తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట కొద్దిగా మారినట్లుగా కనిపిస్తోందని, అయితే అందులోని అర్థం మాత్రం అదే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలో బాబు రెండు రోజులు పర్యటించారు. పర్యటన సందర్భంగా బాబు తన మాటల్లో తెలంగాణ అంశం రాకుండానే చూసుకున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అందులో స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు. అయితే ఆందోళనకారులు అడ్డుకోవడం తదితర సందర్భాలలో ఆయన తెలంగాణ అంశం మాట్లాడక తప్పలేదు.
బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా తనపై ఉందని, భావితరాలకు పార్టీని అందించాల్సిన అవసరం కూడా ఉందని, అందుకే తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమం చేస్తే ఏనాడూ చేయొద్దని చెప్పలేదని, ఏ ఒక్క రోజూ తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, స్వార్థబుద్ధితో కాంగ్రెసు, టిఆర్ఎస్ తనపై, తన పార్టీపై విరుచుకు పడుతున్నాయని, తెలంగాణ అంశాన్ని తాము పరిష్కరించే స్థానంలో లేమని, దానిని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే పరిష్కరించాలని చెప్పారు. తాను తెలంగాణవాదాన్ని ఎప్పుడూ కాదనలేదని తన పర్యటనలో అన్నారు.
అయితే తెలంగాణ పర్యటనలో బాబు వ్యాఖ్యల్లో కొత్తదనం కనిపించినప్పటికీ, అర్థం మాత్రం అదే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాబు ఇదివరకు తెలంగాణ అంశంపై ప్రశ్నిస్తే తెలంగాణపై తాము గతంలోనే చెప్పామని, దానికే కట్టుబడి ఉన్నామని మాత్రమే చెప్పేవారు. అంతకుమించి మాట్లాడక పోయేవారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్‌లోనూ పార్టీ అధ్యక్షుడిగా రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, కాబట్టి ఇరు ప్రాంతాల నేతలను ఆయా ప్రాంత ప్రజల అభిప్రాయల మేరకు నడుచుకోవాలని సూచించానని చెప్పారు.
గతంలో ఇరు ప్రాంతాల మనోభావాలు అన్న బాబు ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మాత్రమే కొత్తగా అన్నారని, ఆయన వ్యాఖ్యల్లో కొత్తదనం కనిపించినా అర్థం మాత్రం అదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్థం అదే అయినప్పటికీ తెలంగాణవాదాన్ని తాను ఏనాడూ కాదనలేదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో టిడిపికి లబ్ధి చేకూరుస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి