అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అదనపు డైరెక్టర్ జనరల్ భూపతిబాబు సోమవారం సాయంత్రం ముఖమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. మద్యం వ్యాపారులపై ఇటీవల జరిపిన ఆకస్మిక దాడులలో బయటపడిన ఆధారాల ప్రాతిపదికగా తయారు చేసిన ఒక కీలకమైన నివేదికను ఆయన ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలుస్తున్నది. ఈ నివేదికలో ఏముందనేది తీవ్రమైన ఉత్కంఠ కలిగిస్తున్నది. అక్రమ మద్యం అమ్మకాలు పెద్ద కుంభకోణంగా మారినట్టు ఈ దాడులలో బయటపడిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర లిక్కర్ కుంభకోణం జరిగినట్టు ఎసిబి దాడులలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కొందరు పాత్రికేయులకు సైతం అక్రమ మద్యం విక్రయాల కుంభకోణంలో మామూళ్లు కోట్లలో ముట్టినట్టు ఎసిబికి గట్టి ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఈ వివరాలనే భూపతిబాబు నేటి సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్టు తెలుస్త్తోంది. అంతకు ముందు - రాష్ట్రంలోని లిక్కర్ సిండికేట్స్‌పై తాము జరిపిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఉన్నతాధికారులు సోమవారం సమీక్షించారు. ఎసిబి అదనపు డైరెక్టర్ జనరల్ భూపతిబాబు అధ్యక్షతన అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు సమావేశమై సోదాలపై సమీక్ష నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై లిక్కర్ సిండికేట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఆయన హవా సాగుతోందని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోదాల వివరాలను వెల్లడించాలని బొత్స సత్యనారాయణ ఎసిబికి సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి