17, డిసెంబర్ 2011, శనివారం

రాందేవ్ బాబా అరెస్టు ముందుస్తు ప్రణాలికేనా?

నల్లధనంపై సమరశంఖం పూరించిన బాబా రాందేవ్‌ను నాడు కావాలనే అరెస్ట్‌ చేశారా? ప్లాన్‌ ప్రకారమే దీక్ష భగ్నం చేసి ఢిల్లీ నుంచి పంపేశారా? అర్ధరాత్రి అమానుషకాండను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. హజారేనూ అరెస్ట్‌ చేయాలని ముందస్తు ప్రణాళిక వేసుకున్నా అమల్లో సాధ్యం కాలేదన్న విషయమూ మరోసారి రుజువైంది. బ్లాక్‌మనీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. జూన్‌లో బాబా రాందేవ్‌ దీక్ష బూనారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆయన సమరోత్సాహంతో నిరసనకు దిగారు. ప్రభుత్వంపై దీక్షాస్త్రాన్ని సంధించకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా ఏర్‌పోర్ట్‌లోనే మంత్రుల బృందం బాబాతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. రాయభారం సక్సెస్ కాకుంటే రాందేవ్‌ను అరెస్ట్‌ చేయాలని స్కెచ్చేశారు.

 

ముందస్తు ప్రణాళికతోనే అర్ధరాత్రి దాటాక టియర్‌గ్యాస్‌ ప్రయోగించి.. లాఠీఛార్జ్‌ చేసి.. బాబాను అరెస్ట్‌చేశారని సుప్రీంకోర్ట్ నియమించుకున్న సహాయకుడు రాజీవ్‌ ధావన్‌ సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశారు. రాజకీయ పెద్దలను సంతృప్తి పరిచేందుకే పోలీసులు అలా వ్యవహరించారన్నది అమికస్‌ క్యూరీ అభిప్రాయం. అందుకు తగ్గ ఆధారాన్నీ ఆయన కోర్టుముందుంచారు. హోంమంత్రి చిదంబరం ఇచ్చిన ఇంటర్వ్యూని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యమించాలనే రాందేవ్‌ భావిస్తే.. ఆయన్ను ఢిల్లీనుంచి సాగనంపాలనే నిర్ణయం తీసుకున్నామని చిదంబరం స్పష్టంచేశారు.

 

దాన్ని బట్టే ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలిసిపోతుందని సుప్రీం బెంచ్‌ దృష్టికి తెలిపారు. అప్పటి పరిస్థితుల్ని అనుసరించే పోలీస్ యాక్షన్‌ తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. అన్నా హజారే విషయంలోనూ అలాంటి ప్రణాళికే రచించినా.. అమలు వీలుపడలేదని చెప్పారు. అర్ధరాత్రి పోలీస్‌ యాక్షన్‌ తీసుకోవడాన్ని సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీం విచారణను వేగవంతం చేస్తోంది. ఈ ఉదంతంతో ఇప్పటికే 2G స్కాంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చిదంబరంపై విపక్షాల దాడి మరింత ఉద్ధృతం కానుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి