గ్రూప్ వన్ మెయిన్స్ లో అక్రమాలు జరిగాయా..? మూల్యాంకనంలో తప్పులు దొర్లాయా..? కావాలని కొంత మందికి లబ్ది చేకూర్చారా..? ఫలితాలు చూశాక వందల మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంవాళ్లకు దారణంగా అన్యాయం జరిగిందటూ గగ్గోలుపెడుతున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఏపీపీఎస్సీ ఈ ఆరోపణలతో ..కొత్త చిక్కుల్లో పడింది.
ఛైర్మన్ ఛేంజ్ అయినా ఏపీపీఎస్సీ తీరులో పెద్దగా మార్పు కన్పించడం లేదు. ప్రస్తుతం గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలపై జరుగుతున్న గొడవే అందుకు నిదర్శనం. ఇంటర్వ్యూలకు ఎంపికైన జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్నా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమకు అన్యాయం చేశారంటూ కొంత మంది విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఈ సారి మెయిన్స్ కు మొత్తం 416 మందిని ఎంపిక చేసింది ఏపీపీఎస్సీ. కానీ ఇందులో 350 మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే. అదే తెలుగు మీడియం అభ్యర్థుల సంఖ్య మాత్రం వంద కన్నా చాలా తక్కువగా వుంది. ఇదే అనేక అనుమానాలను కల్గిస్తోంది. ఎందుకుంటే మెయిన్స్ రాసిన వాళ్లలో 90 శాతం తెలుగు మీడియం వాళ్లే. అలాంటప్పుడు ఇంత తేడా ఎలా వస్తుందనేది చాలా మంది డౌట్ .
ఒకవేళ వాళ్ల పేపర్లు ఇంగ్లీష్ ప్రొఫెసర్లు దిద్దారా అన్న సందేహాలు వస్తున్నాయి.
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం ఒకెత్తైతే .....మరో విచిత్రం అభ్యర్థులకు షాకిస్తోంది. ఒక్క తిరుపతి సెంటర్ నుంచే ఏకంగా 120 మంది ఎంపిక కావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. అది సీఎం సొంత జిల్లా చిత్తూరు కేంద్రం కావడమే అందర్నీ ఆలోచనల్లో పడేస్తోంది. అటు వరంగల్ సెంటర్ నుంచి కేవలం 11 మందే సెలక్టవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది .
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ...తిరుపతి సెంటర్లో అక్రమాలు జరిగాయంటూ ....పరీక్షలప్పుడే ఆరోపణలొచ్చాయి. కొంత మంది కొశ్చన్ పేపర్స్ ఇవ్వకముందే ఆన్సర్ల రాయడం పై వివాదం రాజుకుంది. దానిపై ఏపీపీఎస్సీ విచారణకు కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఆ నివేదిక ఎక్కుడుందో ,ఏమైందో ఎవరికీ తెలియదు. అంతేకాదు ఈ కేంద్రం నుంచి ఎంపికైన 120 మందిలో ఎక్కువ మంది ఇంగ్లీష్ వాళ్లే కావడం విశేషం.
మొత్తానికి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో ఏదో జరిగిందనే సందేహం అభ్యర్థుల్లో కలుగుతోంది. ఆన్సర్ షీట్లను మరోసారి మూల్యాంకనం చేయాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. లేకపోతే పగలనక, రాత్రనక తాము పడ్డ కష్టమంతా వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ దీనిపై ఏపీపీఎస్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి