9, జనవరి 2012, సోమవారం

టెక్నాలజీ కొత్త పుంతలు: చైనాలో తొలి 3డి ఛానెల్ ప్రారంభం

 టెక్నాలజీలో రోజురోజుకూ అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఆ తర్వాత కలర్ టీవీలు... అనంతరం ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు, ఇలా టెక్నాలజీలో రోజురోజుకూ విస్తారమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో 3 డీ టీవీలు చేరాయి. ఈవారం చైనా 3 డీ టీవీలను ప్రారంభించింది. 

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం 2డీ నుంచి 3డీకు మారుతోంది. ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, అభిరుచుల్లో వస్తున్న మార్పులు వెరసి కొత్తదనానికి సై అనేలా చేస్తున్నాయి. టీవీల్లో అయితే పిక్చర్ క్వాలిటీ, డిజైన్ తోపాటు వినూత్న ఫీచర్లను కస్టమర్లు కోరుకుంటున్నారు.

చైనా రాజధాని బీజింగ్ లో తొలి 3 డైమన్షల్ ఛానెల్  ప్రారంభమైంది. అధికారికంగా ఈనెల చివర్లో వచ్చే లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ నుంచి ఛానెల్ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఛానెల్ ప్రసారాలు ఉంటాయి. తొలి దశలో వీక్షకులు ఎలాంటి ఫీజు చెల్లించనక్కరలేదు. డాక్యుమెంటరీలు, క్రీడలు, సీరియల్స్, లైవ్ ఈవెంట్స్ లాంటి కార్యక్రమాలు ఈ ఛానెల్ లో ప్రసారమవుతాయి.

3డీ అంటే త్రీ డైమన్షన్ అని అర్థం. టీవీ, సినిమా స్క్రీన్ పై కనిపించే సంఘటనలన్నీ మన ఎదురుగా జరుగుతున్నట్లు భ్రమ కల్పించేదే 3డీ టెక్నాలజీ. అంటే ఒక చిత్రాన్ని ఏవైపు నుంచి చూసినా దాని డెప్త్ కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ పాప చిత్రాన్ని చూడండి. ముందు ఈ చిత్రాన్ని 2డీలో చూద్దాం. ముందువైపు నుంచి బాగానే కనిపించినా... ఓ పక్కగా చూస్తే పేపర్ మాత్రమే కనిపిస్తుంది. ఇదే చిత్రాన్ని 3డీలో వీక్షిస్తే ఏవైపు నుంచి చూసినా పాప ముఖమే దర్శనమిస్తుంది.

ఒక దృశ్యాన్ని 3డీలో చూస్తే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అదేంటో తెలుసుకోవాలంటే మనం ఐమాక్స్ కు వెళ్లాల్సిందే. మామూలు థియేటర్లలో స్క్రీన్స్ తో పోలిస్తే... ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్ ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. దీంతో సినిమాల్లోని సీన్స్  మన ఎదురుగానే జరుగుతున్నట్లు ప్రేక్షకులకు ఫీలింగ్ కలుగుతుంది. ఇక... ఐమాక్స్ లో నడిచే ఓ మూవీ టైటిల్స్ చూద్దాం. టైటిల్స్ మన మీదకే వస్తున్నట్లు కనిపిస్తోంది కదా. ఇదే 3డీ టెక్నాలజీ మహత్యం.

అసలు 3డీలో అంత రియాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా?. మామూలు చిత్రాల్లో ఒక సీన్ ను అనేక కెమెరాలు ఉపయోగించి... అనేక యాంగిల్స్ లో చిత్రీకరిస్తారు. అయితే 3డీలో ప్రతి సీన్ ను రెండు కెమెరాలతో షూట్ చేస్తారు. వివరంగా చెప్పాలంటే ఏదైనా దృశ్యాన్ని మనం రెండు కళ్లతో చూస్తే కలిగే అనుభూతి ఒక్క కంటితో చూస్తే కలగదు. ఇదే ఫార్ములాను 3డీ కోసం ఉపయోగిస్తారు. మన కళ్ల మధ్య ఎంత దూరం ఉంటుందో... కెమెరాలను కూడా అంతే దూరంలో ఉంచి షూటింగ్  చేస్తారు. షూటింగ్ మొత్తాన్ని రెడ్, సియాన్ కలర్స్ లోనే షూట్ చేస్తారు.

ఇక 3డీ చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించే ఫిల్మ్... సాధారణ ఫిల్మ్  కంటే మూడు, నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది. అలాగే 3డీ చిత్రాల్ని మనం సాధారణంగా చూడకూడదు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలను ఉపయోగించాలి. షూటింగ్ కు ఉపయోగించిన రెడ్, సియాన్ కలర్స్ తోనే ఈ కళ్లద్దాలను తయారు చేస్తారు.ప్రపంచం మొత్తం 3డీ వైపు చూస్తుండటంతో కంపెనీలు సైతం దానికి అనుగుణంగా టెక్నాలజీని అప్ డేట్ చేసుకుంటున్నాయి. 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి