ఓ బెజవాడ అభిమాని ఆక్రోశం –
ఈ మధ్య విడుదలయిన 'బెజవాడ' తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన మాటల్లోనే -
"సార్! బెజవాడ సినిమా చూసారా. బెజవాడ అంత భయంకరంగా ఉంటుందా. రోడ్లమీద
రవుడీలు అలా కత్తులు పట్టుకొని చంపుతామంటూ తిరుగుతారా? నడిరోడ్లమీదే జనాలను అంత అమానుషంగా రక్తసిక్త మయ్యేలా చంపేస్తారా? బాబోయి!" అంటూ అని విశాఖపట్నం నుంచి నాతో వొకప్పుడు
కలిసి పనిచేసిన ప్రకాష్ ఫోన్ చేసాడు.
"నేను సినిమాలు చూడడం దాదాపు మానేశాననే చెప్పాలి.
ఎప్పుడేనా వో మంచి సినిమా వస్తే ఇంట్లో వాళ్ల బలవంతం మీదా ఏడాదికి ఒక్కటో
రెండో చూస్తాను. అదీ హాయిగా నవ్వుకొనే సినిమా అయితేనే.
"ఇప్పుడు బెజవాడ పేరుతొ సినిమా తీసారని తెలిసి ఆ సినిమా మీద
రోజూ ఛానల్స్ లో వచ్చే చర్చలు అప్పుడప్పుడు చూస్తున్నాను, గోడలమీద వాల్ పోస్టర్లు, హోర్డింగులు
కూడా చూస్తూనే వున్నాను. నిజంగానే భయంకరంగా వున్నాయి. వాటిని చూస్తుంటే నా బెజవాడ ఇది కాదు అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది.
"రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు,సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో.
"నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు.
"నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు.
"అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.
"సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు
"సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ వంటి కవి పండిత శ్రేష్ఠులు, పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన చుండూరు వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల - బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
"ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య, సీడీ కృష్ణమూర్తి, నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు, ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి, ఏబీకె ప్రసాద్, పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు - వీరిదీ బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
"ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు, నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.
"టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్, వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు శ్రీ రామనవమి పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.
" తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా, బోడెమ్మ హోటల్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్, మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు, జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే జనం ఇవీ బెజవాడ అంటే.
"లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా, రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు, కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమా, జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు, ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
"రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం, దివ్యజ్ఞాన సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ, ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.
"అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియనివాళ్లు తీసిన 'బెజవాడ' సినిమా చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి.
"మా బెజవాడ చాలా గొప్పది.
"అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది."
చాలా మంచి వ్యాసం. ఈ సాంస్కృతిక కోణం మరుగున పడుతోంది, మరుగు చేస్తున్నారు, రాజకీయ గొడవల్లో...నిజానికి ఈ వ్యాసంలోని వొక్కొక పంక్తీ వొక్కోక వ్యాసమ్ రాయతగింది! ఆ పని మీరే చేస్తే బాగుంటుంది. ఆలోచించండి.
రిప్లయితొలగించండి