29, నవంబర్ 2011, మంగళవారం

తగ్గేది లేదు ....! అన్నీ ఆలోచించే నిర్ణయించాం! * మాది తొందరపాటు చర్య కాదు రిటైల్‌లోకి ఎఫ్‌డిఐల వల్ల లాభాలే ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు తెగేసి చెప్పిన ప్రధాని మన్మోహన్

న్యూఢిల్లీ, నవంబర్ 29: యుపిఏ సర్కారు తీసుకున్న ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్ సమర్థించుకున్నారు. విపక్షాలు ఎంత ఆందోళన చేసినా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐలను) అనుమతిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో యువజన కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ అన్ని అంశాలను సాకల్యంగా పరిశీలించాకే ఎఫ్‌డిఐ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యుపిఏలోని కొన్ని పక్షాలతోపాటు విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రధాని తోసిపుచ్చారు. ఈ అంశంపై పార్లమెంట్‌ను పని చేయకుండా ప్రతిపక్షం అడ్డుకోవడాన్ని మన్మోహన్ తప్పుపట్టారు. అయితే చిల్లర వ్యాపారంలోకి 51 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలన్న నిబంధన ఏదీ లేదని చెప్పారు. నిర్ణయాన్ని అమలు చేయాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టమని ప్రధాని వివరించారు.
వినియోగదారులకు లబ్ధి చేకూర్చడంతోపాటు ఉపాధి కల్పన, రైతాంగ ఉత్పత్తులకు మెరుగైన ధర, సాంకేతిక విజ్ఞానం దిగుమతి లక్ష్యంగా రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించామని ఆయన నొక్కి చెప్పారు. ఇది తొందరపాటు నిర్ణయం కాదని, అన్ని కోణాలనుంచి ఆలోచించి మన దేశానికి ఉపయోగపడుతుందని భావించే నిర్ణయం తీసుకున్నామని మన్మోహన్ స్పష్టం చేశారు. చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల ఆధునిక సాంకేతిక విజ్ఞానం దేశానికి దిగుమతి అవుతుందని, గ్రామీణ వౌలిక సౌకర్యాలు మెరుగుపడతాయని, ఆహార ధాన్యాల వృధా తగ్గుతుందన్నారు. ఈ విధానంతో రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందుతారని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రిటైల్ రంగంలోకి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలతోపాటు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలు పార్లమెంట్‌ను స్తంభింపచేస్తున్నా ప్రధాని తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకోవడం విశేషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి