అవకాశం ఎప్పుడూ ఒకేసారి తలుపుకొడుతుంది..తీస్తే అదృష్టమే అని చాలా మంది అంటూ వుంటారు. ఇప్పుడు తెలుగునాట యువ నటుల వ్యవహారం చూస్తుంటే ఇదే గుర్తుకువస్తోంది. దాదాపు అందరూ యువనటులే. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు. పైగా రచయితలు కథలు అల్లేటపుడు ఇద్దరు ముగ్గురు హీరోలను దృష్టిలో పెట్టుకునే కథ అల్లుతున్నారు. ఒకరు నో, అంటే మరొకరైనా ఎస్ అంటారన్న ఆశతో. అందువల్ల సరైన కథ ఏ హీరోకి దక్కితే ఆ హీరో జాక్‌పాట్ కొట్టినట్లే.
ఇది ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి. బద్రి తరువాత పూరి కథలు ఇటు పవన్‌కు అటు రవితేజకు సూట్ అయ్యేలా వుండేవి. బద్రి తరవాత పూరి కథలు పవన్ వదిలేసాకే రవితేజకు వచ్చి హిట్ అయ్యాయని ఇండస్ట్రీ టాక్. నాగార్జున శివమణి కథలో హీరో పాత్రలో కూడా రవితేజ క్యారెక్టరైజేషన్ లక్షణాలు కనిపిస్తాయి.
కామెడీ ప్లస్ యాక్షన్ అన్నది శ్రీనువైట్ల ఫార్ములా. ఇప్పుడు దాదాపు అదే అందరు దర్శకుల బాణీ అయిపోయింది. దాంతో అందరు హీరోలూ అటే మొగ్గుతున్నారు. సో, సరైన కామెడీ కథను కాస్త అటుఇటు చేస్తే పెద్ద హీరోకి కూడా నప్పే అవకాశం వుంది. పూలరంగడు సినిమా తీసుకుంటే, ఇటు అల్లరి నరేష్ నుంచి అటు రామ్ వరకు ఎవరికైనా నప్పే కథ అది. సునీల్‌కు దొరికింది. మర్యాదరామన్న కథ నరేష్‌కు దొరికివుంటే. దూకుడు కథ కూడా అలాంటిదే. సీరియస్‌నెస్, రిచ్‌నెస్ తగ్గిస్తే అది అల్లరి నరేష్‌కు సరిపోతుంది. పూరి బిజినెస్‌మెన్ కథ డాన్‌శ్రీను కథకు దగ్గరగా వుంటుంది. పాత పగను దృష్టిలో వుంచుకుని డాన్ అవ్వాలని వచ్చినవాడు రవితేజ. అదే విధంగా పాత పగను దృష్టిలో వుంచుకుని, వ్యవస్థతో అడుకోవాలనుకున్నవాడు మహేష్. బాడీగార్డ్ కథ చిన్న చిన్న మార్పులతో మూడు నాలుగు భాషల హీరోలకు సరిపోయింది. రామ్ కందిరీగ కథ రవితేజకు వినిపించి
వుంటే ఎలావుండేది.
ఇష్క్
సినిమానే చూడండి.
సెకండాఫ్
అంతా అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. అదే కథ అతగాడి దగ్గరకు ముందు వచ్చి వుంటే? ఖాతాలో ఓ హిట్ పడేది.
హీరోల సంగతి పక్కన వుంచితే ప్రొడ్యూసర్ల జడ్జిమెంట్ కూడా అలాగే వుంది. బొమ్మరిల్లు కథ ఎందరో ప్రొడ్యూసర్ల దగ్గరకు వెళ్లి వచ్చాకే దిల్‌రాజ్‌కు సొంతమయింది. హ్యాపీడేస్ ఎవరూ ఆసక్తి కనబర్చకే శేఖర్ కమ్ముల స్వయంగా తీసుకున్నాడని అంటారు.
దానాదీనా తేలేదేమిటంటే ఇప్పుడు హీరోలకు, నిర్మాతలకు కావాల్సింది, కాస్త కథలు వినగలిగే ఓపిక. దాని మంచి చెడ్డలు నిర్ణయించగల సత్తా. కానీ మిగిలిన అన్నింటికన్నా కథలు వినడానికి కాస్త తక్కువ సమయం కేటాయిస్తారన్న ప్రచారం తెలుగు సినిమా రంగంలో వుంది. అందునా చాలా మంది హీరోల తమ్ముళ్లో,
అన్నలో,
అప్పచెల్లెళ్లో,
తండ్రులో
కథలు వింటారని, బేరాలు
చేస్తారని, వారి
నిర్ణయం
పైనే హీరోలు ఆధారపడతారని కృష్ణానగర్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇవి ఎంతవరకు నిజమన్నది కాదు ప్రశ్న. నిజం కాకూడదన్నదే పాయింట్. హీరో మనుగడకు అసలైన అవసరం మంచి కథ. తద్వారా వచ్చే మంచి సినిమా. అందువల్ల హీరోల మొదటి ప్రాధాన్యత కథలు వినడమే కావాలి. అలా అని అల్లాటప్పాలు అందరి కథలూ వినాల్సిన పనిలేదు.సత్తా వున్న అసిస్టెంట్లు, కొత్త దర్శకులు వచ్చినపుడు కాస్త
తీరుబాటు చేసుకుంటే చాలు. ఏ అసిస్టెంట్ దగ్గర ఏ కొత్త పాయింట్ వుందో ఎవరికి తెలుసు. చాలా మంది హీరో హీరోయిన్లు అంటుంటారు..‘ఆ కథ నేనే
చేయాల్సింది. కాల్‌షీట్లు
ఎడ్జెస్ట్ అవక మిస్సయ్యాను’ అని. ఇటువంటివి పైపై మాటలని అందరికీ
తెలుసు. ‘నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను’ అన్నది అసలు సంగతి అయి వుంటుంది. ఇటువంటి డైలాగులు చెప్పే పరిస్థితి రాకుండా, మంచి కథ తమను దాటి పోకుండా వుండాలంటే హీరోలు, నిర్మాతలు చేయాల్సింది, కథలు వినడానికీ కాల్‌షీట్లు కేటాయించుకోవడం.
లేకుంటే యువనటుల సంఖ్య పెరిగి, పోటీ అపరిమితమై, హిట్లు పరిమితమవుతున్న కాలంలో అవకాశాలు చేజారి, అదృష్టం దూరమవుతుంది. తస్మాత్ జాగ్రత్త!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి