16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఓదార్పుకు విరామం

రైతు, రైతు కూలీలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారికి నిలువనీడ లేకుండా చేస్తూ దయలేని ప్రభుత్వంగా మారిందని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి మండిపడ్డారు. మేడికొండూరు మండలం మందపాడు, వరగాని, సిరిపురం గ్రామాల్లో జగన్ ఓదార్పుయాత్ర శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో దివంగత వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం జగన్ మాట్లాడుతూ లక్ష ఎకరాల్లో అన్నదాత క్రాప్‌హాలిడే ప్రకటించి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని అన్నారు. బ్లాక్‌మార్కెట్‌లో సినిమా టిక్కెట్లు కొన్న విధంగా ఎరువులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎరువుల ధరలు రెట్టింపై వర్షాభావంతో సగమైనా పంట చేతికొచ్చే పరిస్థితులు లేవని, దీంతో వరికోసేందుకు సైతం రైతులు వెనకాడాల్సి వస్తోందని అన్నారు. పేదరికం నుండి బయట పడాలంటే ప్రతి కుటుంబం నుండి ఒక్కరైనా ఉన్నత విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో దివంగత వైఎస్ ఫీజురీయింబర్సుమెంటు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో తనహయాంలో 48 లక్షల ఇళ్లను నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఉన్న బకాయిలను విడుదల చేయకపోగా వైఎస్ మరణానంతరం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాలో జగన్ చేపట్టిన రెండవ విడత ఓదార్పుయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాదులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సమావేశం, పుట్టినరోజు వేడుకలు, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్మోహనరెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాదు బయలుదేరి వెళ్లారు. ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్ల మేర జగన్ ఓదార్పుయాత్రను నిర్వహించారు. వివిధ గ్రామాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన 400 వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 22 మంది మృతుల కుటుంబాలను జగన్ ఓదార్చారు. జిల్లాలో మూడవ విడత ఓదార్పుయాత్రను జనవరి మొదటి వారంలో తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి