇచ్చిన రైల్‌రోకో మూడుసార్లు వాయిదాకు గురికావడం

గమనార్హం. ముందుగా అక్టోబర్ 9,10,11వ తేదీలలో

జరుపుతామని ప్రకటించిన రాజకీయ జెఎసి 11వ తేదీన

ఉద్యోగుల మహాధర్నాను, సింగరేణి యాత్రను

పురస్కరించుకొని 12,13,14వ తేదీలకు వాయిదావేసింది.

నిజానికి ఉద్యోగుల మహాధర్నా హైదరాబాద్, రంగారెడ్డి

జిల్లాలకే పరిమితం చేయడం గమనార్హం. అటు ధర్నాను,

ఇటు రైల్‌రోకోను జరపాల్సింది. అలా జరపకపోగా, రైల్‌రోకో

తేదీలను 15,16,17వ తేదీలకు వాయిదావేశారు. దీనికి

చూపిన కారణం, 13న జరిగే బాన్సువాడ ఉప ఎన్నికలే!

ఒకవైపు తెలంగాణ సాధనకై తెలంగాణ మొత్తంగా కదిలి

ఉద్యమబావుటా ఎగురవేస్తే, టిఆర్‌ఎస్ లబ్దికోసం, ఇంకా

చెప్పాలంటే తెలంగాణ కోసమని రాజీనామాచేసిన వ్యక్తిని

తిరిగి గెలిపించడంకోసం రెండవసారీ తెదీలను

వాయిదావేసారు. ఈ విధంగా రైల్‌రోకోను మొదటినుంచి

టిఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంటూ

పోయింది.
 పోనీ ఇచ్చిన అక్టోబర్ 15,16,17వ తేదీలలోనన్నా రైల్‌రోకోను

జరిపారా అంటే అదీ జరక్కపోగా, రెండురోజులకు కుదించి,

ఒక్కరోజు మాత్రమే రైల్‌రోకో జరపడంలోని మతలబు

ఏంటో ఎవరికీ తెలియదు. ఉద్యమ సందర్భంగా

ఇబ్బందుల్ని ఎదుర్కోవడం సహజమేగాని, ఉద్యమ

ప్రకటనలతో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం ఇబ్బందికరమే.

15నాటి రైల్‌రోకోలో ఎంపీలు అరెస్టుకావడంతో కొంపలు

మునిగినట్టు భావించిన రాజకీయ జెఎసి అక్టోబర్ 17న

రైల్‌రోకోను విరమించి తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం

తన ఇష్ఠారాజ్యానికి నిదర్శనం. ఈ విధంగా చాలా

సందర్భాలలో ఉద్యోగులు రాజకీయ జెఎసి చేతి

పావులుగా మారిపోయారు.
 ఇక తెలంగాణవాదాన్ని ప్రతిసారి ఎన్నికలతో

ముడిపెడుతున్న టిఆర్‌ఎస్ నైజాన్ని అవగతం

చేసుకోవడంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసిలు

విఫలవౌతున్నాయి. టిఆర్‌ఎస్ రాజకీయ ఎజెండాలో

కోదండరాం చిక్కుకోవడమేకాక ఉద్యోగ, ఉపాధ్యాయ

జెఎసిలను కూడా లాగుతున్నాడు. వారు పోతున్నారు.

పైగా సకల జనుల సమ్మెకాలంలో వచ్చిన బాన్సువాడ

ఉప ఎన్నికల విధుల్ని నిర్వర్తించమని (సమ్మెలో ఉన్నాం

కాబట్టి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి

హెచ్చరిక చేస్తే ఎన్నికలన్నా ఆగిపోయేవి. లేదా

ఉద్యోగులపైన చర్యలన్నా జరిగేవి. ఈ రెండింట్లో ఏది

జరిగినా, తెలంగాణ సాధన మార్గం సుగమం అయ్యేది.

అది జరక్కపోగా, సమ్మెచేస్తున్న ఉద్యోగులను,

ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు అనుమతించడం

ఉద్యోగ జెఎసి చేసిన తప్పిదం. మార్చిలో ఢిల్లీ వెళ్లినప్పుడు

తెలంగాణ బృందాన్ని కలవడానికి ఇబ్బంది పడిన

జైపాల్‌రెడ్డిని తిరిగి అక్టోబర్ 3న కలిసి భంగపడడం

గమనార్హం! ఒకరి తర్వాత ఒకరు సమ్మెను వీడుతున్న

అక్టోబర్ 18న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ

సమావేశంలో తిరిగి కెకె మాట్లాడుతూ, 48 గంటల్లో

తెలంగాణపై ప్రకటన వస్తుందని, లేదంటే దాని తర్వాతనే

కార్యాచరణ ప్రకటిస్తామని అదే ఆవేశంతో అనగా, సారధ్య

సంఘం నాయకుడైన జానారెడ్డి త్యాగంలో తానే

ముందుంటానని ప్రకటించడం కొసమెరుపు. ఆయన

త్యాగమేమో గాని శల్యసారధ్యం వహించి, ఉద్యోగుల్ని

సమ్మెను విరమింపచేయడంలో తన రాజనీతిని

నిరూపించుకున్నాడు. పైగా తాను రాజీనామాచేస్తే

తెలంగాణ వస్తుందంటే రాజీనామా చేయడానికి

సిద్ధమంటాడు. అంటే, తెలంగాణను ప్రకటిస్తానని

అధిష్టానం ఆయనకు హామీఇస్తే తప్ప ఆయన

రాజీనామా చేయడు! ఇదీ తెలంగాణ మంత్రుల స్థితి. వీరి

అవకాశవాద రాజకీయాల్ని ఎండగట్టలేని దైన్యస్థితి ఉద్యోగ

సంఘాల నాయకులది. ఈవిధంగా సకల జనులను

కదిలించిన సమ్మె మంత్రుల్ని, ఎంఎల్‌ఎల్ని, ఎంపిలని

కదిలించలేకపోవడమే ఒక చారిత్రక తప్పిదం.
 సరే! సకల జనుల సమ్మె సుఖాంతం కాకున్నా

ముగియనైతే ముగిసింది. తిరిగి ఎన్నికలొచ్చాయి.

విద్యార్థులకు పరీక్షలున్నాయి. వీటి తర్వాత వంద రోజుల

ఉద్యమమని ప్రకటనలు వస్తున్నాయి. కనీసం అలాంటి

వాయిదా ఉద్యమాల పట్లనన్నా ఉద్యోగులు,

ఉపాధ్యాయులు, కార్మికులు అప్రమత్తంగా ఉంటే తప్ప

తెలంగాణ రాజకీయ జెఎసి బాగుపడదని గ్రహించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి