ఆయన మాటలు పదునైన ఈటెలు. ఆయన కథలు సమసమాజ స్థాపనకు బాటలు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆయన జీవితం ఎందరికో మార్గదర్శకం. ఆయనే ది గ్రేట్ త్రిపురనేని మహారథి. కలం బలంతో కదంతొక్కిన ఈ మాటల మరఫిరంగి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో తనువు చాలించారు. వయసు 81 సంవత్సరాలు. ఈ నెల 12న ఇంట్లో స్నానాలగదిలో కాలు జారిపడ్డ ఆయన అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.
మహారథికి భార్య కమలమ్మ, ముగ్గురు కుమారులు కిషోర్, వరప్రసాద్ (చిట్టి), రాజేంద్ర ఉన్నారు. కుమార్తె ఉషారాణి చనిపోయారు. ఆయన రెండో కుమారుడైన వరప్రసాద్ సినిమా రంగంలోనే దర్శకుడుగా కొనసాగుతున్నారు. 'శాంతి సందేశం' సినిమాకు ఆఖరుగా రచన చేసిన మహారథి క్రిస్మస్‌కు రెండు రోజుల ముందుగా మరణించడం గమనార్హం. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకే కాదు.. సాహితీ ప్రపంచానికే తీరనిలోటు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్‌లోని స్మశాన వాటికలో మహారథి భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.
''ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం''. ''ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్రభారత జయకేతనంగా నిలుస్తాను.
వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం''
ఈ సంభాషణలు గుర్తున్నాయా?... అసలు మరచిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. తెలుగు ప్రేక్షకుని నరనరాల్లోనూ పాతుకుపోయి, ఆత్మలో లీనమైపోయిన డైలాగులవి. మననం చేసుకుంటేనే చాలు... రోమాలు నిక్కబొడవడం ఖాయం. 'అల్లూరి సీతారామరాజు'కు మాటలు రాసిన మహారథి ఆ చిత్రానికి వెన్నెముక అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
మహారథి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నాణ్యత కోసం తపించే మనిషి. మాట తప్పని, మడమ తిప్పని నైజం ఆయనది. ఆయన ఎప్పుడూ మాటల్నే నమ్ముకున్నారు డబ్బు మూటల్ని మాత్రం కాదు. అలాంటి మనిషే అయ్యుంటే 'అల్లూరి సీతారామరాజు' కోసం ఏడు సినిమాలు వదులుకుని ఉండేవారే కాదు. రాశి కన్నా వాసికే ప్రాధాన్యం ఇచ్చేవారు కాబట్టే 40 ఏళ్ల పై చిలుకు కాలంలో 52 సినిమాలకు (డబ్బింగ్ సినిమాలు అదనంగా వంద వరకూ ఉంటాయి) మాత్రమే రచన చేయగలిగారు. ఆ 52 సినిమాల్లోనూ చాలా మట్టుకు ఘనవిజయాన్ని అందుకున్నవే. మహారథి పేరు చెప్పగానే బందిపోటు, కంచుకోట, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, దేవుడు చేసిన మనుషులు... ఇత్యాది చిత్రాలు గుర్తొస్తాయి.
జీవితమంతా మలుపులే
మహారథి అనేది ఆయన కలం పేరు. ఆయన అసలు పేరు 'త్రిపురనేని బాలగంగాధరరావు'. 1930 ఏప్రిల్ 30న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో భూస్వామి కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుంచే ఆయనకు నాటకాలన్నా, సాహిత్యమన్నా పంచప్రాణాలు. పన్నెండేళ్లకే రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణాలన్నీ ఔపోసన పట్టేశారు. ఆ వయసులోనే 'బాధర్' కలం పేరుతో చాలా పత్రికల్లో గేయాలు, పద్యాలు రాశారు. పదమూడేళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని మలుపులు సినిమా స్క్రిప్టుని తలపిస్తాయి. తండ్రి హఠాన్మరణంతో కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. నిజామాబాద్ సమీపంలోని ధర్మారంలో ఐదేళ్లు వ్యవసాయం చేశారు. 1947లో హైదరాబాద్ వచ్చి వాటర్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో గుమస్తాగా చేరారు.
తర్వాత దక్కన్ రేడియోలో తెలుగు అనౌన్సర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. జీతం సరిపోక రాత్రిళ్లు 'మీజాన్' పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. తెలంగాణ భూపోరాటంతో ప్రత్యేక సంబంధాల కారణంగా మూడేళ్లు అజ్ఞాతవాసం గడిపాల్సివచ్చింది. అటుపై విజయవాడ సర్వోదయ ప్రెస్‌లో మేనేజర్‌గా చేరారు. అక్కడ నుంచీ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మేనేజర్‌గా వెళ్లారు. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో 'పాలేరు'కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో తిరిగి హైదరాబాద్ చేరి, మళ్లీ రేడియో ఉద్యోగంలో చేరారు. 1956లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రేడియో వ్యాఖ్యానం చేసింది మహారథే. 1954లో వచ్చిన 'తెలుగుదేశం' పత్రికలో సబ్ ఎడిటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
రెండురోజుల్లో 'బందిపోటు' స్క్రిప్ట్
దర్శకునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మద్రాసు వెళ్లారు. కేబీ తిలక్, కేఎస్ ప్రకాశరావు తదితరుల దగ్గర పనిచేసినా అవకాశాలు మాత్రం రాలేదు. ఈ లోగా అనుకోకుండా అనువాద రచయితగా అవకాశం వచ్చింది. 'శివగంగసీమై' అనే తమిళ చిత్రాన్ని 'యోధాన యోధులు' పేరుతో అనువదిస్తూ మహారథికి అవకాశం ఇచ్చారు. ఒక దశలో డబ్బింగ్ ఫీల్డులో శ్రీశ్రీ, అనిశెట్టితో పోటీపడ్డారు. 'సతీ అరుంధతి' అనే డెరైక్ట్ చిత్రానికి తొలిసారిగా మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు పనిచేస్తున్నప్పుడే ఎన్టీఆర్ 'బందిపోటు' సినిమాకు పనిచేసే అవకాశమిచ్చారు నిర్మాత డూండీ. రెండేరెండు రోజుల్లో ఈ స్క్రిప్టు సిద్ధం చేయడం విశేషం. 'సతీ అరుంధతి' కన్నా ముందు 'బందిపోటు' విడుదలైంది. ఆ సినిమాతో మహారథి ప్రతిభ ఏమిటో సినీ ప్రపంచానికి అవగతమైంది.
హీరో మారువేషంలో విలన్‌ని ఆటపట్టించడం అనేది ఓ ఫార్ములా అయి కూర్చుంది. ఇదే ఫార్ములాతో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. 'బందిపోటు' తర్వాత కంచుకోట, రణభేరి, పెత్తందార్లు, దేశోద్ధారకులు, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మను షులు, సింహాసనం ఇత్యాది చిత్రాలకు రచన చేశారు. 'అల్లూరి సీతారామరాజు' కోసం అయితే ఆరు నెలలు పరిశోధన చేశారు. ఒంటిపూట భోజనం... చింతపల్లి అడవుల్లో చలిలో చన్నీటి స్నానం... అడవిలో చెట్టుకింద ధ్యానం చేస్తూ స్క్రిప్టు రాశారాయన. కృష్ణతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయనతో కలిసి ఎక్కువ సినిమాలకు పనిచేశారు.
రాజకీయ పార్టీ స్థాపన
సమాజాభ్యున్నతికి రాజకీయాలే పరమావధిగా భావించి 1978లో జనతా పార్టీ తరఫున బోధన్‌లో పోటీ చేసి, ఇందిరాగాంధీ ప్రభంజనంలో ఓటమి చవిచూశారు. 2005లో 'త్రి లింగ ప్రజా సమితి' పార్టీ నెలకొల్పారు. రాజకీయాలపై ఆయనకు విపరీతమైన అవగాహన ఉంది. 2009 ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణకు ఆయనే రాజకీయ ప్రసంగాలు రాసిచ్చారు.
దర్శక, నిర్మాతగా....
'మంచిని పెంచాలి' చిత్రంతో మహారథి దర్శకునిగా కొత్త అవతారం ఎత్తారు. అయితే ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో మరోసారి దర్శకత్వం జోలికి వెళ్లలేదు. అయితే ఒక దశలో ఎన్టీఆర్‌తో తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ముచ్చటపడ్డారు కానీ కుదర్లేదు. సంయుక్త భాగస్వామ్యంలో 'దేశమంటే మనుషులోయ్' చిత్రాన్ని సీఎస్‌రావు దర్శకత్వంలో నిర్మించారు. దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు లభించింది. తర్వాత భోగిమంటలు, రైతుభారతం సినిమాలు తీశారు. 'రైతుభారతం'తో సౌందర్యను కథానాయికగా తెలుగు తెరమీదకి తీసుకొచ్చింది ఆయనే.
ఆఖరు రోజుల్లో బ్రహ్మాండమైన కథ
మహారథి చివరి క్షణం వరకూ సినిమా రచనలోనే తలమునకలయ్యారు. ఓ బ్రహ్మాండమైన కథ తయారవుతోందని సన్నిహితులకు చెప్పేవారు. ఈ కథ తయారీ కోసమే విశాఖపట్నం వెళ్లి రోజుల తరబడి అక్కడి గెస్ట్‌హౌస్‌లో గడుపుతుండేవారు. ''ఈ కథ చిరంజీవికైతే చాలా బావుంటుంది. ఆయనకు వ్యక్తిపరంగానూ, వృత్తిగతంగానూ, రాజకీయ పరంగానూ ఓ సరికొత్త ఇమేజ్‌ను సృష్టిస్తుంది'' అని కొంతమంది సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారు. తన తనయుడే నిర్మాతగా ఈ కథను తెరకెక్కించాలని ఆయన ఆశపడ్డారు. ఈ కథతో పాటు మహారథి దగ్గర మరో నాలుగైదు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. 'వేదవతి' పేరుతో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
ఇంగ్లీషులోనే స్క్రిప్టులు
ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించాలి. ఆయన ఏ స్క్రిప్ట్ రాసినా ఇంగ్లీషులోనే ఉంటుంది. చాలా చక్కటి ఇంగ్లీషు ఆయనది. ఆ భాషపై ఆయనకున్న పట్టు ఇంగ్లీషు ప్రొఫెసర్లకు కూడా ఉండదేమో. మహారథి పుస్తకప్రియుడు. ఆయన ఇంటినిండా బోలెడన్ని పుస్తకాలు. సినిమాలు కూడా బాగానే చూస్తారు. వాటికి సంబంధించి తనదైన శైలిలో విశ్లేషణ కూడా చేసేవారు.
స్క్రీన్‌ప్లే మాస్టర్
స్క్రీన్‌ప్లే మీద ఆయనకు ఉన్న పట్టు ఇంకెవ్వరికీ ఉండదనేది పరిశ్రమలో ప్రతీతి. అనేక భాషా చిత్రాలను పరిశీలించి, పరిశోధించి స్క్రీన్‌ప్లే రహస్యాలను తెలుసుకోగలిగారు. ఈ స్క్రీన్‌ప్లే రహస్యాలను ఎవరికైనా బోధించి తనకంటూ ఓ శిష్యుణ్ణి తయారు చేసుకోవాలని ఆయన చివరిదశలో ఆశపడ్డారు. అలాగే నవతరం రచయితలను తయారు చేయడం కోసం ఓ శిక్షణా శిబిరం నిర్వహించాలని గత కొన్నాళ్లుగా పథక రచన చేస్తున్నారు.
ఆత్మకథ రాయాలనుకున్నారు
ఎంత వయసు మీద పడ్డా ఆయనలో విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనే ఉండేదికాదు. హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో గల తన ఇంట్లోని ముందు గదిలో ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుకుంటూనో, రాసుకుంటూనో కనిపించేవారు. తన జీవితంలోని ఎత్తుపల్లాల్ని ఆవిష్కరిస్తూ ఆత్మకథ రాసుకోవాలని గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రచయితగా మహారథి ప్రత్యేకత ఏమిటంటే - ఆయన కలానికి రెండు వైపులా పదునే. సాఘికం... చారిత్రకం... పౌరాణికం... జానపదం... ఇలా ఏదైనా రాసి 'శెభాష్' అన్పించుకుంటారు.
డబ్బింగ్ స్పెషలిస్ట్
మహారథి డబ్బింగ్ రైటరే కాదు. డబ్బింగ్ ఆరిస్టు కూడా. శివాజీగణేశన్ రెండు సినిమాలకు తెలుగులో గాత్రదానం చేశారు. అలాగే చాలామంది నటులకు డబ్బింగ్ చెప్పారు. 'సమాజం'(1960)లో చిన్న పాత్రలో కనిపించిన ఓ బక్కపలుచటి కుర్రానిలోని ప్రతిభను గమనించి ''ఎప్పటికైనా నువ్వు పరిశ్రమను ఏలుతావ్'' అని వెన్నుతట్టి ప్రోత్సహిం చారు. ఆ కుర్రాడే టాప్ కమెడియన్‌గా వెలిగిన రాజబాబు.
మహారథికి ఇష్టమైన కథానాయికలు సావిత్రి, సౌందర్య. సావిత్రి తన కష్టాలన్నీ మహారథి ఇంటికొచ్చి చెప్పుకునేవారు. రచయితగా మహారథి ఎంత హుందాగా, నిక్కచ్చిగా ఉండేవారో, అంతే పొగరుగా కూడా ఉండేవారు. స్క్రిప్టులో ఒక్క అక్షరం మార్చినా ఊరుకునేవారు కాదు. దర్శకుని చేతి పాళీలాగా రచయిత మారకూడదని, రచయిత కూడా దర్శకునితో సమానమైన హోదాలో ఉండాలని ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే ఆయన చివరి శ్వాస వరకు కలంతో శాసించిన రచయితగా ముద్ర వేసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి