16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఆకలితో అమెరికా?

అమెరికాలోని ప్రధాన నగరాల్లో పేదరికం పెరుగుతున్నందున కుటుంబానికి తగినంతగా ఆహారాన్ని అందించలేని కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్లు ఒక నూతన సర్వే గురువారం వెల్లడించింది. అమెరికా మేయర్ల సదస్సు నిర్వహించిన 2011, ఆకలి, గృహ వసతి లేమి సర్వే 29 నగరాలకు గాను 25 నగరాల్లో 2010, సెప్టెంబర్‌ నుంచి 2011, ఆగస్టు మధ్య కాలంలో అత్యవసర ఆహార సహాయం కోసం విజ్ఞప్తుల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ అత్యవసర ఆహార సహాయాన్ని కోరిన వారిలో 26 శాతం మంది ఒకప్పటి ఉద్యోగులు కాగా దాదాపు సగం మంది ఇంటివద్దనే ఉండే ప్రజలున్నారు. వృద్ధులు 19 శాతంగా ఉన్నారు. గృహ వసతి లేనివారు 11 శాతంగా ఉన్నారు. 2007-09 మాంద్యం వల్ల ఏర్పడిన నష్టం తీవ్రతను ఎత్తి చూపిన తాజా నివేదిక ఇది. ఆర్థిక మందగమనం రెండున్నరేళ్ళ క్రితం ముగిసినప్పటికీ పుంజుకోవడం మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. నిరుద్యోగం అత్యున్నతంగా 8.6 శాతంగా ఉంది. 2.44 కోట్ల మంది అమెరికన్లు పనికి దూరమై లేదా సరైన ఉపాధి లేకపోవడం వంటి వాటితో ఉన్నారు. ఉద్యోగిత మాంద్యం ప్రారంభమైన 2007, డిసెంబర్‌ నాటి స్థాయిల కంటే తక్కువగా 63 లక్షలుగా ఉంది. ప్రభుత్వ గణాంకాలననుసరించి 2010లో 4.91 కోట్ల మంది అమెరికన్లు పేదరికంలో నివసిస్తున్నారు. అదే సమయంలో ఆహార స్టాంపులు, సబ్సిడీలపై ఆధారపడిన వారి సంఖ్య 16 శాతం పెరిగి 1.36 కోట్లకు చేరుకుంది. ఆహార సహాయం కోసం డిమాండ్‌ పెరగడానికి నిరుద్యోగం, పేదరికం, తక్కువ వేతనాలు, ఎక్కువగా ఉన్న ఇళ్ళ ధరలు ప్రధాన కారణాలుగా ఆ సర్వే తెలిపింది. నగరాల్లో పంచిన ఆహారం సగటున పది శాతం పెరిగినట్లు అది కనుగొంది. తాము అందించిన ఆహార పదార్థాల పరిమాణంలో పెరుగుదల ఉన్నట్లు మూడింట రెండు వంతుల నగరాలు తెలిపాయి. అత్యవసర ఆహార కొనుగోళ్ళ కోసం తమ మొత్తం బడ్జెట్లు పెరిగినట్లు దాదాపు 71 శాతం నగరాలు చెప్పాయి. 29 నగరాలకు గాను 27 నగరాల్లో అత్యవసర ఆహార సహాయం కోరినవారిలో 27 శాతం మందికి అది అందలేదని సర్వే కనుగొంది. 86 శాతం నగరాల్లో ఆహార ప్యాంట్రీలు, అత్యవసర వంటశాలలు తాము అందించే ఆహార పరిమాణాన్ని తగ్గించాల్సి వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా ఆహార సహాయానికి డిమాండ్‌లో తగ్గుదల ఉంటుందని ఏ ఒక్క నగరం భావించడం లేదు. ప్రభుత్వ నిధుల్లో కోత, ప్రజల నుంచి అందే విరాళాలు తగ్గడం వల్ల ఆహార సహాయాన్ని అందించే వనరుల్లో తగ్గుదల వచ్చినట్లు పలు నగరాలు ఊహిస్తున్నాయి. ఈ 29 నగరాల్లోనూ గృహ వసతి లేనివారి సంఖ్య కూడా సగటున ఆరు శాతం పెరిగినట్లు సర్వే కనుగొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి