కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సమస్యను కాంగ్రెసు పార్టీ అధిష్టానం తేల్చే పరిస్థితిలో లేనందున క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప రాష్ట్రపతి పదవి జైపాల్ రెడ్డిని వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జైపాల్ రెడ్డి తెలంగాణవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెసు అధిష్టానం అనుమానిస్తుండగా తెలంగాణవాదులు ఆయనను తెలంగాణ వ్యతిరేకిగా జమకడుతున్నారు. ఈ స్థితిలో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పడమే మంచిదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
తన ముఖ్య అనుచరులు తన వద్దకు వచ్చినప్పుడు ఆయన తన అభిమతాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన వారికి చెప్పారని అంటున్నారు. పట్టణాభివృద్ఢి శాఖ నుంచి పెట్రోలియం శాఖకు మార్చడం ద్వారా ఆయనకు అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చిందని అనుకుంటున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం దీక్ష చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జైపాల్ రెడ్డి మద్దతు ఉందని కాంగ్రెసు అధిష్టానం అనుమానిస్తోంది.
తెలంగాణ విషయంలో అనుమానాలు ఉన్నప్పటికీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలున్నట్లు చెబుతున్నారు. పరిపాలనాదక్షుడిగా, మంచి వక్తగా, పార్లమెంటేరియన్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. దీంతో ఆయను ఉప రాష్ట్రపతి పదవికి తగిన అభ్యర్థిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. జూలైలో రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగుస్తోంది. ఈ స్థితిలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీని రాష్ట్రపతి పదవికి పరిగణనలోకి తీసుకుంటే ఉప రాష్ట్రపతి పదవి జైపాల్ రెడ్డికి దక్కవచ్చునని చెబుతున్నారు. తద్వారా జైపాల్ రెడ్డి తెలంగాణ వివాదం నుంచి బయటపడడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
16, డిసెంబర్ 2011, శుక్రవారం
క్రియాశీలక రాజకీయాలకు జైపాల్ రెడ్డి గుడ్‌బై?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి