15, డిసెంబర్ 2011, గురువారం

‘ఉప వ్యూహ’ రచనలో ‘దేశం’

నేటి నుంచి జిల్లాల వారీగా నాయకులతో చంద్రబాబు చర్చలు

 

హైదరాబాద్, డిసెంబర్ 15: ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు శుక్రవారం నుండి జిల్లాల వారిగా టిడిపి శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై వేటు అంశం ఇంకా ఖరారు కాలేదు. వేటు వేస్తారా? వేస్తే ఎప్పుడు వేస్తారనే సందేహాలు ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా తెలంగాణలోని ఏడు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. దాంతో తొలుత ఉప ఎన్నికలు జరిగే తెలంగాణ జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్ జిల్లా సమావేశం శుక్రవారం జరుగుతుంది. ఈ జిల్లాలో మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ మొత్తం మూడు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. నాగర్‌కర్నూల్ మినహా మిగిలిన రెండు నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను, కొల్లాపూర్ నుండి జగదీశ్వర్‌రావును పోటీకి నిలుపనున్నారు. నాగం జనార్దన్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలు జరుగుతున్న నాగర్‌కర్నూల్‌లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు బలమైన నాయకులెవరూ పార్టీకి లభించడం లేదు. మొదటి నుండి ఈ నియోజక వర్గంలో టిడిపి తరఫున నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీ చేసేంత బలమైన నాయకులెవరూ పార్టీలో లేరు. జిల్లాలోని ఈ మూడు నియోజక వర్గాలపై టిడిపి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే పోటీ మరీ ఏకపక్షంగా సాగకుండా పరువు నిలిచే విధంగా పోటీ ఇస్తే, అది వచ్చే సాధారణ ఎన్నికలకు ఉపయోగపడుతుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపికి లభించిన ఓట్ల కన్నా ఈసారి టిడిపికి ఎక్కువ ఓట్లే వస్తాయని ఆ పార్టీ నాయకులు తెలిపారు. అప్పుడు డిపాజిట్ రాలేదు, ఇప్పుడు కనీసం డిపాజిట్ సాధించినా పరిస్థితి మెరుగుపడినట్టేనని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. మా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడినా దాన్ని మేం సానుకూలంగా మార్చుకోగలం అని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయి కాబట్టే మా పరిస్థితి కొంత మెరుగుపడిందని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మాకు అనుకూలంగా ఉంటుందనే ప్రచారానికి అవకాశం లభిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 30వేల వరకు ఓట్లు లభించడం అంటేనే పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని అర్ధమవుతోందని టిడిపి నాయకులు చెబుతున్నారు. తొలుత ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గాలకు సంబంధించిన జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ జిల్లాల్లో సైతం విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు టిడిపి నాయకులు తెలిపారు.
తెలంగాణలో ఓట్ల శాతం పెంచుకుంటామని, అదే విధంగా సీమాంధ్రలో కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ల మధ్య చీలిపోవడం వల్ల టిడిపి తన ఓట్లు తాను సాధించుకుంటే విజయం సాధిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీని కోసం అనుసరించాల్సి వ్యూహంపై జిల్లాల సమావేశాల్లో చర్చించనున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి