* అడ్డుకుంటామంటున్న జెఎసి
* ఎమ్మెల్యే హరీష్ గృహ నిర్బంధం
* దీక్షకు భారీ బందోబస్తు
నిజామాబాద్ జిల్లాలో జగన్ పర్యటనకు సర్వం సిద్దమైంది. యువనేత రాక కోసం వైఎస్‌ఆర్‌సీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న జగన్ రైతు సమస్యలపై 48గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని జెఏసి హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మరో పోరుబాటకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 48 గంటల పాటు రైతుల కోసం ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో బారికేడ్లు నిర్మించి దీక్షా వేదిక ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన సాగే మార్గంలో పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సుమారు 50వేల మంది దీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
అటు పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న జగన్ తెలంగాణ వ్యతిరేకి అని TRS, టీజాక్ వాదిస్తోంది. TDP అధినేత చంద్రబాబు వరంగల్ పర్యటనను అడ్డుకున్నట్లే జగన్ దీక్షను కూడా అడ్డుకుంటామంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే జగన్ రైతు దీక్ష చేస్తున్నారని టీజాక్ ఛైర్మన్ కోదండరాం అన్నారు.
టూర్‌కు నిరసనగా ఇవాళ ఆర్మూర్‌లో విద్యా సంస్థల బంద్‌కు జెఎసి పిలుపునిచ్చింది. తెలంగాణా ఇచ్చే శక్తి, అడ్డుకునే శక్తి తనకు లేదని పార్టీ ప్లీనరీ సమావేశాల వేదికపై జగన్ స్పష్టం చేశారని...వైఎస్‌ఆర్‌సీ నేతలు అంటున్నారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా జగన్ టూర్‌ను అడ్డుకోవాలనుకోవడం సబబు కాదని సూచిస్తున్నారు.
మరోవైపు రైతు దీక్షను రాజకీయం చేయవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలకు ఈ దీక్షకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటి చేయదని గతంలోనే స్పష్టం చేసామని ఆయన గుర్తుచేశారు.
రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే దీక్ష చేస్తున్నామని అందరు సహకరించాలని ఆ లేఖలో కోరారు. ఇక.. జెఎసి హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావును ముందస్తుగా హౌజ్ అరెస్టు చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో ఆయనను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. హరీష్ నిర్బంధంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి