కిరణ్, బొత్సల మధ్య విభేదాలు ఉప పోరు తర్వాతేనంటున్న సిఎం ఇపుడే ఇవ్వాలంటున్న బొత్స హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్న పిసిసి చీఫ్ కేబినెట్ మార్పుల వాయిదాకు ఇప్పటికే అనుమతి పొందిన సిఎం
కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఉప ఎన్నికల అనంతరం జరగబోయే కేబినెట్ మార్పుల సందర్భంగా ప్రజారాజ్యం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతుండగా, పిసిసి అధ్యక్షుడు బొత్స మాత్రం ఇప్పుడే అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమ వేడి కొద్దిగా చల్లారడం, పాలనా వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో మంత్రివర్గ మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. అయితే ఇంతలో శాసనసభ శీతాకాల సమావేశాలు రావడం, రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఓటింగ్‌లో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం, వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వివిధ అంశాలతో పాటు కేబినెట్ మార్పుల గురించి కూడా చర్చించారు. త్వరలోనే 24 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో మంత్రివర్గ మార్పులు చేయడం మంచిది కాదని, ఉప ఎన్నికల తర్వాత చేయవచ్చని సోనియా భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది.
అయితే పిసిసి అధ్యక్షుడు బొత్స మాత్రం ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అంటున్నారు. ఈమేరకు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనమై చాలా రోజులైనా మంత్రివర్గంలో పార్టీకి చెందిన వారికి స్థానం కల్పించడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఉప ఎన్నికల తర్వాత అంటే వచ్చే జూలై వరకు ఆగాల్సి ఉంటుందని, పైగా ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయన్నది కూడా చెప్పలేమని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఉప ఎన్నికల తర్వాత అంటే రెండేళ్ళయినా తాము మంత్రులుగా ఉండలేమని వారంటున్నారు. పైగా ఉప ఎన్నికల తర్వాత అంటే ఆరు నెలల సమయం వృధా అవుతుందని వారు చెబుతున్నారు. ఉప ఎన్నికలకు ముందు మంత్రివర్గ మార్పులు చేయడం అన్నది మంచిది కానట్లయితే ప్రస్తుతానికి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉప ఎన్నికల తర్వాత మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని పిసిసి అధ్యక్షుడు బొత్స అభిప్రాయపడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఆయన వస్తే నేను పోతా
ఇలాఉండగా, గురువారం సిఎల్‌పి కార్యాలయంలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశం చర్చకు వచ్చినపుడు కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి తీవ్రంగా స్పందించారు. కడప జిల్లాకు చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యకు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండే సమస్యే లేదని, జగన్ పార్టీకి వెళ్ళిపోతానని వీరశివారెడ్డి అన్నారు. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వరాదంటూ ఇంతకుముందే కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలిసి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి