5, డిసెంబర్ 2011, సోమవారం

అసెంబ్లీలో విజయమ్మ

మహానేత తెచ్చిన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం బాధాకరమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు దురదృష్టకరమైన రోజు అని అవిశ్వాస తీర్మాన చర్చలో మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ విజయమ్మ తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. లక్షలాది ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్‌ను అందిస్తామని మహానేత వైఎస్‌ఆర్ ప్రజలకు వాగ్దానం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం మహానేత వాగ్ధానాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్ అంటే కాంగ్రెస్ అనే స్థితికి పార్టీని తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు బహుమతి ఏమిచ్చిందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరును సీబీఐ రిపోర్ట్‌లో పెట్టి ఆయనకు బహుమానంగా ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని విజయమ్మ అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. 108, 104, ఇందిరమ్మ ఇళ్లు పథకాల్ని సరిగా అమలు చేయలేకపోవడాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ కలువకముందే చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం ఏనాడో పడిపోయి ఉండేదని విజయమ్మ అన్నారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏనాడు సోనియాగాంధీని ముఖ్యమంత్రి పదవి అడుగలేదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఓదార్పుయాత్రకు అనుమతిని మాత్రమే జగన్ కోరాడని విజయమ్మతెలిపారు. జగన్‌పై బొత్సచేసిన అనుచిత వ్యాఖ్యలకు విజయమ్మ ధీటైన సమాధానం చెప్పారు. జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని బొత్స ఉపసంహరించుకోవాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి