16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఫామ్ హౌస్‌లో కెసిఆర్ ఏం చేస్తున్నారు

 నిత్యం ఉద్యమాలతో బిజీ బిజీగా ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ మధ్య మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్‌లో గడుపుతున్నారు. గత వారంలో ఐదు రోజుల పాటు ఆయన ఫామ్ హౌస్‌లోనే గడిపారట. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం వచ్చి నేరుగా అక్కడకే వెళ్లారు. శుక్రవారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే కెసిఆర్ నిత్యం ఫామ్ హౌస్‌లో గడపటంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, సొంత పార్టీలో నేతలు బాగా చర్చించుకుంటున్నారట.

ఉద్యమంపై వ్యూహరచన చేసే కెసిఆర్ తన ఫామ్ హౌస్‌లో ఉంటూ ఇప్పుడు తన తోటలో ఏ కూరగాయలు పండించాలా? అని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఇదే విషయాన్ని పార్టీ నేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారట. పంట గురించి ఆలోచిస్తూనే మరోవైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక నుండి ఉద్యమంతో పాటు వారానికి ఒక్క రోజైనా ఫామ్ హౌస్‌లో ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారట. కెసిఆర్‌లోని మార్పు చూసి పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

కెసిఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టి కెసిఆర్ ఇప్పుడు తోటల్లో తిరుగుతున్నారని వారు విమర్శిస్తున్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ విశ్రాంతి వెనుక ఢిల్లీ సందేశ ప్రభావం ఏమైనా ఉందా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి