మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం)కు చెందిన సోనీ టెలివిజన్ రామోజీరావుకు చెందిన ఈనాడు టీవీ (ఈటివి)ని తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, సోనీ టెలివిజన్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘవ్ బాహ్ల్‌కు చెందిన నెట్‌వర్క్ 18 గ్రూపునకు, ఈటీవికి మధ్య చర్చలు తుది దశకు చేరుకుని ఒప్పందం చేసుకునే వరకు వచ్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. నెట్‌వర్క్ గ్రూపులో రామోజీరావుకు చెందిన తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ చానెళ్లు విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈటీవీ ప్రాంతీయ చానెళ్లను తీసుకుని నెట్‌వర్క్ 18 తన చిరకాల ప్రత్యర్థులు జీ, స్టార్‌లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఉంది. స్టార్‌కు ప్రాంతీయ చానెళ్లు స్టార్ విజయ్, స్టార్ ప్రభ, స్టార్ జల్సా, ఆసియా నెట్ ఉన్నాయి. జీకి ఎనిమిది ప్రాంతీయ చానెళ్లు ఉన్నాయి. ఈటీవి అంచనా విలువు రూ. 2,650 కోట్ల నుంచి రూ. 3,180 కోట్లు ఉంటుందని అంచనా.
ఈనాడు, నెట్‌వర్క్ 18 మధ్య విలీన చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఆంగ్ల పత్రిక రాసింది. దీనికి సంబంధించి తాము ఇ- మెయిల్ ద్వారా ప్రశ్నలు పంపిస్తే రామోజీరావు కుమారుడు సిహెచ్ కిరణ్ నుంచి తమకు ఏ విధమైన సమాధానాలు రాలేదని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. తమ ఇ - మెయిల్స్‌కు నెట్‌వర్క్ 18 అధికార ప్రతినిధులు కూడా స్పందించలేదని చెప్పింది. నెట్‌వర్క్ 18, ఈటివీ విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ు చెందిన ముఖేష్ అంబానీ వాటా పొందవచ్చునని కూడా ఆ పత్రిక రాసింది.
దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమంలో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర - మధ్య భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిషాల్లో ఈటీవి తన ఉనికిని చాటుతోంది. ఒక రకంగా దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో అది తన ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాలోని ఇండియా డయాస్పోరాకు కూడా అందుబాటులో ఉంది. నెట్‌వర్క్ 18 కూడా తన ఉనికిని రెండు సంస్థల ద్వారా చాటుతోంది. దానికి నాలుగు జాతీయ చానెళ్లు - సిఎన్‌బిసి - టీవీ 18, సిఎన్‌బిసి ఆవాజ్, ఐబిఎన్7, సిఎన్ఎన్- ఐబియన్ ఉన్నాయి. మరికొన్ని చానెళ్లలో వాటాలున్నాయి. నెట్‌వర్క్ 18, ఈటీవీ కలిస్తే దేశంలో అతి ప్రధానమైన మీడియా వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి