* కాంగ్రెస్‌లో కలిసి పోయిన చిరంజీవి
* కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్న కృష్ణ ఫ్యామిలీ
* టీడీపీకి ప్రచార సారధులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
* ఈసారి పోటీ చేస్తానన్న బాలయ్య
* వైఎస్‌తో కృష్ణకు సన్నిహిత సంబంధాలు
* కృష్ణ కుటుంబానికి గల్లా అరుణకు బంధుత్వం
* యూత్‌ను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్
* అప్పట్లో కాంగ్రెస్ ప్రచారానికి ప్రయత్నాలు
* సున్నితంగా తిరస్కరించిన మహేష్
* ఇప్పటికే జగన్‌కు మద్దతు పలికిన విజయనిర్మల, నరేష్
* యువనేత జగన్‌కు అండగా మహేష్ ఉంటారని ప్రచారం
* స్పందించని మహేష్ బాబు
* సినీ ప్రపంచాన్ని వదలి రాజకీయాల్లోకి వస్తాడా
* రాజకీయాల్లో రాణిస్తారంటున్న మహేష్ అభిమానులు
యూత్ గ్లామర్ వున్న సినీ నటుడు మహేష్‌బాబును రంగంలోకి దించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు...సొంతపార్టీలోని చిరంజీవి, ప్రతిపక్ష పార్టీలోని బాలయ్యలకు పోటీగా మహేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఈ మేరకు మంత్రి గల్లా అరుణకుమారికి కిరణ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముంచుకొస్తుండడం... సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలే ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే సినీ గ్లామర్ కనిపిస్తోంది. ఇప్పటికే పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోగా గతంలో కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయగా మరోసారి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
రెండు రోజులపాటు కృష్ణా జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో మూడు ప్రాంతాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇటు సొంత పార్టీలో చిరంజీవికి.. అటు ప్రతిపక్ష పార్టీలో బాలయ్యకు చెక్ పెట్టేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభిమానిగా మొదటి నుంచి కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కృష్ణ 1989లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు.
అటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నా ..రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మహేష్ బాబును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి 2009 ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ముందుంది మంచి కాలం ఎందుకు అంత తొందర అన్ని రీతిలో కృష్ణ దంపతులు అప్పట్లో వైఎస్‌కు చెప్పినట్లు రాజకీయ వర్గాలు చెప్పాయి.
టీడీపీ తరపున బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రచారం చేసే అవకాశమే ఉండటమే కాక ఏకంగా బాలయ్య పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో కాంగ్రెస్‌లో కూడా యూత్ ఓటు బ్యాంక్ ను ఆకట్టుకునేందుకు మహేష్ బాబును రంగంలోకి దించాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కృష్ణ కుటుంబానికి, కాంగ్రెస్‌లో సీనియర్ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబానికి బంధుత్వం ఉంటడంతో ఈ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విజయనిర్మల, నరేష్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. వైఎస్‌తో కృష్ణ కు సన్నిహిత సంబంధాలు వుండటంతో ఆయన కుటుంబం మద్దతు కూడా జగన్ వుంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు జోరుగాసాగుతున్న మహేష్ బాబు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం రాలేదు.
ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహేష్ భవిష్యత్తులో రాజకీయాల్లో రాణిస్తారనే ఆశా భావం ఆయన అభిమాన సంఘాల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ రంగంలో మంచి భవిష్యత్తు వుండగా ఇప్పటికిప్పు డు ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి