ప్రభుత్వ పథకాల ప్రమోషన్‌కు ఉపయోగించుకునే యోచనలో కిరణ్
కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న నేతలు
చిరంజీవికి పోటీ కోసమేనా..?
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు మహేష్‌బాబును నియమించనున్నారు. దీనికి సంబంధించి మహేష్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు మహేష్‌ను కలిసి ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. మహేష్ అంగీకరిస్తే త్వరలో ముఖ్యమంత్రితో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. అవసరమైతే మహేష్‌ను కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానిస్తామని సిఎం మద్దతుదారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఏడాదిపాలన పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో విఫలయ్యారు. పార్టీపరంగా తెలంగాణా అంశంలోనూ, జగన్ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్ళకుండా అరికట్టడంలోనూ, అవిశ్వాస తీర్మానం వీగిపోవడంలో పంతం నెగ్గించుకున్నా పరిపాలనలో విజయవంతం కాలేదని కాంగ్రెస్‌పార్టీ నేతలే అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పథకాలు ప్రవేశపెట్టినా వాటిని ఏ ఒక్క మంత్రీ బయట చెప్పుకోవడం లేదు. కేబినెట్‌లో చర్చించకుండా, సంబంధింత శాఖ మంత్రితో చెప్పకుండా ఏకపక్షంగా పెట్టిన పథకాలను ఎందుకు ప్రచారం చేయాలని సిఎంపై మంత్రులు మండిపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని పథకాలను నీరుగార్చుతూ తానొక్కడే గొప్ప అంటూ కొత్త పథకాలను తీసుకొస్తే తమకేం ఉపయోగమని మంత్రులు వాదిస్తున్నారు.
మంత్రుల సహకారం లేకపోయినా సిఎం కిరణ్ తన సొంత ఉపన్యాసాలతో లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్రికలు, టివి ఛానల్‌లో ప్రకటనలు ఇచ్చుకున్నా ప్రజలను ఆకర్షించలేకపోయారు. కాంగ్రెస్‌లో చిరంజీవి వచ్చినా పథకాలను ప్రచారం చేయకుండా మరో గ్రూపుగా మారడంతో కిరణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఉపఎన్నికల్లో తన పథకాలతో ఒకరిద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని అధిష్టానం వద్ద మెప్పుపొందాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోతే పదవికి ఎసరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిరణ్ వ్యతిరేకులు అంటున్నారు. దీంతో సినిమా నటుడు మహేష్‌ను అంబాసిడర్‌గా పెట్టుకుని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కిరణ్ చూస్తున్నారు. ఏ పార్టీలోనూ తాను చేరబోనని గతంలో మహేష్ ప్రకటించారు. తన కుమారుడు ఏ పార్టీ తరపునా ప్రచారం చేయబోరని ఆయన తండ్రి కృష్ణ కూడా చెప్పారు. కాంగ్రెస్‌పార్టీలో చేరకుండా పథకాల ప్రచారం కోసం మాత్రమే అంబాసిడర్‌గా ఉండాలని మహేష్‌ను సిఎం కోరుతున్నట్లు తెలిసింది. సిఎం విజ్ఞప్తిని మహేష్ వ్యతిరేకించలేదని తెలిసింది. ప్రభుత్వ సహకారం కూడా మహేష్‌కు అవసరం. పోకిరి సినిమా నాటి నుండి ఆయనపై ఆదాయపన్ను శాఖ దాడులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఖలేజా, దూకుడు సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఆ సమయంలోనే మహేష్ ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు తెలిసింది.
పథకాలను ప్రచారం చేయడానికి అంబాసిడర్‌గా ఉండాలని మహేష్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు అంతర్గతంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వంగానీ, మహేష్‌గానీ బయటకు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వర్గీయులు లీక్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంబాసిడర్‌గా మహేష్‌ను ఉపయోగించుకుంటూ చిరంజీవికి చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నట్లు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి