15, డిసెంబర్ 2011, గురువారం

వైయస్ జగన్ బలానికి టెస్టు

ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలాన్ని పరీక్షించి అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దీనికి ఓటేస్తున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలకు కాంగ్రెసు భయపడుతుందనే ప్రచారాన్ని దెబ్బ కొట్టడానికి, అదే సమయంలో జగన్ బలాన్ని అంచనా వేయడానికి కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందుకు మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, తమ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాన్ని కూడా అంచనా వేసుకోవాలని అనుకుంటున్నారు. దానివల్ల ఉప ఎన్నికలకు సిద్ధం కావడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు.

 

మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలాలు కూడా ఏమిటో తెలిసిపోతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి ఉప ఎన్నికలకు వ్యూహరచన చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా ప్రత్యర్థులను, అంటే ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలనే వ్యూహం కూడా అందులో దాగి ఉందని చెబుతున్నారు. సీమాంధ్రలోని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితే వైయస్ జగన్‌ను ఉప ఎన్నికల్లో దెబ్బ తీయడానికి తగిన ప్రాతిపదిక ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల వివాదం వల్ల నైతికంగా దెబ్బ తిన్నారని కాంగ్రెసు నాయకత్వం అభిప్రాయపడుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్ల విషయంలో కెసిఆర్‌ను దెబ్బ తీయడానికి తగిన ఏర్పాట్లే చేశారని అంటున్నారు.

 

మున్సిపల్ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా సమీక్షా సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కనీసం మూడు నెలలైనా ఉప ఎన్నికలకు సమయం ఉంటుంది. మున్సిపల్ పోల్స్ ఫలితాల వల్ల జిల్లా స్థాయిల్లో పార్టీ శ్రేణుల సమీకరణాలు కూడా అర్థమవుతాయి. దాంతో శ్రేణులను కూడగట్టుకునే ప్రయత్నాలకు పూనుకోవచ్చుననేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేస్తే రాష్ట్రంలో 26 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. వీటిలో సత్తా చాటితే 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి తగిన నైతిక బలం, ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా కాంగ్రెసు కార్యకర్తలు క్రియాశీలం కావడానికి తోడ్పడుతుందనే అసలు ఆలోచన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి