28, నవంబర్ 2011, సోమవారం

సేఫ్ జోన్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, వీడిన సస్పెన్షన్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితే ఉంది. మెజారిటీ శాసనసభ్యుల బలం ప్రభుత్వానికి ఉన్నట్లు లెక్కలు చూస్తే అర్థమవుతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాలం సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాయత్తమవుతున్నారు. ఈ స్థితిలో అవిశ్వాసం పెడితే కిరణ్ కమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే ఉత్కంఠకు తెర పడినట్లే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ మనోహర్ తుది నిర్ణయం తీసుకోవటంతో సమావేశాల ప్రారంభానికి ముందే అవిశ్వాసంపై ఉత్కంఠ సన్నగిల్లింది.

మూకుమ్మడి రాజీనామాలను తిరస్కరించిన స్పీకర్ కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయమే. అసెంబ్లీలో పార్టీల వారీ బలాబలాలను పరిశీలిస్తే - ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి సాం కేతికంగా కాంగ్రెస్ బలం 158. అయితే, స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇటీవల టీఆర్ఎస్‌లో చేరగా, రాజేశ్వర రెడ్డి ఈ మధ్యనే అకాల మరణం పొందారు. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన జూపల్లి కృష్ణారావు, టి. రాజయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. దీంతో, కాంగ్రె స్ బలం 154కి పడిపోయింది.

ఆ 154 మందిలో 25 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలున్నారు. వారిలో జయసుధ సహా కొంత మంది వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగు రోజుల కిందట జగన్ వర్గం భేటీకి హాజరైన 21 మం ది ఎమ్మెల్యేల్లో 20 మంది కాంగ్రెస్ వారున్నారు. వారిలోనూ పలువురు కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు గంపగుత్తగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి లేదు. ఒక వేళ జగన్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు ఇస్తారని అనుకున్నా కాంగ్రెస్ బలం 134కి పడిపోతుంది.

ప్రజారాజ్యం పార్టీకి చెందిన 18 మంది సభ్యుల్లో శోభా నాగిరెడ్డి మినహా మిగిలిన 17 మందీ కాంగ్రెస్‌వైపే ఉన్నారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ మిత్రపక్షమే. అప్పుడు కాంగ్రెస్ బలం 158 అవుతుంది. ఈ నేపథ్యంలో, మేజిక్ ఫిగర్ కంటే కాంగ్రెస్‌కు బలం ఎక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి