16, డిసెంబర్ 2011, శుక్రవారం

టి-బోర్డు తిప్పేశారు!

ప్రతిపాదనకు యుపిఏ ఫుల్‌స్టాప్ రాజ్యాంగపరమైన చిక్కులే కారణం రెండో ఎస్సార్సీ ప్రకటనకే మొగ్గు

 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. రాజ్యాంగపరమైన సమస్యలు ఎదురు కావటంతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను యుపిఏ సంకీర్ణ సర్కారు, కాంగ్రెస్ హైకమాండ్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చిన తరువాత, ప్రాంతీయాభివృద్ధి మండలి ప్రతిపాదనను తెరపైకి తేవటం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రాంతీయాభివృద్ధి మండలి ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్, యుపిఏ సంకీర్ణ సర్కారు పునరాలోచనలో పడినట్టు చెప్తున్నారు. మండలి ఏర్పాటుకు రాజ్యాంగపరంగా సమస్యలు ఎదురవుతున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. మండలికి రాజ్యాంగపరమైన హోదా కల్పించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. సవరణకు లోక్‌సభలో మూడువంతుల మెజార్టీ అవసరం. బిజెపి మద్దతులేకుండా టి.బోర్డు బిల్లుకు పార్లమెంటు ముద్ర వేయించుకోవటం సాధ్యం కాదని యుపిఏ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న బిజెపి, టి.బోర్డు ఏర్పాటుకు మద్దతివ్వదని హైకమాండ్, యుపిఏ పెద్దలు భావిస్తున్నారు. అందువల్ల ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలంగాణకు మాత్రమే అభివృద్ధి మండలి ఏర్పాటు చేయటం వల్ల రాష్ట్రంలోని మిగతా రెండుప్రాంతాల ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా, రాజకీయంగా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చన్న ఆందోళన హైకమాండ్‌ను వెంటాడుతోంది. ఇదిలావుంటే యుపిఏ సంకీర్ణ సర్కారు, కాంగ్రెస్ హైకమాండ్ డిసెంబర్ నెలాఖరుకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వివాదంపై ఒక విధాన ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం సాధ్యంకాదంటూ, చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు రెండవ రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ విధానమని ప్రకటించనున్నట్టు తెలిసింది.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెలాఖరుకు తెలంగాణ అంశంపై పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన చేస్తుందని వెల్లడించటం గమనార్హం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి