ఒకప్పుడు వారిద్దరూ ఉప్పు నిప్పు.. ఒకరి పేరు మరొకరికి చెబితే భగ్గున మండిపడేవారు. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు హఠాత్తుగా సీన్ రివర్స్ అయింది. ఒకరిపై మరొకరు ప్రేమ ఒలకబోసుకుంటున్నారు. నవ్వుకుంటూ జోకులేసుకుంటున్నారు. ఎవరా ఇద్దరు నేతలు... ఏమా కథ... వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూదవాల్సిందే...
సరిగ్గా ఏడాది క్రితం.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటన.. ఈ పర్యటన కృష్ణా జిల్లా టీడీపీలో పెద్ద దుమారాన్నే రేపింది. పార్టీ రూరల్ అధ్యక్షుడు దేవినేని ఉమ.. పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాటలు తూటాలు పేలాయి. హరికృష్ణకు దేవినేని ఉమ ఎలాంటి గౌరవం ఇవ్వలేదని, నందమూరి వంశీయులకి పార్టీలో ప్రాధాన్యం లేదంటూ వంశీ ఆరోపణలు గుప్పించారు. ఉమపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు
దీనికి పోటీగా దేవినేని ఉమ కూడా రాజీనామా చేశారు. దీంతో పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ వివాదం నారా, నందమూరి కుటుంబాల మధ్య వార్ గా మారిందని అందరూ భావించారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండడంతో ఈ వివాదం ఎటు తిరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చంద్రబాబు టూర్ ముగించుకొని వచ్చాక ఉమ, వంశీలను పిలిచి క్లాస్ తీసుకున్నారు. ముఠా తగాదాలతో పార్టీని భ్రష్టు పట్టించవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వారిద్దరూ రాజీ మార్గానికి వచ్చారు. రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.
ఇరు వర్గాల మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినప్పటికీ... దేవినేని, వల్లభనేని కలిసి పని చేసిన సందర్భాలే ఎక్కడా కనిపించలేదు. కృష్ణా జిల్లాలో వారిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సోమవారం టీడీపీ పార్టీకార్యాలయంలో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో దేవినేని ఉమ, వల్లభనేని వంశీలు చెట్టాపట్టాలేసుకొని కనిపించారు.
ఇద్దరూ ఒకరితో మరొకరు నవ్వుతూ మాట్లాడడం, ఒకరి చెవుల్లో మరొకరు గుసగులాడడం కనిపించింది. గత కొద్ది రోజులుగా పార్టీ సమావేశాలకు హాజరుకాని హరికృష్ణ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ హల్ చల్ చేశారు. దీంతో నేతలంతా హరికృష్ణతో మాట్లాడడానికి ఎగబడ్డారు. మొత్తానికి ఉప్పు నిప్పుగా ఉన్న ఉమ, వంశీలు ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి