30, నవంబర్ 2011, బుధవారం

ప్రియదర్శినిరామ్ ,స్వప్న, మురళీకృష్ణ, వాసుదేవన్....

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేం. ఏడబోతవ్ రాజన్నా....అంటూ జనాన్ని కంటతడి పెట్టించిన మన ఎనర్జిటిక్ అన్నయ్య మీసాల రాంరెడ్డి 'సాక్షి' నుంచి బైటికిపోవాల్సి వస్తుందని ఎవరనుకున్నారు? స్వప్న కూడా ఈ మధ్యన 'సాక్షి'కి గుడ్ బై చెప్పారు. మాకున్న సమాచారం ప్రకారం ఆమె ఆ సంస్థ నుంచి బైటికి వెళ్లిపోవడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి వెళ్లి మళ్లీ కొందరు పెద్దల జోక్యంతో చానల్ బాధ్యతలు స్వీకరించారు.


జగన్, సీబీఐ గొడవలు, ఆఫీసులో తనకు సరిపడని వాతావరణంతో ఇబ్బందిపడిన స్వప్న కూడా వదలడంతో 'సాక్షి' ఛానల్ బోసిపోయింది. ఆమెకు పలు చోట్ల నుంచి ఆఫర్లు ఉన్నట్లు సమాచారం. వై.ఎస్. హయాంలో సమాచార కమిషనర్ గా నియమితులై బాగా పనిచేసిన మాజీ 'ఈనాడు' పాత్రికేయుడు దిలీప్ రెడ్డి కి ఛానల్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈ నెలాఖర్లోపు ఈ నియామకం ఖరారు కావచ్చట.

స్వప్నమాదిరిగానే టీవీ-నైన్ నుంచి వచ్చి సాక్షి ఛానల్ లో చేరిన రిపోర్టర్, యాంకర్, ప్రజంటర్ మురళీ కృష్ణ తాపీగా సొంత గూటికి చేరారు. నిజానికి మురళీ కృష్ణ సొంతగూడు ఈనాడు. తనీ మధ్యనే టీవీ నైన్ లో చేరి తెరమీద దర్శనమిస్తున్నారు.
'సాక్షి' ఢిల్లీ బ్యూరో చీఫ్ గా అద్భుతంగా పనిచేసి అనుకోకుండా జెమిని ఛానల్ లో బ్యూరో చీఫ్ గా చేరిన పత్రి వాసుదేవన్ జెమినికి రాం రాం పలికారు. అక్కడ మ్యానేజ్ మెంట్ లో ఉన్న ఒక వ్యక్తితో తనకు బెడిసినట్లు సమాచారం. అంతే కాక...తన ప్రమేయం లేకపోయినా తనను 'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్' కేసులో ఇరికించడంతో వాసు మానసికంగా కుంగిపోయారు. తను మళ్లీ 'సాక్షి' ఛానల్ ఢిల్లీ బ్యూరో ఛీఫ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. పైన పేర్కొన్న ముగ్గురూ టీవీ-నైన్ పాత బ్యాచే. మురళీ కృష్ణ ఈ టీవీలో, వాసుదేవన్ 'ఈనాడు' సహా పలు పత్రికలతో పాటు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో కూడా పనిచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి