వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ పర్యటనకు వెసులుబాటు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్‌తో లోలోపల కలిసి పనిచేయడానికే తెరాస నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారనే ఆరోపణతో గతంలో జగన్‌ను వరంగల్లు జిల్లా మహబూబాబాద్ పర్యటనకు రాకుండా అడ్డుకున్నారు. కానీ, ఈసారి ఆయనను అడ్డుకోకూడదనే ఉద్దేశంతో తెరాస నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుని, జగన్‌ను అడ్డుకోకపోతే విమర్శలకు గురి కావాల్సి వస్తుందని అనుకుని చంద్రబాబు తెలంగాణ పర్యటనకు తెరాస అడ్డు చెప్పడం లేదని అంటున్నారు.
చంద్రబాబు పర్యటనకు వెసులుబాటు కల్పించడానికి, రేపు జగన్ పర్యటనను అడ్డుకోకుండా ఉండడానికి తగిన ప్రాతిపదికను తెరాస ఏర్పాటు చేసుకుంది. తమది ప్రజాస్వామ్య వ్యవస్థ అని, ప్రతి పార్టీకి తమ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ఉంటుందని, తాము ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్సించదలుచుకున్నామని తెరాస నాయకులు అంటున్నారు. అందువల్లనే చంద్రబాబు పర్యటనలను అడ్డుకోవాలని తాము పిలుపు ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు.
వచ్చే ఎన్నికలనాటికి తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత సన్నిహితమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకోకూడదని తెరాస నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ జననరి మొదటివారంలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. తన ఓదార్పు యాత్రల సందర్భంగా జగన్ తెలంగాణ ప్రజల మనసును దోచుకోవడానికి అవసరమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాను గౌరవిస్తానని జగన్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం మనవడు సోనేరావు కూడా ఆ పార్టీలో చేరారు. ఇప్పటికే కొమ్మూరి ప్రతాప రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, కొండా సురేఖ వంటి బలమైన నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. పార్టీ బలోపేతానికి వీరు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
21, డిసెంబర్ 2011, బుధవారం
జగన్ కోసమే బాబుకు కెసిఆర్ వెసులుబాటు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి