3, డిసెంబర్ 2011, శనివారం

అలెగ్జాండర్ ద గ్రేట్ ...సాక్షి ఫ్యామిలీ

అలెగ్జాండర్ ద గ్రేట్

బయోగ్రఫీ
సింహం గర్జిస్తుంది.
పులి గాండ్రిస్తుంది.
ఏనుగు ఘీంకరిస్తుంది.
అలెగ్జాండర్ ‘నేనొస్తున్నా’ అంటాడు!
ఈ మాట చాలు...
రాజులు, సామంతులు, సామ్రాట్టులు, చక్రవర్తులు
గుబగుబలాడేందుకు! గజగజమనేందుకు!!
అతడేం చేస్తాడు? చెప్పి మరీ వస్తాడు, స్వాధీనం చేసుకుంటాడు, వెళ్లిపోతాడు. అంతే!
ఇంత చిన్నవయసులో అతడెలా ప్రపంచాన్ని జయించాడని రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ వలవలా విలపించాడు...
తనకాపని చేతకానందుకు!
ఐరోపాను జయించేందుకు తిప్పలు పడ్డ నెపోలియన్ కూడా అలెగ్జాండర్‌ను అదేపనిగా పదేపదే తలుచుకున్నాడు!
అతడి వ్యూహాలు అంతుచిక్కనందుకు!
ప్రపంచ యుద్ధాల సైనికాధికారులైతే అలెగ్జాండర్ పటం కట్టుకుని మరీ
ఘడియ ఘడియకు అతడి నుంచి స్ఫూర్తి పొందారు.
ఇంతమంది గ్రేట్ ఎంపరర్‌ల చేత, గ్రేట్ జనరల్స్ చేత సెల్యూట్ కొట్టించుకుని ‘ద గ్రేట్’ అనిపించుకున్న అలెగ్జాండర్ అసలు గొప్పదనం ఏమిటి? ఇదే ఈవారం బయోగ్రఫీ.

అలెగ్జాండర్ ద గ్రేట్!
ఎందులో గ్రేట్? ఎలా గ్రేట్?
రెండు ప్రశ్నలు.
ముప్పై రెండు సమాధానాలు!!

*********

ముప్పై రెండేళ్ల వయసంటే - చక్రవర్తికికైనా, తత్వవేత్తకైనా ఎదిగే వయసు! సరిగ్గా ఆ వయసులో చనిపోయాడు అలెగ్జాండర్!! కానీ అప్పటికే అతడు ఎదగవలసినంతగా ఎదిగాడు. ఒదగవలసినంతా ఒదిగాడు.
చక్రవర్తిగా, ఏకఛత్రాధిపతిగా ఎదిగాడు.
తాత్వికుడిగా, సామాన్యుడిగా ఒదిగాడు.
చివరికి ఒట్టి చేతులతో ఒక ‘మనిషి’గా మిగిలాడు.
క్రీ.పూ. 356-323 మధ్య ప్రపంచ చరిత్రను ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగించినా ఏదో ఒక దారిలో అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్రం మీద వస్తూనో, వెళుతూనో కనిపిస్తాడు.
పదునైన అతడి ఖడ్గానికి కుప్పకూలిన యుద్ధభూమి ప్రత్యర్థులు ఏ తోవలోనో కంకాళాలై కాళ్లకు వేళ్లకు అడ్డు తగులుతూనే ఉంటారు.
ఆసియా తీరప్రాంత ఇసుక దిబ్బలలో ఈ జైత్రయాత్రికుడు నౌక దిగకనే బలంగా విసిరిన పొడవాటి బల్లేలు... గ్రీసు ఆక్రమిత రాజ్యాలకు కొత్త భౌగోళిక గుర్తులుగా దిగబడి ఉంటాయి!
అలాగని యుద్ధం మాత్రమే చేయలేదు అలెగ్జాండర్. ప్రపంచ సంపదలను, సంస్కృతులను సమైక్యం చేయాలని చూశాడు. యుద్ధానికి వెళ్లినప్పుడు దొరికిన వజ్రాలను మూట కట్టుకుని వచ్చినట్లే, గ్రీస్ దేశానికి పరిచయం లేని పక్షులను, పూల మొక్కల విత్తనాలను, ఖనిజాలను, దాల్చిన చెక్కల వంటి సుగంధ ద్రవ్యాలను వెంట తెచ్చుకున్నాడు! నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అందరివీ అన్నాడు. భూమికి ఒకే చక్రవర్తి ఉండాలన్నాడు. ఆ ఒక్కడు తనే కావాలనుకున్నాడు.
అలెగ్జాండర్ కొద్దిపాటి జీవితకాలంలో అన్నీ గొప్పగా ప్రారంభమై గొప్పగా ముగిసిన అంకాలే.
ఒక గొప్ప తండ్రి కి గొప్ప కొడుకు అతడు. ఒక గొప్ప గురువుకు గొప్ప శిష్యుడతడు. ఒక గొప్ప రాజ్యానికి గొప్ప చక్రవర్తి అతడు.

*********

అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్! రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యూహకర్త, అతడు అడుగు బైటికేస్తే సామ్రాజ్య విస్తరణే!
ఆ తండ్రి కొడుకు అలెగ్జాండర్. ఉంటే తండ్రిలా ఉండాలి. లేదంటే తండ్రిని మించిపోవాలి. రెండోదే జరిగింది. ఇవాళ గనుక అలెగ్జాండర్... అలెగ్జాండర్ ద గ్రేట్ కాకపోయి ఉంటే, ఫిలిప్ ద గ్రేట్ ఒక్కడే చరిత్రలో మిగిలి ఉండేవాడు. ఇంతకీ అలెక్స్... తండ్రి పేరు నిలబెట్టాడా? తండ్రి పేరును దోచుకున్నాడా? రెండూ ఒకటే.
అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్! గ్రేట్ ఫిలాసఫర్. రాజనీతితో పాటు శిష్యుడికి లోకరీతీ చెప్పాడు. దగ్గర కూర్చోబెట్టుకుని సకల శాస్త్రాలను చదివించాడు. హోమర్ ‘ఇలియడ్’ను, ‘ఒడిస్సీ’ని ఉగ్గులా పట్టించాడు. వ్యాస భారతం, వాల్మీకి రామాయణం ఎలాగో... గ్రీకు పురాణాల్లో హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ అలాగ! రాత్రివేళ అలెగ్జాండర్ తలగడ కింద కస్సున దిగబడే బాకు ఉండేది. బాకు పక్కకే ఇలియడ్ ఉండేది. కలలు దిగ్గున లేపినప్పుడు ఇలియడ్ తీసి చదువుకుంటాడు అలెగ్జాండర్.
గురుశిష్యులలో ఎవరి వల్ల ఎవరు నిలబడ్డారు? ఇద్దరి వల్ల ఇద్దరూ.
అలెగ్జాండర్ రాజ్యం మేసిడోనియా! గ్రీకుల సాంస్కృతిక కేంద్రం. తండ్రి ఫిలిప్‌ను శత్రువులు హతమార్చినప్పుడు మేసిడోనియా ఒంటరిదయింది. అలెగ్జాండర్ రాజయ్యాడు. అప్పటికి అతడి వయసు రెండు పదులు. పీఠం మీద కూర్చుని తీక్షణంగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చూశాడు అలెక్స్. తలలు ఎగరేసిన విలీన రాజ్యాలు కనురెప్పలు దించుకున్నాయి. గ్రీసుకు ఉత్తరాన ఉన్న థేబ్స్ తోకాడించింది. సేనలు నిర్దాక్షిణ్యంగా అణిచేశాయి. అలెగ్జాండర్ పిల్లవాడు కాదనే సందేశం వెళ్లింది. ‘పిడుగు వాడు’ అనే భయం మొదలైంది.
అలెగ్జాండర్ వల్ల మేసిడోనియా బలపడిందా? మేసిడోనియా ఒడిలో అలెగ్జాండర్ రాటుతేలాడా? ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అలెక్స్, మేసిడోనియా వేర్వేరు కాదు.

*********

ముప్పై రెండులో ఇరవై పోతే పన్నెండు.
ఈ పన్నెండేళ్లలో అలెక్స్ తన గజతురగపదాతి సైన్యాలతో ప్రపంచ పటంలోని భూమండలాల అక్షాంశ రేఖాంశాలనే మార్చేశాడు! ఇరవై రెండవ యేట ఆసియా మైనర్ (టర్కీ) అతడి వశం అయింది. ఇరవై ఐదవ యేట పర్షియా పాదాక్రాంతం అయింది. తర్వాత ఏడేళ్లలో ... ఇప్పటి యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు అన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ అధీనంలోకి వచ్చాయి.
ఖండాలను జయించిన అఖండ ఖ్యాతి ఇంత చిన్న వయసులో అలెగ్జాండర్‌కి తప్ప ఏ చక్రవర్తికీ దక్కలేదు! శతాబ్దాల అనంతరం కూడా ఏ జనరల్‌కూ అలెక్స్ వ్యూహం ఏమిటో అంతుపట్టలేదు. అందుకే... ప్రాచీనకాలపు గొప్ప గొప్ప చక్రవర్తులు సైతం అలెగ్జాండర్‌ని ఒక కారణంతో ద్వేషించి, మరొక కారణంతో ముచ్చటపడ్డారు. అలాంటి కొడుకు, అలాంటి సోదరుడు, అలాంటి భర్త, అలాంటి తండ్రి, అలాంటి చక్రవర్తి... ఉన్నట్లు, ఉంటే బాగుండేదన్నట్లు ఏ కాలపు పౌరులైనా, రాజ్యాలైనా కనే ఒక కమ్మటి కల.
అలెగ్జాండర్ పాలన అనంతరం రెండున్నర శతాబ్దాల తర్వాత - రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ స్పెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు అతడి విగ్రహాన్ని చూస్తూ కొన్ని క్షణాలు ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఎలా సాధ్యమయింది ఇతడికి - ఇంత చిన్న వయసులో - భూగోళం మొత్తాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం’ అని విస్మయం చెందాడు. తనకెందుకు సాధ్యం కావడం లేదని మౌనంగా విలపించాడు.
పద్దెనిమిదవ శతాబ్దపు ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ కూడా క్త్రీస్తుపూర్వపు జగదేకవీరుడు అలెగ్జాండర్‌ను రహస్యంగా ఆరాధించినవాడే. అలెక్స్ యుద్ధ తంత్రాలను నెపోలియన్ అధ్యయనం చేశాడు.
రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి అమెరికా సైనిక అధికారి జార్జి ప్యాటన్ అయితే అలెగ్జాండర్‌కు వీరాభిమాని.
ఇలా వందలు, వేల ఏళ్లుగా అలెక్స్ స్ఫూర్తి తరం నుంచి తరానికి యుద్ధభూములలో కంచుఖడ్గమై మొలకెత్తుతూనే ఉంది. యుద్ధం చేస్తే అలెగ్జాండర్‌లా చెయ్యాలి. విజయాలు సాధిస్తే అలెగ్జాండర్‌లా వరుస విజయాలు సాధించాలి. ఇదీ ఏ కాలంలోనైనా సామ్రాజ్యవాదుల జీవిత లక్ష్యం.
కానీ అదంత తేలిగ్గా నెరవేరే లక్ష్యం కాదు. ఎందుకంటే అలెక్స్ అధికార కాంక్షతో మాత్రమే యవనాశ్వాలనెక్కి ఖడ్గం తిప్పలేదు. అధిక్యం కోసం, గొప్పతనం కోసం సమర శంఖం పూరించలేదు. అనవసరంగా ఒక అడుగు ముందుకు వేయలేదు. అవసరమైనప్పుడైనా అరంగుళం వెనక్కి జరగలేదు. అలెగ్జాండర్ మొదలు పెట్టిన యుద్ధాలన్నీ ప్రత్యేక కారణంతోనో, ప్రతీకారన్యాయంతోనో జరిగినవే.

*********

తండ్రి ఫిలిప్ శౌర్యం, తల్లి ఒలింపియస్ సౌందర్యం కలిస్తే... అలెక్స్. ప్రాచీన గ్రీకు పట్టణం ‘పెల్లా’ అతడి పుట్టినిల్లు. ‘కొడుకంటే తల్లికి వల్లమాలిన ప్రేమ’ - అన్నంత వరకే చెప్పి చరిత్ర చేతులెత్తేసింది. తల్లీ కొడుకుల అనుబంధాన్ని వెల్లడించే సంఘటనలు కానీ, సందర్భాలు కానీ చరిత్రకారులు సరిగా నమోదు చెయ్యలేకపోయారు. ‘‘దైవానుగ్రహం వల్ల పుట్టిన బిడ్డవురా నువ్వు’’ అని ఒలింపియస్ ముద్దుచేస్తుండేవారట అలెక్స్‌ను.
పన్నెండేళ్ల వరకు అలెగ్జాండర్‌కు తల్లే స్నేహితురాలు. ఎప్పుడూ ఏవో మంతనాలతో తీరికలేకుండా ఉండే తండ్రి నుంచి తనకు దక్కవలసిన ప్రేమకు రెండింతలు తల్లి దగ్గర్నుంచి రాబట్టేందుకు అలెగ్జాండర్ ఆమె సతాయించి సతాయించి సతమతం చేసేవాడు. ఒకరోజు గుర్రం స్వారీ చేస్తానన్నాడు. తల్లి వద్దంది. పడిపోతావ్ అంది. ఇంకా కొన్నాళ్లు ఆగమంది. అలెగ్జాండర్ వినలేదు. ‘‘నా మీద నీకు ప్రేమ లేదు’’ అన్నాడు. తల్లి తల్లడిల్లింది. జాగ్రత్తగా గుర్రం ఎక్కించింది. జారి పడబోయాడు. ఆమెకు ప్రాణం పోయినంత పనైంది. భద్రంగా కొడుకుని చేతుల్లోకి అందుకుంది.
అలెగ్జాండర్ రోజుకో సాహసం చేస్తున్నాడు. రోజుకో రకంగా తల్లిని యాతన పెడుతున్నాడు. యాతనలను దాచేసి సాహసాలను మాత్రమే రాణి ఒలింపియస్ భర్తకు చెబుతోంది. ఓరోజు అలా చెబుతూ చెబుతూ కొడుకు వైపు మురిపెంగా చూసింది.
కత్తిని తిప్పుతున్నాడు అలెగ్జాండర్! ‘‘తగిన గురువును వెతకవలసిన సమయం ఆసన్నమయింది’’ అన్నాడు ఫిలిప్.
‘తగిన గురువు’ అంటే అతడి ఉద్దేశం వేరు. విద్యాబుద్ధులొక్కటే కాదు అతడికి కావలసింది. తన ఆశలను నెరవేర్చేలా కొడుకును తీర్చిదిద్దాలి. ఫిలిప్‌కు పెద్ద ఆశ ఉంది. గ్రీసు దేశానికి తను సార్వభౌమాధిపతి కావాలి. అది తన జీవిత కాలంలో నెరవేరుతుందా? నమ్మకం లేదు. శత్రువులు తన కోసం పొంచి ఉన్నారు. ఏ క్షణమైనా తనను అంతమొందిస్తారు. తను పోయినా, తన ఆశ ఉండిపోవాలి. కొడుకు దానిని నిజం చేయాలి. అందుకే వెదకి వెదకి అలెక్స్‌కు గురువుగా అరిస్టాటిల్‌ను ఎంపిక చేశాడు.
ఏటికేడాది ప్రయోజకుడౌతున్నాడు కొడుకు. గ్రీకు రాజ్యాలన్నిటినీ ఒకటొకటిగా జయిస్తున్నాడు తండ్రి. మధ్యమధ్యలో - కొడుకు విద్యాభ్యాసం ఎలా సాగుతోందో గురువును ఆరా తీస్తున్నాడు.
అలెక్స్‌కు పద్నాలుగేళ్లు వచ్చాయి. విరామకాలంలో గురుకులం నుంచి రాజప్రాసాదానికి చేరుకున్నాడు. ఆప్యాయంగా అతడి ఒళ్లు నిమిరింది తల్లి. కరుకు తేలిన అతడి అరచేతిని తడిమి, పుత్రోత్సాహం పొందాడు తండ్రి.
తన కొడుకు తనలా అందగాడే అనుకుంది తల్లి. ఆడపిల్లలు అలెక్స్‌ను చాటుగా చూడ్డం ఆమె కంటపడింది! తన కొడుకు తనలా ధీరుడేనని అతడి నడక, చూపు చూసి అనుకున్నాడు తండ్రి. అలెక్స్‌కు ఎదురొస్తున్నవారు గౌరవంగా పక్కకు తప్పుకోవడం అతడు గమనించాడు. అప్పటికప్పుడు తనయుడిని గ్రీసు పీఠం మీద కూర్చోబెట్టాలన్నంత ఉబలాటంగా ఉంది ఫిలిప్‌కి.

*********

అలెగ్జాండర్ ఇరవయ్యవ యేట అడుగుపెట్టాడు.
ఫిలిప్ జైత్రయాత్ర పూర్తి కావచ్చింది. అప్పటికే గ్రీకు రాజ్యాలన్నీ అతడి వశమై ఉన్నాయి. ఏథెన్స్ కూడా స్వాధీనమయింది. ఇంతలో హఠాత్తుగా ఎవరో ఫిలిప్‌ను హత్య చేశారు.
తండ్రి మరణంతో అలెగ్జాండర్ రారాజయ్యాడు. అతడి చదువు ఆగిపోయింది. గురువు అరిస్టాటిల్ పరదేశం బయల్దేరాడు. ఆయనకు ఎనిమిది వందల నాణేలు ఇచ్చి పంపాడు అలెక్స్. వాటి విలువ ఇప్పుడైతే కనీసం యాభై లక్షల డాలర్లకు తక్కువ ఉండదని అంచనా.
‘‘గురువుకు ఎంత ఇచ్చినా తక్కువే’’ అంటాడు అలెగ్జాండర్. గురువును మించిన శిష్యుడు కూడా కాబట్టి ‘ఎన్ని రాజ్యాలను జయించినా చక్రవర్తికి తక్కువే’ అని కూడా అనుకున్నాడు అలెగ్జాండర్?
ఓరోజు రాత్రి -
నూట యాభై ఏళ్ల క్రితం నాటి గ్రీకు పౌరుల ఆత్మలు అతడిని తట్టిలేపాయి. పర్షియన్‌లపై ప్రతీకారం తీర్చుకుని తమను శాంతిపజేయమని రోదించాయి. తనను నిద్ర లేపింది కన్నీటి బొట్లా? రక్తపు బొట్లా అర్థం కాలేదు అలెగ్జాండర్‌కు.
తెల్లారగానే సేనాపతులతో కొలువుదీరాడు.
‘‘పర్షియాపై దండెత్తబోతున్నాం’’ అన్నాడు.
సేనాపతులు సంశయ పీడితులయ్యారు. దండెత్తడానికీ, దడిపించడానికి అది చిన్న రాజ్యం కాదు. సంపన్న రాజ్యం. శక్తిమంతమైన రాజ్యం. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అప్పటికి అలెగ్జాండర్ దగ్గర ఉంది ముప్పై వేల మంది సైనికులు, ఐదువేల గుర్రాలు మాత్రమే. ఇంత తక్కువ బలంతో ఒక మహాసామ్రాజ్యం మీదికి దండెత్తడం అంటే ఒంటి కాలు మీద లేవడమే. కానీ అలెగ్జాండర్‌ను నిరుత్సాహపరచడం అంటే అసమర్థులుగా గుర్తింపు పొందడమే. అందుకే సేనాపతులు ‘‘సై’’ అన్నారు. ‘‘సాధించి తీరుతాం’’ అన్నారు.
‘‘పాలన ఒక్కటే రాజధర్మం కాదు. కాలగర్భంలో కలిసిపోయిన పౌరుల అభీష్టాన్ని కూడా నెరవేర్చాలి’’ అన్నాడు అలెగ్జాండర్. ఇక ఆ మాటకు తిరుగు ఉండదు.
గ్రీకు సైన్యం పర్షియావైపు కదలింది. అలెక్స్ చేయబోతున్నది సాహసం కాదు, దుస్సాహసం అని అతడి సైనికులకు అర్థమౌతోంది! నిలబడతామా, నవ్వులపాలు అవుతామా అని వారు ఆలోచిస్తున్నారు. అలెక్స్ ఆలోచనలో ఇంకోలా ఉన్నాయి. పర్షియా రాజు డేరియస్ ఓడిపోయి పారిపోతుంటాడు. గ్రీకు పౌరులు ఇళ్లలోంచి తమ పూర్వికుల చిత్రపటాలలో వీధులలోకి వచ్చి డేరియస్ పరుగులు పెడుతున్న దృశ్యాన్ని ఆ పటాలకు చూపించి శాంతి చేయిస్తుంటారు.
నవ్వుకున్నాడు అలెగ్జాండర్.
అటువైపు డేరియస్ కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. నిజానికది నవ్వు కాదు. వికటాట్టహాసం.
‘‘వాడు, ఆ పిల్లకుంకడేనా?... హ..హ్హ.. హ్హ... ఐదడుగుల పొడగరి ఆ అలెగ్జాండరేనా మనపై దండయాత్రకు తెగించి వచ్చింది!! రానివ్వండి, మేసిడోనియా బాలక పాలకుని మరణం... పర్షియా భూభాగంలో రాసిపెట్టి వుంటే అలాగే కానివ్వండి, ఎవరాపగలరు మృత్యువును, మూర్ఖుడిని?’’ అని పేలుతున్నాడతడు.
అలెక్స్‌కు కోపం రాలేదు. మనిషి ఎత్తు కన్నా, మనిషి సత్తా పొడవైనది. సైన్యం సంఖ్య కన్నా సైన్య సంకల్పం బలమైనది. ఆ విషయం అతడికి తెలుసు. అతడికి మాత్రమే తెలుసు.
అలెక్స్ దగ్గరున్న ముష్టి ముప్పై వేల మంది శత్రు సైనికులు తన మహా సామ్రాజ్యాన్ని ఏం చేయగలరని డేరియస్ పరిహసిస్తున్నాడని వేగుల సమాచారం!
‘‘అతడి గర్వాన్ని భంగపరచు అలెక్స్. ఐదువేల యవనాశ్వాలు నెమరు వేయడం మాని, నీ ఆదేశం కోసం చెవులు రిక్కించి చూస్తున్నాయి. పర్షియాను వాటి గిట్టలతో తొక్కించి, నీ రాజ్యంలోని పౌరుల వారసత్వ ప్రతీకార జ్వాలల్ని చల్లార్చు అలెక్స్.’’ గుడారంలో అలెగ్జాండర్ తలగడ కింది పిడిబాకు... స్వామిభక్తితో పదునుతేలి నా కర్ణపుటంచులలో సొదపెడుతోంది. డెరియస్ గుండెల్లో కస్సున దిగబడడానికి ఉత్సాహపడుతోంది! అలెక్స్‌ను తొందరపెడుతోంది.
అలెగ్జాండర్ మరొకసారి నవ్వుకున్నాడు.
గొర్రెలను నడిపిస్తున్న సింహాన్ని ఖాతరు చేయాలి కానీ, సింహాలకు నాయకత్వం వహించే గొర్రెను చూసి వ్యూహాలు పన్నేంత అధముడు కాడు ఈ ఫిలిప్ తనయుడు అనుకున్నాడు.

*********

యుద్ధం మొదలైంది. అలెక్స్ సేనలు పర్షియా సైనికులను ఊచకోత కోస్తున్నాయి. ఆయుధాలకున్న బలం కాదది. అలెగ్జాండర్ ఇచ్చిన గుండె ధైర్యం:
యుద్ధం మధ్యలోనే డెరియస్ పారిపోయాడు. పిరికిపందలను అలెగ్జాండర్ చంపగలడా? పరాజితుడై, ప్రాణాలు దక్కించుకున్న మృతకళేబరాన్ని పొరపాటునైనా తొక్కగలడా?
అలెక్స్ సైన్యం పర్షియాలోకి ప్రవేశించింది. ఇక్కడివారు బానిసలకన్నా ఎక్కువేం కాదని గురువు అరిస్టాటిల్ అన్న మాటలు గుర్తొచ్చాయి అలెక్స్‌కి. కానీ అతడి కళ్ల ముందు కనిపిస్తున్నది వేరు! పర్షియా యువకులకు మేసిడోనియా కత్తుల్ని తిప్పగల సత్తా ఉంది. మేసిడోనియా గుర్రాల్ని అదిలించగల గుండె ధైర్యం ఉంది. వాళ్లను తన సైన్యంలోకి తీసుకోవాలనుకున్నాడు అలెగ్జాండర్.
‘‘దెబ్బతిన్న పులులను మచ్చిక చేసుకునే ప్రయత్నం ఎందుకు? బోనులో పెట్టి ఇంత ఆహారం పడేస్తే సరిపోతుంది’’ అన్నాడు జనరల్ పెర్డిక్కాస్.
‘‘మచ్చిక కాదు, మెచ్చుకోలు’’అన్నాడు అలెక్స్.
అతడంతే! బందీలైనా, బద్ధశత్రువులైనా, బానిసలైనా... వారిలో సామర్థ్యం ఉంటే చేరదీస్తాడు. తన చేత్తో వారి చెయ్యి పైకి ఎత్తిపట్టి - ‘ఇదిగో ఇతడింత ఘనుడు’ అని ప్రపంచానికి చాటుతాడు.
పర్షియాను అలెక్స్ సేనలు హస్తగతం చేసుకున్నాక ఆ రాత్రి రాజధాని పెర్సిపొలిస్‌లోని రాజప్రాసాదంలో విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సైనికులు అపరిమితంగా మద్యం సేవించారు. మత్తులో ఆడిపాడుతున్నారు. పడి లేస్తున్నారు. మాట తూలుతున్నారు.
‘‘పెర్డిక్కాస్... మన చక్రవర్తికి చెప్పు. శత్రురాజ్య యువకుల్ని సైన్యంలో చేర్చుకోవడం ఏమిటి? శత్రురాజ్య యువతులపై ఔదార్యం ఏమిటి? సౌందర్యమనేదే మిగలకుండా పర్షియా సర్వనాశనం కావాలి’’ అంటున్నారు.
పెర్డిక్కాస్ మౌనంగా అలెగ్జాండర్ వైపు చూశాడు. ప్రభువు మనసెరిగినవాడతడు. అతడి ఆంతరంగికుడు. దండయాత్రకు బయల్దేరడానికి ముందు మేసిడోనియాలోని రాజ్యక్షేత్రాలను సైనిక అధికారులకు ఉదారంగా పంపిణీ చేయడం చూసి అతడు అడిగాడు - ‘‘మీకోసం ఏమైనా మిగిలి ఉందా అలెగ్జాండర్’’ అని.
‘‘ఉంది. నా మీద నాకు నమ్మకం మిగిలే ఉంది. అది చాలు’’ అన్నాడు అలెక్స్. తండ్రి ఫిలిప్ ఇచ్చివెళ్లిన నమ్మకం అది!
‘‘అలాగైతే మీ నమ్మకంలోనే నాకు కొంత భాగం ఇవ్వండి. ఈ రాజ్యక్షేత్రం నాకక్కర్లేదు’’ అని తిరిగి ఇచ్చేశాడు పెర్డిక్కాస్!
అలాంటిది వాళ్లిద్దరి మధ్య అనుబంధం!
‘‘పెర్డిక్కాస్... నీ చక్రవర్తికి చెప్పు’’ - ఈసారి ఏకవచన గర్జన!
‘‘అవునవును చెప్పు’’ - వంత గర్జనలు.
పెర్డిక్కాస్ నవ్వాడు. పోనిమ్మన్నట్లు చూశాడు అలెక్స్.
‘‘పెర్డిక్కాస్...’’ అంటూ మళ్లీ ఎవరో అరిచారు. ‘‘నూట యాభై ఏళ్ల క్రితం ఏథెన్సులోని ఆలయాలను పర్షియన్లు తగలపెట్టారు. ఈరోజు మనం ఈ భవంతికి ఎందుకు నిప్పు పెట్టకూడదు? అలెగ్జాండర్... ఇందుకు మీ అనుమతి కావాలి’ అని అరుస్తున్నారు.
సైనికులు అదుపు తప్పారు. అనుమతి లభించకుండానే రాజసౌధానికి నిప్పంటుకుంది. అలెగ్జాండర్‌కు ఇష్టం లేకుండా జరిగిన నష్టం అది.
‘‘కోపం వస్తుంది, చల్లారుతుంది. కూలిన సంస్కృతిని తిరిగి నిర్మించలేం’’ అని ఆవేదనగా అన్నాడు అలెగ్జాండర్ తన హితుడు పెర్డిక్కాస్‌తో.
అప్పుడతడు చక్రవర్తిలా లేడు. శిథిల రాజ్యంలా ఉన్నాడు.

*********

పర్షియా తర్వాత, గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నిటినీ జయించాడు అలెగ్జాండర్. చివరిగా భారతదేశం వైపు వచ్చాడు. తన సొంతరాజ్యం మేసిడోనియాను మరచి అప్పటికే ఎనిమిదేళ్లయింది. సైనిక పటాలం చిక్కిపోయింది. మిగిలిన అరకొర సైనికులు అలిసి ఉన్నారు. అయినా అలెగ్జాండర్ యుద్ధపిపాస తీరలేదు. సింధూనదిని దాటి తక్ష శిల నగరంలోకి చొరబడ్డాడు. జీలమ్, చీనాబ్ నదుల మధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడిని యుద్ధానికి ఆహ్వానించాడు.
మొదటిసారి అలెగ్జాండర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓటమిని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. అలెగ్జాండర్‌ను ఊరడించేందుకు జరగవలసిన ప్రయత్నాలన్నీ జరిగాయి.
‘‘మేసిడోనియాకు తిరిగి వెళ్ల వలసిన సమయాన్ని విధి మనకు గుర్తు చేసింది తప్ప నిజానికి మనం ఓడిపోలేదు’’ అన్నారు సేనాపతులు.
‘‘నాలుగు నదులు దాటాం. ఐదవ నది హైఫాసిస్ ఎందుచేతో కలిసి రాలేదు. ఈ భూభాగంలో మొదటినుంచీ శకునాలేవీ బాగోలేవు’’ అని అలె గ్జాండర్ తొందరపాటును కప్పిపుచ్చారు త్రికాలజ్ఞులు.
మొత్తానికి అందరూ కలిసి అలెగ్జాండర్ తప్పేమీ లేదని తేల్చేశారు.
అయిష్టంగా వెనుదిరిగాడు అలెక్స్. అంతదూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా పన్నెండు మంది గ్రీకు దేవుళ్లకు పన్నెండు ప్రార్థనా పీఠాలను ప్రతిష్టించి గుర్రాలను వెనక్కి దౌడు తీయించారు.

*********

ఖండాలు సరిపోనివాడైనా పుడమి కడుపులో ఇమిడిపోవలసిందేనని అంటున్నారెవరో. అప్పుడుగానీ తను జబ్బున పడిన విషయం గ్రహింపునకు రాలేదు అలెక్స్‌కు. రాజ వైద్యులు ఏవో ఔషధాలు కాచి వడబోసి తెస్తున్నారు. ఆకార్నేనియా నుంచి ఫిలిప్ అనే ధన్వంతరి వచ్చాడు. అతడి పేరు వినగానే తన ఆరోగ్యం మెరుగౌతుందన్న నమ్మకం కలిగింది. ఫిలిప్! వారసత్వంగా అతడికి నమ్మకాన్ని ఇచ్చిన పేరు! తండ్రి పేరు!!
అలెగ్జాండర్‌కు అంతిమకాలం దాపురించిందన్న వార్త బయటికి పొక్కింది. ఒకరొకరుగా వచ్చి పలకరిస్తున్నారు. ముఖ్యాధికారి ఒకరు అలెగ్జాండర్ సమీపానికి వచ్చి కుశలం అడిగాడు.
‘‘నాకేం!’’ అన్నాడు అలెక్స్. అనడానికైతే అన్నాడు. కానీ అతడి ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. మొదటి భార్య రొక్సానా, ఆమె కుమారుడు నాల్గవ అలెగ్జాండర్, రెండో భార్య స్టాటెయిరా, మూడో భార్య పారిశాటిస్, తల్లి ఒలింపియస్ అతడి పక్కనే ఉన్నారు. చివరిసారిగా వాళ్లవైపు చూసి, ఓపికలేని కనుసైగతో సమీపంలో ఉన్న ముఖ్య సైనిక అధికారులను దగ్గరకు రప్పించుకున్నాడు అలెక్స్.
అలవాటు లేని చెక్కిళ్లపై అతడి కన్నీళ్లు బెరుగ్గా జారుతున్నాయి.
‘‘మృత్యువు సమీపిస్తోంది. అంతిమ క్షణాలు నన్ను ప్రక్షాళన చేస్తున్నాయి. నమ్మకస్తులైన నా రాజ్యాధికారులారా... మీకు కృతజ్ఞతలు. మీకు అభివాదాలు. నా ఆఖరి ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరింత సమీపానికి రండి’’అన్నాడు అలెగ్జాండర్.
అతడిని ఆ స్థితితో చూస్తుండడం వల్ల పట్టుతప్పుతున్న గాంభీర్యాన్ని చిక్కబట్టుకుని ముందుకు వచ్చారు రాజ్యాధికారులు.
‘‘వినండి మిత్రులారా.. నా శవపేటికను వైద్యశిఖామణులను మోయనివ్వండి.
వినండి హితులారా... నా శవపేటిక వెంబడి మణులు మాణిక్యాలు వెదజల్లించండి.
వినండి ఆప్తులారా... నన్ను ఖననం చేసిన మట్టిలోంచి నా చేతులను పైకి ఉండనివ్వండి’’ అన్నాడు అలెగ్జాండర్.
‘‘కచ్చితంగా అలాగే జరిగి తీరుతుంది అలెగ్జాండర్ ద గ్రేట్’’ అన్నారు అధికారులు.
‘గ్రేట్’ అనే మాటకు తాత్వికంగా నవ్వాడు అలెక్స్.
‘‘పోతున్న ప్రాణాన్ని ఎంత గొప్ప వైద్యుడైనా నిలబెట్టగలడా? ఇంకేమిటి గ్రేట్?!
కొల్లగొట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకు పోగలమా? ఇంకేమిటి గ్రేట్?!
పుట్టినప్పుడు వట్టి చేతులే, ప్రాణం కొడిగట్టినప్పుడూ వట్టి చేతులే. ఇంకేమిటి గ్రేట్!’’
అలెగ్జాండర్ తుది పలుకులివి.
అతడి అంతిమ ఆకాంక్షల అంతరార్థాలివి.
అందుకే అలెగ్జాండర్... ‘ద గ్రేట్’ కాదు. ద గ్రేటెస్ట్!!
- సాక్షి ఫ్యామిలీ

అలెగ్జాండర్ ద గ్రేట్ - మేసిడోనియా చక్రవర్తి (జీవితకాలం 32 ఏళ్లు)
అసలు పేరు : మేసిడోన్ మూడవ అలెగ్జాండర్
జననం : పూ. 356 (జూలై 20 లేదా 21)
మరణం : పూ. 323 (జూన్ 10 లేదా 11)
పాలన : పూ. 336 నుంచి 323 వరకు
జన్మస్థలం : పెల్లా నగరం, మేసిడోన్ రాజ్యం
మరణస్థలం : బాబిలోన్
తండ్రి : రెండవ ఫిలిప్
తల్లి : ఒలింపియస్
ప్రధాన గురువు : అరిస్టాటిల్
భార్యలు : రొక్సానా, స్టాటెయిరా, పారిశాటిస్
రాజ్యవారసుడు : నాల్గవ అలెగ్జాండర్ (రొక్సానా కొడుకు)
బిరుదులు : షెహెన్‌షా ఆఫ్ పర్షియా,ఫారో ఆఫ్ ఈజిప్ట్,లార్డ్ ఆఫ్ ఆసియా.

అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్
అలెగ్జాండర్ ఇరవయ్యవ యేట అడుగు పెట్టాడు. ఫిలిప్ జైత్రయాత్ర పూర్తి కావచ్చింది. అప్పటికే గ్రీకు రాజ్యాలన్నీ అతడి వశమై ఉన్నాయి. ఏథెన్స్ కూడా స్వాధీనమయింది. ఇంతలో హఠాత్తుగా ఎవరో ఫిలిప్‌ను హత్య చేశారు. తండ్రి మరణంతో అలెగ్జాండర్ రారాజయ్యాడు. అతడి చదువు ఆగిపోయింది. గురువు అరిస్టాటిల్ పరదేశం బయల్దేరాడు. ఆయనకు ఎనిమిది వందల నాణేలు ఇచ్చి పంపాడు అలెక్స్. వాటి విలువ ఇప్పుడైతే కనీసం యాభై లక్షల డాలర్లకు తక్కువ ఉండదని అంచనా.


దండయాత్రలు
నేటి యుగోస్లావియా నుంచి ఇండియా వరకు - బల్గేరియా ఇజ్రాయిల్ ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్‌లపై దండయాత్రలు జరిపి గ్రీసు సామాజ్య్రాన్ని విస్తరింపజేసుకున్నాడు. హిందుఖుష్ పర్వతాలలో అతడి సైన్యం దాటలేకపోయిన ఐదవ నది హైఫాసిస్... నేటి పంజాబ్‌లోని బియాస్ నది. అలెగ్జాండర్ ప్రధాన రాజ్యం మేసిడోనియా. ఇప్పుడది మేసిడోనియా రిపబ్లిక్. మేసిడోనియా నిన్నమొన్నటి వరకు యుగోస్లేవియాలో ఒక భాగంగా ఉండేది.

‘‘కోపం వస్తుంది,
చల్లారుతుంది. కూలిన సంస్కృతిని మాత్రం తిరిగి నిర్మించలేం’’
- అలెగ్జాండర్
పర్షియాను అలెక్స్ సేనలు హస్తగతం చేసుకున్నాక ఆ రాత్రి రాజధాని పెర్సిపొలిస్‌లోని రాజప్రాసాదంలో విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సైనికులు అపరిమితంగా మద్యం సేవించారు. మత్తులో ఆడిపాడుతున్నారు. పడి లేస్తున్నారు. మాట తూలుతున్నారు.

‘‘నూటా యాభై ఏళ్ల క్రితం ఏథెన్సులోని ఆలయాలను పర్షియన్లు తగలపెట్టారు. ఈరోజు మనం ఈ భవంతికి ఎందుకు నిప్పు పెట్టకూడదు? అలెగ్జాండర్... ఇందుకు మీ అనుమతి కావాలి’ అని అరుస్తున్నారు.

సైనికులు అదుపు తప్పారు. అనుమతి లభించకుండానే రాజసౌధానికి నిప్పంటుకుంది. అలెగ్జాండర్‌కు ఇష్టం లేకుండా జరిగిన నష్టం అది.

‘‘కోపం వస్తుంది, చల్లారుతుంది. కూలిన సంస్కృతిని తిరిగి నిర్మించలేం’’ అని ఆవేదనగా అన్నాడు అలెగ్జాండర్ తన హితుడు పెర్డిక్కాస్‌తో.

అప్పుడతడు చక్రవర్తిలా లేడు. శిథిల రాజ్యంలా ఉన్నాడు.

అలెగ్జాండర్ తల్లి ఒలింపియస్
పన్నెండేళ్ల వరకు అలెగ్జాండర్‌కు తల్లే స్నేహితురాలు. ఎప్పుడూ ఏవో మంతనాలతో తీరికలేకుండా ఉండే తండ్రి నుంచి తనకు దక్కవలసిన ప్రేమకు రెండింతలు తల్లి దగ్గర్నుంచి రాబట్టేందుకు అలెగ్జాండర్ ఆమె సతాయించి సతాయించి సతమతం చేసేవాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి