19, డిసెంబర్ 2011, సోమవారం

బొత్స 'కిక్‌'కు సిఎం చెక్‌ ?

మద్యం సిండికేట్లపై దాడులు

 ఎసిబికి నేరుగా ఆదేశాలు

 ఎక్సయిజ్‌ అధికారులపై నమ్మకం లేకనే...

 తారా స్థాయికి ఆధిపత్య పోరు

 

 

రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను నడిపించే జోడెడ్ల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. తమకు అనుకూలమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ముఠా కట్టడానికే పరిమితమైన ముఖ్యమంత్రి కిరణ్‌, పిసిసి చీఫ్‌ బొత్స పవర్‌ పాలిటిక్స్‌ ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టుకొనే వరకు వెళ్లినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. కిరణ్‌ సిఎం అయ్యేనాటికే మద్యం సిండికేట్లను కొన్ని జిల్లాల్లో ప్రత్యక్షంగా, మరి కొన్ని జిల్లాల్లో పరోక్షంగా నడిపిస్తున్న బొత్స బలమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారని ఆరోపణలొస్తున్నాయి. కోస్తాలోని నాలుగు జిల్లాల మద్యం సిండికేట్లు బొత్స కనుసన్నల్లో నడుస్తున్నాయని సమాచారం. ఇంకా పలు జిల్లాల్లోని సిండికేట్లకు ఆయన నాయకత్వం వహిస్తున్నారని తెలిసింది. రాజకీయంగా అసెంబ్లీలో, బయటా ఎంతలా తిట్టుకున్నా మద్యం వ్యాపారం విషయానికొచ్చేసరికి కాంగ్రెస్‌, టిడిపి సహా ఇంకొన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటోంది. మద్యం సిండికేట్లకు నేతృత్వం వహిస్తూ అధికార పార్టీని, ప్రధాన ప్రతిపక్షాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న బొత్సకు చెక్‌ పెట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులకు సిఎం ఆదేశించినట్లు తెలిసింది. మద్యం మాఫియాను అదుపు చేయడానికే ఎసిబి దాడులని పైకి చెబుతున్నప్పటికీ ఆ వ్యాపారంపై పట్టు సాధించడానికి, తద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలను తన గుప్పెట్లో పెట్టుకోడానికి సిఎం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

 

 

మద్యం సిండికేట్లపై పట్టు కలిగి ఉన్న బొత్సను తన దారికి తెచ్చుకోవాలన్న లక్ష్యంతోనే ఎసిబి దాడులకు సిఎం ఆదేశించారని ఆరోపణలొస్తున్నాయి. కిరణ్‌ సిఎం అయిన రోజు నుండి బొత్స అసంతృప్తిగా ఉన్నారు. కిరణ్‌ మంత్రివర్గాన్ని విస్తరించిన రోజునే సీనియర్‌ మంత్రులను చేరదీసి తమకు అప్రధానమైన శాఖలు ఇచ్చారని నిరసన గళం వినిపించారు. సిఎం పదవిపై కన్నేసిన బొత్సకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా అధిష్టానం రాష్ట్ర పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఊపు నిచ్చింది. అప్పటి నుండి ప్రతి విషయంలోనూ బొత్స, సిఎం మధ్య విభేదాలు తరచు బహిర్గత మవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రికి, తనకు మధ్య విభేదాల్లేవని, తమ జోడు సక్సెస్‌ జోడని బొత్స ఢిల్లీలో ప్రకటించిన సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులుగా అధికారులు మద్యం సిండికేట్‌ కార్యాలయాలపై దాడులు చేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఎసిబికి దొరికిన సమాచారాన్ని పరిశీలిస్తే మద్యం మాఫియా సమాజంలోని అన్ని రంగాలకూ ఆక్టోపస్‌ వలే విస్తరించిందని తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు మద్యం సిండికేట్లు లంచాలిచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఎక్సయిజ్‌, పోలీస్‌, రెవెన్యూ, ఎండోమెంట్స్‌ సహా ముఖ్యమైన అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారని ఎసిబికి సమాచారం అందింది.

 

 

ఇంతగా మద్యం సిండికేట్లు లంచాలు ఇవ్వడానికి కారణం వారి వ్యాపా రానికి ఆయా వర్గాలు అడ్డు రాకూడదనే. ఇంతగా లంచాలిస్తే మద్యం వ్యాపారులకు ఏం మిగులుతాయను కోవచ్చు. రాష్ట్రంలో 6,500 మద్యం దుకాణాలున్నాయి. బార్లు వీటికి అదనం. ఈ ఏడాది మద్యం ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం సాధించాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అదనపు ఉత్పత్తి, పన్నుల పెంపు ద్వారా మొత్తంగా సంవత్సరం పూర్తయ్యేసరికి కనీసం 15 వేల కోట్ల ఆదాయం సాధించాలనుకుంది. మద్యం వ్యాపారులు ఎక్కడా ఎంఆర్‌పికి అమ్మట్లేదు. ఎంఆర్‌పిపై 30-40 శాతం అదనంగా తాగుబోతుల నుండి గుంజుతున్నారు. అంటే ప్రభుత్వానికి 15 వేల కోట్ల ఆదాయం వస్తే ఎంఆర్‌పి నిబంధనలు పాటించకపోవడం వల్ల వ్యాపారులు దానికి అదనంగా ఐదు వేల కోట్లు అక్రమ మార్గంలో దోచుకుంటారన్నమాట. ఈ అక్రమ దోపిడీపై ప్రభుత్వానికి ఎటువంటి పన్నులూ రావు. ఇక నాన్‌ డ్యూటీ పెయిడ్‌, అక్రమ మద్యం, బెల్టు షాపులు ఇవన్నీ కలుపుకుంటే మద్యం వ్యాపారులు దోచుకునేదానికి అంతే లేదు. లిక్కర్‌ వ్యాపారం విషయంలో నియోజకవర్గాల్లో వారు వీరనే తేడా లేదు.

 

టిడిపి, కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు ఏకమవుతున్నారు. మంత్రుల హవా సరేసరి. మద్యం దుకాణం నడవాలంటే ప్రజా ప్రతినిధులకు వాటా తప్పనిసరి. కొంత మంది నేరుగా మద్యం వ్యాపారం చేసే ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ఉన్నారు. జిల్లాలకు జిల్లాలనే తమ గుప్పెట్లో పెట్టుకునే వారూ ఉన్నారు. కోస్తాలో నాలుగైదు జిల్లాల మద్యం వ్యాపారం బొత్స అదుపులో ఉన్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలొస్తున్నాయి. అంటే ఆ జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలపైనా బొత్స ప్రభావం ఉంటుందన్నమాట. మద్యం మాఫియాకు నేతృత్వం వహిస్తున్న బొత్స రాష్ట్ర స్థాయిలోనూ తన ప్రభావం చూపుతున్నారు. అంతే కాదు స్వంత పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ 'అధికారం'తో తన ప్రభావంలోకి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎక్సయిజ్‌ శాఖలో తనకు సన్నిహితంగా మెలిగే కీలకమైన అధికారులను నియమించుకోవడంలో ఆయన చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మద్యం సిండికేట్లు, అక్రమ మద్యం నిరోధానికి దాడులు చేయాల్సిన ఉన్నతాధికారి ఒకరు బొత్స రికమండేషన్‌తో ఎక్సయిజ్‌ శాఖలో నియమితు లైనట్లు సమాచారం. కోస్తా జిల్లాకు చెందిన ఆ అధికారి బొత్స కనుసన్నల్లో పని చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మద్యం మాఫియాపై పట్టు సాధించిన బొత్సకు చెక్‌ పెట్టాలని సిఎం యోచిస్తు న్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ఆదాయ వనరులపై నిర్వహించిన సమీక్షలో ఎక్సయిజ్‌ ఆదాయం అనుకున్నంతగా రాకపోవడంపై కిరణ్‌ దృష్టి సారించారు. మద్యం సిండికేట్లు, ఎక్సయిజ్‌ శాఖలో అధికారుల పనితీరు వల్లనే ఆదాయం రావట్లేదని నిఘా వర్గాలు సిఎంకు వివరించాయని తెలిసింది.

 

దీంతో ఆదాయం తెచ్చుకొనే పేరుతో మద్యం వ్యాపారంపై బొత్స ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు కొన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఎక్సయిజ్‌లోని టాస్క్‌ఫోర్స్‌పైన ఆధారపడకుండా తన కింద ఉన్న ఎసిబిని రంగంలోకి దించినట్లు సమాచారం. ఎక్సయిజ్‌ మంత్రి మోపిదేవిపై గుంటూరు జిల్లాలో ఒక ఐఎఎస్‌ బహిరంగంగా ఆరోపణలు చేసినప్పుడు బొత్స జోక్యం చేసుకొని ఆ అధికారిని బదిలీ చేయించడంలో చక్రం తిప్పినట్లు తెలిసింది. ఎక్సయిజ్‌ మంత్రి సైతం బొత్స ప్రభావంలో ఉన్నారని సిఎం అనుమానిస్తున్నారు. అందుకే దాడుల విషయంలో ఎసిబికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ముమ్మరంగా సిండికేట్‌లపై దాడులు జరుపుతున్న అధికారులు తమకు లభించిన సమాచారాన్ని నేరుగా హైదరబాద్‌లోని ఎసిబి హెడ్‌ క్వార్టర్స్‌కు పంపాలని ఆదేశాలున్నాయి. తమకు లభించిన సమాచారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే కనీసం రెండు నెలలు పడుతుందని ఎసిబి వర్గాలంటున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి