16, డిసెంబర్ 2011, శుక్రవారం

రెడ్డి కాపుల పోరు

 కాంగ్రెస్‌లో సం'కుల' సమరానికి తెరలేచింది. పార్టీలో కొన్ని దశాబ్దాల నుంచి పెత్తనం సాగిస్తున్న రెడ్డివర్గానికి చెక్‌ పెట్టేందుకు కాపులు సమరోత్సాహంతో పావులు కదుపుతున్నారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కాపులలో కొత్త ఉత్సాహం తొంగిచూస్తోంది. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అది పొంగి పొర్లుతోంది. ఈ ఇద్దరూ కలిసిన తర్వాత కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు ఆసక్తిరమైన మలుపు తిరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు పార్టీపై పట్టుబిగిస్తూ వస్తున్న రెడ్డి వర్గానికి బొత్స-చిరంజీవి రూపంలో కాపుల నుంచి కొత్త సవాల్‌ ఎదురవుతోంది. పి.శివశంకర్‌, డి.శ్రీనివాస్‌, వి.హన్మంతరావు, కేశవరావు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ వంటి కీలక శక్తులు దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్నప్పటికీ వారికి సీఎం పదవి చేపట్టే అవకాశం రాలేదు.

 

వీరిలో పి.శివశంకర్‌, డి.శ్రీనివాస్‌, వి.హన్మంతరావు, కేశవరావు, మున్నూరు కాపు అయినప్పటికీ, తెలంగాణలో ఆ వర్గం కూడా తమకు తాము మానసికంగా కాపులుగానే భావిస్తోంది. బొత్స సాంకేతికంగా తూర్పు కాపు (బీసీ) అయినప్పటికీ, అధిష్ఠానం దృష్టిలో కాపు నేతగానే ముద్రపడ్డారు. ఆయన తన రాజకీయ మనుగడ కోసం కాపులతోనే ఎక్కువ సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాపులు సైతం ఆయనను తమ వర్గ నేతగానే అంగీకరిస్తున్నారు. అసలు రాష్ట్రంలో కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంతవరకూ లభించనేలేదు. ఈ అసంతృప్తి చాలా ఏళ్ల నుంచి రగులుతున్నా, అందుకు తగిన అవకాశం, సందర్భం ఇప్పటివరకూ రాలేదు.

 

శివశంకర్‌ వంటి నేతకు దివంగత ఇందిరాగాంధీ తోనే సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదు. వి.హన్మంతరావుకూ రాజీవ్‌, సోనియాల వద్ద పలుకుబడి ఉన్నప్పటికీ ఆయనదీ అదే పరిస్థితి. డి.శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఆ సమయంలో ఆయన చట్టసభల్లో సభ్యుడు కాకపోవడం, 2004లో గెలిచినప్పటికీ ఆయన అవకాశాన్ని వైఎస్‌ ఎగరేసుకుపోవడంతో కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయినట్టయింది.

 

1989కు ముందు ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ, కోస్తాలో కాపులకు తిరుగులేని నేతగా ఉన్న దివంగత వంగవీటి రంగా హత్య కారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపులంతా టీడీపీపై ప్రతీకారంతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాపు-బీసీ-బ్రాహ్మణ వర్గాలను ఒక్కతాటిపైకి చేర్చడంలో విజయం సాధించిన వంగవీటి రంగా ఢిల్లీలో అజ్ఞాతంలో ఉన్న సమయంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో, దేవినేని నెహ్రు బాహాటంగానే రంగాను సమర్థించిన వైఎస్‌ను దుమ్మెత్తిపోశారు. సాటి ఎమ్మెల్యేగా కాకుండా రంగా అడ్వకేట్‌లా మాట్లాడుతున్నావంటూ వైఎస్‌ను విమర్శించారు. నాటి నుంచీ నేటి వరకూ కాపు సామాజికవర్గంలో మెజారిటీ శాతం కాంగ్రెస్‌కు, ప్రధానంగా వైఎస్‌కు వ్యక్తిగత మద్దతుదారుగానే కొనసాగుతోంది.

 

అయినప్పటికీ మంత్రి, కార్పొరేషన్‌ వంటి చిన్న పదవులతోనే తమను సంతృప్తి పరచడాన్ని కాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. 'సాయిప్రతాప్‌ను కేంద్రమంత్రివర్గం నుంచి తప్పించడం, దాసరికి చెక్‌ పెట్టేందుకు చిరును ప్రోత్సహించడం, ఎమ్మెల్సీ కోలా రాజ్యలక్ష్మి మృతి తర్వాత కాపులకు మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండును ఒక పథకం ప్రకారం తొక్కిపెట్టారు. ఇదంతా కాపులను పైకి ఎదగనీయకుండా చేస్తున్న కుట్రలో భాగం. అందుకే మాకు సీఎం పదవి కావాలి. మమ్మల్ని కాంగ్రెస్‌ పనిముట్టులా వాడుకుంటోంది. చిన్న చిన్న పదవులు విసిరేస్తోంది. గృహనిర్మాణ, పర్యాటక వంటి అప్రాధాన్యశాఖలు ఇస్తోంది. మాకు భిక్ష అవసరం లేదు. సీఎంసీటు కావాల'ని కాపు రాష్ట్ర యువసేన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌నాయుడు వ్యాఖ్యానించారు.

 

2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కొత్త పార్టీ స్థాపించిన తర్వాత కాపు-బలిజ వర్గాల ఆలోచనా ధోరణిలో అనూహ్య మార్పు వచ్చింది. ఇంతవరకూ కాపుల నుంచి ఎవరూ సీఎం కాకపోవడం, చిరంజీవికి సినీగ్లామర్‌ ఉన్నందున ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున, చిరు ప్రజారాజ్యం పార్టీకి పట్టం కట్టాలని ఆ రెండు సామాజికవర్గాలు భావించాయి. అదేవిధంగా, తెలంగాణలో మున్నూరు కాపులు కూడా పీఆర్పీకి అనుకూలంగా మొగ్గు చూపారు. ఫలితంగా, అంతకుముందు కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించిన ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ వంటి జిల్లాల్లో ఓట్ల శాతం దెబ్బతిని, ఆ ఓట్లు పీఆర్పీకి పోలవడంతో కాంగ్రెస్‌కు సీట్లు-ఓట్లు దెబ్బతిన్నాయి.

 

పీఆర్పీకి వచ్చిన 74 లక్షల ఓట్లలో సింహభాగం కాంగ్రెస్‌వే. దాని వల్ల గుంటూరు, కృష్ణా వంటి జిల్లాల్లో టీడీపీ లాభపడింది. అయితే, పీఆర్పీ అధికారంలోకి రాకపోవడంతో ఆ రెండు వర్గాల్లో నిరాశ ఏర్పడింది. వైఎస్‌ సీఎం అయిన తర్వాత కాపులు తమ వెంట లేరని గ్రహించి ఆ వర్గం జనాభా-పలుకుబడి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక్క కాపు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుండా, బీసీ అయిన బోస్‌, ఎస్సీ నుంచి విశ్వరూప్‌నకు మాత్రమే అవకాశం కలిగించారు. దీనితో తాము ప్రభుత్వానికి దూరమవుతున్నామన్న ఆలోచనతో పీఆర్పీలో చేరిన చాలామంది కాపు నేతలు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు.

 

ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లోకి తీసుకువస్తే కాపులంతా తిరిగి పార్టీలోకి వస్తారని వైఎస్‌ స్వయంగా సోనియాకు లేఖ రాయడం, ఆ మేరకు చిరంజీవితో మంతనాలు జరిగాయి. స్వయంగా వైఎస్‌ కూడా నాటి పీఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ద్వారా విలీన ప్రతిపాదనను చిరుకు పంపించారు. ఫలితంగా చిరు పార్టీ నాటి నుంచీ కాంగ్రెస్‌కు అనధికార మిత్రపక్షంగానే కొనసాగింది.చిరంజీవి కాంగ్రెస్‌లో చేరడం, బొత్స పీసీసీ చీఫ్‌ కావడంతో కాపుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన తీరుపై విమర్శలు వెల్లువెత్తడం, ఆయన కొనసాగుతారా లేదా అన్న చర్చ మొదలవడ ంతో.. ఈసారి ఎట్టి పరిస్థితిలో సీఎం పీఠం చేజిక్కించుకోవాలన్న పట్టుదల ఎక్కువయింది.

 

దానికితోడు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సీఎం సీటుపై కన్నేయడం, చిరంజీవి కూడా అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుండటంతో ఈసారి తమ సామాజికవర్గానికి సీఎం పదవి దక్కడం ఖాయమన్న నమ్మకం వారిలో పెరిగింది. అయితే.. రెడ్డి వర్గం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పెత్తనంపై పట్టు జారకూడదన్న ధోరణితో వ్యవహరిస్తోంది. కాపులకు సీఎం సీటు దక్కకూడదన్నట్లు పనిచేస్తోంది. చిరంజీవికి చెక్‌ పెట్టేందుకు దాసరి నారాయణ రావును తెరపైకి తీసుకురావాలని సీఎం యోచిస్తున్నారు.

 

కిరణ్‌కు మార్‌రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన మంత్రివర్గ విస్తరణలో కీలక శాఖలన్నీ రెడ్లకే కట్టబెట్టారు. దానిపై బొత్స అప్పుడే విరుచుకుపడ్డారు. కాపు వర్గానికి చెందిన వట్టి వసంతకుమార్‌ అయితే తొలి క్యాబినెట్‌ భేటీకే హాజరుకాకుండా, ఢిల్లీ వెళ్లి కిరణ్‌పై ఫిర్యాదు చేశారు. ఆర్ధిక, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, భారీ నీటిపారుదల, వైద్యవిద్య, హోం, న్యాయశాఖ, సమాచార వంటి కీలకమైన శాఖలన్నీ రెడ్లకే ఇవ్వడం ద్వారా కిరణ్‌ రెడ్ల పక్షపాతి అన్న ముద్ర వేయించుకున్నారు. మళ్లీ తాజాగా రాజీవ్‌ యువకిరణాల పథకానికి కేసీ రెడ్డిని వైఎస్‌ చైర్మన్‌గా నియమించి, ఏకంగా క్యాబినెట్‌ హోదా కల్పించారు.

 

అటు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా రెడ్ల పెత్తనమే కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్‌ మంత్రి జానారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే జానారెడ్డికి తెలంగాణ కోటాలో సీఎం ఇప్పించేందుకు ఆయన రాజకీయ గురువు, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కోస్తా కాంగ్రెస్‌ రెడ్లు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారు. ఒకదశలో జానా సీఎం అవుతారన్న ప్రచారం భారీగానే జరిగిన విషయం తెలిసిందే. అటు రాయలసీమలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జెసి దివాకర్‌రెడ్డి, కోస్తాలో ఆనం రామనారాయణరెడ్డి, గాదె వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించారు. పార్టీపై తమ పెత్తనం కొనసాగాలని, ఒకవేళ కిరణ్‌ను మారిస్తే మళ్లీ తమ సామాజికవర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రిని చేయాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.

 

ఈ అంశంలో ప్రాంతాలు, వ్యక్తిగత అభిప్రాయబేధాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని పక్కకుపెట్టి కులం కోణంలో ఒక్కతాటిపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే, పార్టీపై పెత్తనం చెలాయిస్తోన్న రెడ్లకు చెక్‌ పెట్టేందుకు ఇదే సరైన అదనుగా కాపు వర్గం భావిస్తోంది. ఆ పట్టుదలతోనే బొత్స-చిరు రెడ్లను ఎదుర్కొంటున్నారు. కిరణ్‌ను మారిస్తే ఆ అవకాశం దక్కించుకునేందుకు ఒక్కటిగా వ్యవహరిస్తూనే, ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయత్నిస్తున్న వైచిత్రి కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గంలో మెజారిటీ శాతం జగన్‌ పార్టీ వైపు వెళ్లిపోతున్నందున, ఇక ఆ తర్వాత పలుకుబడి గల సామాజికవర్గమైన తామే పార్టీని ఆదుకుంటామన్న సంకేతాలిస్తున్నారు.

 

జగన్‌ పార్టీ వీడటం ఒకరకంగా కాపులకు లాభించింది. రెడ్లంతా జగన్‌ వైపు వెళ్లకుండా ఉండేందుకే తాను రెడ్లకు కీలక శాఖలు కట్టబెట్టానని కిరణ్‌ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, జగన్‌ పార్టీ స్థాపించిన తర్వాత వెళ్లిన వారిలో సింహభాగం రెడ్లే కావడంతో, కిరణ్‌ వాదన తప్పని వాదించేందుకు బొత్సకు ఒక అవకాశం లభించింది. రెడ్ల స్థానంలో కాపులను భర్తీ చేసి పార్టీని కాపాడతామని బొత్స-చిరు ఇద్దరూ అధిష్ఠానానికి హామీ ఇస్తున్నారు. కిరణ్‌ పనితీరు, వ్యవహారశైలిపై ఢిల్లీలో అసంతృప్తి మొదలయిన క్రమంలో, దానిని పెంచి పెద్దది చేసి, ఈసారయినా కాపు వర్గం నుంచి సీఎం పీఠమెక్కాలన్న లక్ష్యంతో బొత్స పావులు కదుపుతున్నారు.

 

ఇదీ కాంగ్రెస్‌లో కాపు - రెడ్ల లెక్క !

మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో రెడ్లు 47 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్‌ పార్టీకి అందులో 7 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. అంటే సాంకేతికంగా ఆ పార్టీకి 40 మంది రెడ్లే మిగిలారు. అయితే, పీఆర్పీకి చెందిన శ్రీధరకృష్ణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌లో 42 మంది రెడ్లు ఉన్నట్టయింది. అదే.. కాంగ్రెస్‌కు అంతకుముందు 21 మంది కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, బలిజ ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు పీఆర్పీ విలీనం కావడంతో ఆ పార్టీకి చెందిన 10 మంది కాపులతో కలిపి ఆ సంఖ్య 31 మందికి చేరింది. అయితే, కొండా సురేఖ వైఎస్సారెస్‌ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు 30 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నట్టయింది. వారిలో 15 మంది కాపులు, 10మంది మున్నూరు కాపులు, నలుగురు తూర్పు కాపులు, ఇద్దరు బలిజలు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి