29, నవంబర్ 2011, మంగళవారం

ఆత్మరక్షణలో ఆంద్రప్రదేశ్ రాజకీయ పార్టీలు

చాలా కాలం తర్వాత శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. ఐదు రోజులు జరుగుతాయా? లేక మూడు రోజుల ముచ్చటగా ముగుస్తాయా అన్నది పక్కన బెడితే గత రెండేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా జరగడం లేదన్నది వాస్తవం. ఈ ఏడాది అయితే బడ్జెట్ సమావేశాలు మొక్కుబడిగా ముగియగా, ఆ తర్వాత ఒకే ఒక్క రోజు అది కూడా స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నిక నిమిత్తం జరిగాయి. సాంకేతికంగా ఆ ఒక్క రోజు సమావేశంతో ఆరునెలలు సమావేశాలు జరపనవసరం లేదు కనుక ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టడానికి ముందుకు రాలేదు. గతంలో అయితే ప్రతిపక్షాలు మాట్లాడితే సభను సమావేశపరచి ఆయా సమస్యలపై చర్చించాలని డిమాండుచేస్తుండేవి. ఈ సారి విపక్షాలు సైతం అలాంటి డిమాండుకు బహు దూరంగా ఉండడం విశిష్ట లక్షణంగా భావించాలి. తెలంగాణ సమస్య, అలాగే జగన్ రాజకీయ సంక్షోభం రెంటి కారణంగా అధికార పక్షం, అలాగే విపక్షం కూడా శాసనసభ సమావేశాల జోలికి వెళ్లడానికి దైర్యం చేయలేకపోయాయని చెప్పాలి. పైగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయన్న చిత్రమైన విమర్శ కూడా మన రాష్ట్రంలో చోటు చేసుకోవడం ఇదే ప్రధమం అని చెప్పాలి. అవిశ్వాస తీర్మానం పెట్టాలా? వద్దా అన్నదానిపై జరుగుతున్న రగడనే ఉదాహరణగా తీసుకోవచ్చు.మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం విపరీతమైన ఉత్సాహం చూపించాలి. ఎందుకంటే పొరపాటున ప్రభుత్వపక్షంలో చీలిక వచ్చి ప్రభుత్వం పడిపోతే వచ్చే పరిణామాలు తమకు ఉపయోగపడతాయని ఆ పక్షం భావిస్తుంది కనుక. కాని మన రాష్ట్రంలో మేమెందుకు అవిశ్వాసం పెడతామని ప్రధాన ప్రతిపక్షం ఎదురు ప్రశ్నించిన సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. లేదా అవిశ్వాసం తమ ఇష్టం వచ్చినప్పుడు పెడతామని ఒకసారి, రైతు సమస్యలు తీర్చకపోతే పెడతామని మరోసారి అంటూ వచ్చింది. దీంతో అదికార పక్షానికి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ బలహీనతకు కారణం ఏమిటో అందరికి తెలుసు. ప్రభుత్వం కనుక ఇప్పుడు పడిపోతే ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే తమకు రాజకీయంగా అనుకూలంగా లేదన్న వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించింది. అదే ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ గా మారింది. నిజానికి అదికార కాంగ్రెస్ పార్టీకి కూడా పరిస్థితి అదేమంత లాభసాటిగా లేదన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కోస్తా,రాయలసీమలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ కాని, టిడిపికాని సిద్దంగా లేవు. దాని కారణంగానే అవిశ్వాసానికి సీరియస్ నెస్ రాలేదు. పైగా ఇతర అనేక అంశాలు ఇందులో మిళితమైనాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిడిపి తెలంగాణ సభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉన్నారు. వాటిని స్పీకర్ తిరస్కరించారు. అలాగే జగన్ వర్గానికి చెందినవారి రాజీనామాలను రెండు తప్ప మిగిలినవాటిని తోసిపుచ్చారు.దాంతో అటు తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు, జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉపశమనం పొందారని చెప్పాలి. ఇక కాంగ్రెస్ కు జగన్ ఫ్యాక్టర్ వెన్నాడుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అంతటిని ఉపయోగించి జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడినికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. కొంతవరకు ఈ విషయంలో సఫలమైనట్లే భావించాలి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసించడమే కాకుండా తమ నియోజకవర్గ ప్రజలు కూడా కిరణ్ తోనే ఉండాలని కోరారని ప్రకటించడం విశేషం. జగన్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న శేషారెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేయడం కచ్చితంగా జగన్ కు అది దెబ్బ తగిలే అంశమే. అలాగే జయసుధ, కొర్ల భారతితో సహా ఆరేడుగురు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను వదలి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఇంకా ఇరవై ఒక్క మంది జగన్ తోపాటు ఉన్నామని ఒక సమావేశం ద్వారా తెలియచెప్పారు. ఇది కూడా కాంగ్రెస్ కు ఆందోళన కలిగించే విషయమే. జగన్ వర్గం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినట్లు కనిపించినా, అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఒక్కసారిగావిజృంభించి ఓ డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఆకట్టుకుంటే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి వచ్చినట్లే. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే అంత సీన్ జగన్ కు ఉందా అన్న సందేహం కలుగుతోంది.ఒకప్పుడు అలా చేయగలుగుతారేమోనన్న భావన ఉన్నప్పట్టికీ, ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పజాలం.అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం. అంతదాకా ఎందుకు! కొద్ది కాలం క్రితం వరకు జగన్ పై సిబిఐ కేసుతో ఆయన వర్గం అల్లాడుతున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా విజయమ్మ పిటిషన్ పై టిడిపి అధినేత చంద్రబాబుతో సహా పన్నెండు మందిపై సిబిఐ ప్రాధమిక విచారణ రావడంతో రాజకీయం గమ్మత్తుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండి రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న యుద్దాన్ని వినోదంలా చూసే పరిస్థితి వచ్చింది.మొన్నమొన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డోలాయమాన పరిస్థితిలో ఉందనిపించేది. కాని ఇప్పుడు స్థిరంగా ఉందనిపిస్తోంది.ఎందుకంటే తెలంగాణ అంశం కాని, జగన్ అంశం కాని రెండు బాగా చికాకు పెట్టే దశ నుంచి సర్దుబాటు అయ్యే దశకు వచ్చినట్లు కనిపించడమే కాంగ్రెస్ కు కలిసి వచ్చే పాయింటు అని చెప్పాలి. అదే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈ రెండు అంశాలలోను ఇంకా ఇబ్బంది పడుతోంది. నిజానికి జగన్ పై కేసు కాని, జగన్ ఎమ్మెల్యేల వ్యవహారం కాని, కాంగ్రెస్ కు ఇరకాటంగా మారాలి. కాని ఆసక్తికరంగా అవి టిడిపి మెడకు చుట్టుకున్నాయి. జగన్ పై శంకరరావు వేసిన కేసులో టిడిపి ఉత్సాహంగా ఇంప్లీడ్ అయితే, దానికి ప్రతిగా జగన్ పార్టీ నేత విజయమ్మ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు వేసే వరకు పరిస్థితి వెళ్లింది. ఇద్దరూ తమ జుట్టును సిబిఐ చేతిలో పెట్టారు.ఈ పరిణామాల ప్రభావం సహజంగానే శాసనసభ సమావేశాలపై పడుతుంది.కాంగ్రెస్ పార్టీ ప్రధాన విపక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టడానికి సిబిఐ కేసును వాడుకుంటుంది. అలాగే అవిశ్వాసం పెడితే అది జగన్ వర్గానికి పరీక్షగా మార్చడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనంలో పట్టు ఎంత సాధించిందన్న దానిని పక్కనబెడితే టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లపై నైతికంగా ఆధిక్యతను సాధించిందని చెప్పవచ్చు. అదే సమయంలో మరో ముఖ్యమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు శాసనసభను స్తంభింప చేయడానికి సహజంగానే ప్రయత్నిస్తారు. నిరసనలో భాగంగా ఒకరోజు అయితే ఫర్వాలేదు.ప్రతిరోజూ అదే పని చేస్తే దానివల్ల ఎంతవరకు ఆ పార్టీకికాని, తెలంగాణ ప్రజలకు కాని ఎంతవరకు మేలు కలుగుతుందన్నది కూడా ఆలోచించాలి. లోక్ సభలో కెసిఆర్,విజయశాంతిలు చేసిన రాజీనామాలు కూడా తిరస్కరణకు గురి అయ్యాయి.దానిని కూడా గమనంలోకి తీసుకుంటే ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడానికి, అక్కడ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడానికి ప్రయత్నించవచ్చు. అయితే జనంలోకి వెళితే బాగుంటుందనుకునే టిఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలకు శాసనసభలో పెద్దగా బలం లేకపోవడం వారి బలహీనత అయితే, బాగా బలం ఉన్న పార్టీలకు భవిష్యత్తు మీద భయం బలహీనతగా ఉంది.ఇదే సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి ఇరవైఒక్కమంది బలం ఉండడం విశేషమే అయినా, ఎంతమంది కడదాకా ఉంటారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది.అలాగే టిఆర్ఎస్ ఇంతకాలం నేడో,రేపో తెలంగాణ అన్నంత ఊపుగా ఉద్యమాన్ని నిర్వహించినా, తెలంగాణ ఇప్పట్లో తేలేది కాదన్న సంకేతం రావడంతో ఆ పార్టీకి కూడా కాస్త ఇబ్బందిలో పడినట్లే. ప్రస్తుతానికి జనంలో పలుకుబడి బాగానే ఉన్నా వచ్చే రెండేళ్లు దానిని నిలబెట్టుకోవడానికి తంటాలు పడాల్సి ఉంటుంది.మొత్తం మీద ఏ రకంగా చూసినా ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఆత్మరక్షణలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పాలి.రాష్ట్ర రాజకీయాలలో ఇదొక విచిత్రమైన పరిస్థితే.ఇదే సమయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొదట కాస్త ఆత్మరక్షణలో పడడం, కొంతమంది ఎమ్మెల్యేల విమర్శలను భరించాల్సి రావడం జరిగినా,ఇప్పుడు ఆయనదే పైచేయిగా మార్చుకోగలిగారు. ఇప్పుడు ఎవరైనా రాజీనామాకు పట్టుబడితే ఆమోదించడానికి సిద్దం అన్న సంకేతాలు పంపుతుండడంతో , రాజీనామా చేశామని ప్రకటించే ఎమ్మెల్యేలు కొందరు కాస్త బెట్టు వదలి రాజీనామాలు ఆమోదించకుండా ఉంటే బెటర్ అన్న చందంగా మాట్లాడుతున్నారు.పార్టీలు మారిన నలుగురి రాజీనామాలను ఆమోదించి మిగిలినవారి రాజీనామాలను తిరస్కరించారు. అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేల విషయంలో కాస్త సంయమనం పాటించారనే అనుకోవాలి. జెఎసి నేత కోదండరామ్ వంటివారు రాజీనామాల ఆమోదంలో వివక్ష చూపారని అనడంలో అర్ధం ఏమిటో తెలియదు.పార్టీ మారినా రాజీనామాలు ఆమోదించవద్దనా?లేక టిడిపివారివి కూడా రాజీనామాలు ఆమోదించాలనా?స్పష్టంగా చెబితే బాగుండేది.కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పట్లో ఫాక్స్ ద్వారా రాజీనామాలు పంపామని చెప్పేవారు.కాని ఇప్పుడు ఆ రాజీనామాలేవి స్పీకర్ వద్ద లేవనడం కూడా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు నిజానికి రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యల పై కన్నా, రాజకీయ పార్టీలు ఎదుర్కుంటున్న సమస్యలపైనే అందరి దృష్టి ఉంది. అందువల్ల శాసనసభ సమావేశాలకు ప్రాధాన్యత తగ్గి, రాజకీయ పార్టీల మనుగడ ఎలా ఉంటుందన్న అంశమే అందరిని ఆకర్షిస్తోందంటే అతిశయోక్తికాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి