16, డిసెంబర్ 2011, శుక్రవారం

‘చిరు’ తప్పిదం- భారీ మూల్యం

'చిరు' తప్పిదం- భారీ మూల్యం

రాజకీయాల్లో 'టైమింగ్' చాలా ముఖ్యమైంది. ఎప్పుడు ఎటువంటి ఎత్తు వేయాలి, వ్యూహాన్ని అనుసరించాలన్నది తెలిస్తేనే రాజకీయాల్లో నాయకులు రాణిస్తారు. దురదృష్టం వెంటాడుతున్నపుడు నాయకులకు దూరదృష్టి లోపిస్తుంది. తన చుట్టూ నాయకుల్ని తిప్పుకోవలసిన నాయకుడు తాను నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాను కోరుకున్న పదవిని అడిగి తీసుకోవలసిన పరిస్థితి నుంచి తనకు ఏ పదవి ఇస్తారు, ఎపుడు ఇస్తారోనని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ ఉపోద్ఘాతమంతా మెగాస్టార్ చిరంజీవికి అక్షరాలా వర్తిస్తుంది.'చిరు' తప్పిదానికి ప్రజారాజ్యం పార్టీ ఇపుడు భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది.
రాజకీయాల్లోకి రావలసిన సమయంలో చిరంజీవి వౌనం వహించారు. రాజకీయాల్లో అవకాశమేలేని సమయంలో మూడో పార్టీకి స్థానం లేని పరిస్థితిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తన సభలకు వస్తున్న జనం సినీ నటుడుగా ఉన్న తనను చూడటానికే తప్ప తన పార్టీని ఆశీర్వదించడానికి కాదన్న నగ్న సత్యం గత ఎన్నికల ఫలితాల తర్వాత గానీ ఆయనకు తెలిసిరాలేదు. ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించడం ఎలా ఉన్నా సాక్షాత్తు చిరంజీవి కూడా తన సొంత నియోజకవర్గంలో ఓటమి చెందారు. అధికారం ఖాయమనుకున్న ప్రజారాజ్యం పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా లభించలేదు.
ప్రజారాజ్యం పార్టీకి గత ఎన్నికల్లో పద్ధెనిమిది స్థానాలు లభించాయి. ఆ పద్ధెనిది స్థానాలతోనే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశం తనకు లభిస్తుందని అపుడు చిరంజీవి ఊహించి ఉండరు. అది నిజమే కూడా. వాస్తవానికి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే చిరంజీవికి గగనమైంది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ఇక్కడే సరైన అడుగులు వేయాల్సిన చిరంజీవి తప్పటడుగు వేశారు. జగన్ రూపంలో కాంగ్రెస్ రాజకీయం తనకు కలిసి వస్తుందని గ్రహించక పోవడం చిరంజీవి తప్పిదమే. జగన్ వెంట నలభై, యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మొదట్లో అనుకున్నారు. నలభై, యాభై మంది కాకపోయినా జగన్ వెంట ఎంతోకొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ ఉందన్నదీ తెలిసిందే. ఈ పరిస్థితిలో జగన్ వెంట డజను మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తనది కీలక పాత్ర అవుతుందని చిరంజీవి, ఆయన సన్నిహితులు గ్రహించక పోవడం ఆశ్చర్యం.
కారణాలు ఏవైనా తాను రాజకీయ పార్టీని నడపడం కష్టమని చిరంజీవి భావించారు. కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మంచిదన్న అభిప్రాయానికి చిరంజీవి వచ్చారు. చిరంజీవికి రాజకీయాలు కొత్త కావచ్చు కాని, ఆయన వెంట ఉన్న కొంతమందికి రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. మరి వారు ఏం చేస్తున్నట్టు? ఎస్ బాస్‌ల్లా వారు చిరంజీవి చెప్పే దానికే ఊ కొట్టారా లేక వారు చెప్పింది చిరంజీవి వినిపించుకోలేదా?
సాధారణంగా తనకు ప్రత్యర్ధులు ఎవరు లేకుండా చూసుకోవడం కాంగ్రెస్ సాంప్రదాయం. వీలుంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన వారినో లేక ఏకంగా మొత్తం పార్టీనో తనలో కలుపుకోవడం, లేని పక్షంలో కనీసం మిత్రపక్షంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా ఇవే పావులు కదిపింది. చిరంజీవికి కూడా రోగి కోరుకున్నది, వైద్యుడు చెప్పిందీ ఒకటే అన్నట్లు అనిపించింది. ప్రజారాజ్యం పార్టీకి తనలో విలీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ ఆతృతకన్నా కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీకి విలీనం చేయాలన్న ఆతృత చిరంజీవికే ఎక్కువ కనిపించింది. మాకు మద్దతు ఇవ్వండి చాలు అని కాంగ్రెస్ అంటే అబ్బే లేదు, బయటి నుంచి మద్దతు ఇవ్వడం ఏమిటి, ఏకంగా లోపలికి వచ్చేస్తాం అని చిరంజీవి అన్నారట. కాంగ్రెస్ సమక్షంలో జరగాల్సిన విలీన ప్రక్రియ ఆమె తనయుడు రాహుల్ గాంధీ సమక్షంలో జరగడానికైనా చిరంజీవి అంగీకరించారంటే ఆయన ఎంత తొందరగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవి కొంత దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఇపుడు ఆయన పరిస్థితే మరోలా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాసం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడింది నిస్సందేహంగా చిరంజీవి పార్టీనే. కానీ ఈ విషయంలో చిరంజీవికి తగిన గుర్తింపు రాలేదు.కారణం ఆయన కాంగ్రెస్‌లో భాగం కావడమే. అదే కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని కాపాడినట్లయితే చిరంజీవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆకాశానికి ఎత్తేసేది. ఇప్పుడు కేవలం కృతజ్ఞలతో సరిపెట్టింది. ఇంత జరిగినా తనకు గాని, తన పార్టీ ఎమ్మెల్యేలకు గాని పదవులు ఇప్పించుకునే స్థితిలో చిరంజీవి లేరు. కాంగ్రెస్ ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చినట్లయితే ఇప్పటికే చిరంజీవి ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలోను, తనకు కేంద్ర మంత్రివర్గంలోను పదవులు లభించి ఉండేవి. డిమాండ్ చేసి పదవులు పొందాల్సిన చిరంజీవి తన డిమాండ్‌ను తనే తగ్గించుకున్నారు. అధిష్ఠానాన్ని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవలసిన చిరంజీవే ఢిల్లీలో అధిష్ఠానం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాంగ్రెస్‌లోని కొందరు పెద్ద నాయకులు తమ ప్రయోజనాలకోసం చిరంజీవిని వాడుకుంటున్నారు. ఇది ప్రజారాజ్యం పార్టీ నాయకులకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. చిరంజీవి అమాయకత్వాన్ని, మంచితనాన్ని కాంగ్రెస్ నాయకులు బాగా వాడుకుంటున్నారు. అవసరం వచ్చినపుడు వాడుకుని వదిలేయడం కాంగ్రెస్ సాంప్రదాయం. కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి అన్నది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. చిరంజీవికి మాత్రం ఇది ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. మరి చిరంజీవి రాజకీయ నాయకుడు కాదు కదా. తన అమాయకత్వం, మంచితనమే చిరంజీవికి చివరకు కలిసి వస్తుందేమో?! దీనికి కారణం కాలమే చెబుతుంది. అప్పటి వరకు చిరు బృందం వేచి చూడాల్సిందే.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి