17, డిసెంబర్ 2011, శనివారం

లక్ష్మీపార్వతి హెచ్చరిక

తనని ఇంటి నుంచి వెళ్లగొట్టింది గాక, ఇప్పుడు తన ఆశ్రమాన్ని (తోట) కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై వచ్చిన కథనాన్ని ఖండించారు. ఆంధ్రజ్యోతి కథనం కుట్రపూరితమైనదన్నారు. గండిపేట దుస్థితితో తనకు సంబంధంలేదని చెప్పారు. ఆ దుర్మార్గుడు చేసే చర్యలకు మద్దతు పలుకవద్దని ఆమె ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణని కోరారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పటికే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని వారు భూస్థాపితం చేశారని ఆమె బాధపడ్డారు. తన తోటపై చంద్రబాబు కన్నుపడిందని, దానికి అనుగుణంగానే అంధ్రజ్యోతి కథనాలని ఆమె చెప్పారు. చంద్రబాబుతో సహా ఎవరైనా తన తోటజోలికి వస్తే ఖబడ్దార్ అని ఆమె హెచ్చరించారు. 

ఒంటరిగా ఉన్న మహిళపట్ల ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయం అన్నారు. మహిళలకు ఏం చేయదలచుకున్నారో చెప్పాలని ఆమె నిలదీశారు. చంద్రబాబుపై కేసు ఉపసంహరించుకుంటే తన ఇల్లు తనకు వదులుతానని బేరం పెట్టారని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు సొంత ఊరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణని ఆయన ఎందుకుఅడ్డుకుంటున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి