12, మార్చి 2012, సోమవారం

లాజిక్‌కి అందని తెలుగు సినిమా



ఈ మధ్య కాలంలో వస్తున్న తెలుగు సినిమాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే, అసలు ఇలాంటి కథలు, పాత్రలు ఈ భూ గ్రహం మీద ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే? ఏ ఒక్క సన్నివేశం, పాత్ర కానీ లాజిక్‌కి అందకపోవడం, మరియు వాస్తవ జీవితానికి సుదూరంగా ఉండటం. సినిమాలో ఏదో ఒక పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. సదరు పాత్రలోని లక్షణాలు, హావభావాలు, ఎదురైన అనుభవాలు తనలో కూడా ఉంటే మురిసిపోతాడు. కానీ సినిమా అంటే లాజిక్‌తో పనిలేదన్నట్లుగా నేటి దర్శక, రచయితలు వ్యవహరిస్తున్నారు. నిజమే! సినిమాని సినిమాగానే, చూడాలి, లాజిక్‌తో పనిలేదు అని వాదించేవారూ ఉన్నారు. కానీ సినిమా అనేది వాస్తవ జీవితానికి కొంతలో కొంతైనా దగ్గరగా ఉండాలి. అప్పుడు అది ఖచ్చితంగా ప్రేక్షకాదరణకు నోచుకుంటుంది. యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్.ల కాలంనాటి సినిమాలని పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆ కాలంలో పాత్రలు చాలా సహజంగా, హుందాగా ఉండేవి. వారిలో ప్రేక్షకుడు తనని తాను చూసుకొని ఆనందపడేవాడు. ఆ తర్వాత శోభన్‌బాబు మధ్యతరగతి వ్యక్తుల జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు ధరించి, అన్ని రకాలైన ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. కృష్ణ, కృష్ణంరాజు వంటివారు కూడా సమాజానికి దగ్గరగా ఉండే పాత్రలు వేసి మెప్పించారు.
 ఇక కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే, సినిమాలోని ఇతర పాత్రలు అతనిని ఇబ్బందులకు గురిచేస్తుంటే సహజమైన హాస్యపు హావభావాలతో కూడిన సంఘర్షణని అద్భుతంగా పలికించేవాడు. ఉదాహరణకు ‘అప్పుల అప్పారావు’ సినిమాలో అప్పారావు పాత్ర నిజంగా సమాజంలోని చాలామంది వ్యక్తులని ప్రతిబింబిస్తుంది. అలాంటి అప్పుల అప్పారావులు సమాజంలో మనకు చాలామంది తారసపడుతుంటారు. అదే విధంగా వంశీ, జంధ్యాల వంటి దర్శకులు లాజిక్‌ని అస్సలు వదిలిపెట్టేవారు కాదు. వారి సినిమాలోని సన్నివేశాలు నిజ జీవితంలోని సంఘటనలకి చాలా దగ్గరగా ఉండేవి.
 వంశీ తన సినిమాలలో గోదావరి అందాలతోపాటు, గోదారి తీర ప్రాంత ప్రజల జీవన స్థితిగతులని, వారి మనోభావాలని ప్రతిబింబించేలా పాత్రలు తయారుచేసేవారు. జంధ్యాలగారు ‘అహనాపెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు పిసినారి పాత్ర బయట నిజ జీవితంలో ఎంతోమంది పిసినారి జనాలకు అద్దంపట్టేలా ఉంటుంది. కానీ ప్రస్తుత తరం దర్శక, రచయితలు లాజిక్‌ని గాలికి వదిలి హీరోగారికి అన్ని రకాలయిన అతీత శక్తులు కృత్రిమంగా ఆపాదిస్తూ ఆనందపడిపోతున్నారు. సినిమాలు అపజయం పాలవుతున్నా కూడా ప్లాప్ సినిమాలకు విజయయాత్రలు నిర్వహించుకుంటూ ఆనందపడుతున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా సినిమాలని ఇలా చూసి అలా మర్చిపోతున్నారు. లాజిక్‌ని వదిలేసి ఒకేసారి వందలాది మందిని నరకడం, సుమోలు గాలిలో లేపడం లాంటివి చేయడం వలన తాత్కాలికంగా సినిమా విజయం సాధించవచ్చు. వసూళ్లు రాబట్టవచ్చు, కానీ ప్రేక్షకుల మదిలో మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలే కలకాలం నిలిచిపోతాయనేది ఎవరూ కాదనలేని సత్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి