రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో విధిస్తున్న కోత రోజురోజుకూ పెరిగిపోవడం సామాన్య ప్రజలను, పారిశ్రామిక వర్గాలను తీవ్రంగా కలవరపెడుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగించి, వీలైనన్ని ఎక్కువ గంటలు విద్యుత్ అందించడానికి ప్రయత్నిస్తామని సీఎం సహా అమాత్యులూ, ఉన్నతాధికారులూ చేస్తున్న ప్రకటన లేవీ ఆచణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని పట్టణాల్లోనూ ఎనిమిది గంటలకుపైగా కరెంటు కోత విధిస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రోజులో ఎనిమిది గంటలు కూడా అంతరాయం లేకుండా కరెంటు సరఫరా లేకపోవడం ప్రజలను ప్రధానంగా రైతులను తీవ్రమైన ఇక్కట్లకు గురిచేస్తోంది.
చలి కాలంలోనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, ఇక వేసవి కాలంలో కోతలు ఎలా ఉంటాయోనన్నది మరింత భయంగొలుపుతోంది. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య పూడ్చలేని అగాధం విస్తరిస్తుండటం రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తోందన్నది అతిశయోక్తి కాదు. అక్రమ కనెక్షన్లు, విద్యుత్ చౌర్యం వంటి నేరాలపై నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. విద్యుత్ సరఫరాలో విధిస్తున్న కోతకు సంబంధించిన వివరాలు ముందుగా ప్రకటించకపోవడంతో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన సంస్థలు తీవ్ర నష్టాలకు గురవుతున్నాయి. ఇది రాష్ట్రాభివృద్ధిని కుంటుపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాధాన్యతాక్రమంలో విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు సంప్రదాయేతర వనరులైన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించి ప్రజలను చైతన్యపరచి ప్రోత్సహించాలి. అణు విద్యుత్‌పై ఉన్న అపోహలు తొలగించడానికి, అణు విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న కష్టనష్టాలను అధిగమించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. 'కోత'ల పరిస్థితి మెరుగు పడకుండా ఇలాగే కొనసాగితే, ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నది గుర్తించాలని మనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి