15, డిసెంబర్ 2011, గురువారం

చిరంజీవి మంత్రి పదవిని అడ్డుకుంటుంది ఎవరు ?

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి మెగా సమస్య ఎదురవుతోంది. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే పార్టీ అధిష్టానం ప్రయత్నాలకు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడడానికి పార్టీనే త్యాగం చేసిన ఆపద్భాంధవుడు చిరును సరైన రీతిలో గౌరవించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ఆయనను ముఖ్యమంత్రిగా చేసే పరిస్థితి లేదు. పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టలేదు. ఈ స్థితిలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తలపోశారు. కానీ, అనూహ్యంగా కావూరి సాంబశివ రావు దానికి అడ్డు వస్తున్నట్లు తెలుస్తోంది.

 

చాలా కాలంగా కావూరి సాంబశివ రావుతో పాటు మరో పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు కొన్ని సార్లు నేరుగానే దీనిపై అధిష్టానంపై దండెత్తే దాకా వెళ్లారు. కావూరి సాంబశివ రావు మాత్రం చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన లోకసభలో తన ప్రసంగాల ద్వారా అదరగొట్టే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ దృష్టిని ఆకర్షించే పని కూడా చేశారు. నిజంగానే అధిష్టానంలో కావూరి ప్రాబల్యం పెరిగింది. ఈ ప్రాబల్యంతో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి