9, డిసెంబర్ 2011, శుక్రవారం

కోల్‌కతా కార్పొరేట్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం

మృతుల్లో అత్యధికులు వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతూ.. కదలలేక మంచాల మీద ఉన్న రోగులే కావటం విషాదకరం.

90 మంది మృతి
దట్టమైన పొగవల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన రోగులు
బేస్‌మెంట్‌లో చెలరేగిన మంటలు..
ఏడంతస్తుల్లో ఏసీ గదులకు పాకిన పొగ
సహాయచర్యల్లో ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం..
{
పమాదం వెంటనే ఆస్పత్రి సిబ్బంది పరారీ..
గంట తర్వాత పోలీసులకు సమాచారం
ఆస్పత్రిలో అగ్నిమాపక చర్యలు శూన్యం..
మృతుల్లో అత్యధికులు ఐసీయూ, సీసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులే
94
మంది రోగులను రక్షించిన అగ్నిమాపక శాఖ.. వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స
{
పమాద స్థలిని సందర్శించిన బెంగాల్ సీఎం మమతా
ఆస్పత్రి లెసైన్సు రద్దు: మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగన ఘోర అగ్ని ప్రమాదం 90 మంది ప్రాణాలను బలితీసుకుంది. వీరంతా మంటల బారిన పడకున్నా.. వాటివల్ల వెల్లువెత్తిన దట్టమైన పొగ, విషయవాయువుల వల్ల ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో అత్యధికులు వివిధ అనారోగ్యాలతో చికిత్స పొందుతూ.. కదలలేక మంచాల మీద ఉన్న రోగులే కావటం విషాదకరం. దక్షిణ కోల్‌కతాలోని ధాకూరియా ప్రాంతంలో గల ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఈ దారుణం సంభవించింది. ఏడంతస్తుల సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రి భవనంలో మొత్తం 190 పడకలు ఉన్నాయి.

ఆస్పత్రి బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వాటిని చూసి ఆర్పటానికి తాము పరుగున వెళ్లగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది తమను లోపలికి అనుమతించకుండా గెంటివేశారని స్థానికులు కొందరు ఆరోపించారు. బేస్‌మెంట్‌లో త్వరగా మంటలకు ఆహుతయ్యే స్వభావం గల పదార్థాలు ఎక్కువగా నిల్వచేసి ఉండటంతో.. అక్కడ మంటలు వేగంగా రాజుకుని పై అంతస్తులకు పాకాయి. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ భవనం కావటంతో.. ఏసీ పరికరాల ద్వారా పొగ వేగంగా అన్ని అంతస్తులకూ, గదులకూ విస్తరించింది. ఆక్సిజన్ సిలిండర్లను సకాలంలో ఆస్పత్రి ప్రాంగణం నుంచి తొలగించటం వల్ల మరింత భారీ ప్రమాదాన్ని నివారించినట్లయిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్‌హకీమ్ చెప్పారు.

పమాద వార్తను సమీపంలోని లేక్ పోలీస్ స్టేషన్‌కు 4:10 గంటలకు అందించారని.. పది నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. అప్పటికే దట్టమైన పొగ ఆస్పత్రి భవనాన్ని పూర్తిగా ఆక్రమించగా.. అత్యంత ప్రమాదకరమైన విషవాయువుల కారణంగా ఎక్కువ మంది రోగులు శ్వాస అందక చనిపోయారని మంత్రి వివరించారు. అయితే బాధితుల బంధువులు మాత్రం సహాయక చర్యల్లో తీవ్రజాప్యం జరిగిందని, ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారని ఆరోపించారు. ఆస్పత్రిలో తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, పరికరాలు లేకపోవటం కూడా తక్షణ సహాయ చర్యలు ప్రారంభించలేకపోయినట్లు సమాచారం.

దాదాపు 250 మంది అగ్నిమాపక సిబ్బంది, 25 అగ్నిమాపక శకటాలతో సహాయ చర్యలు ప్రారంభించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల వంటి వాటిద్వారా ఆస్పత్రి పై అంతస్తుల కిటికీ అద్దాలు పగుల కొట్టి అక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో మంచాల మీద కదలలేని స్థితిలో ఉన్న రోగులను నిచ్చెనల ద్వారా కిందకు తేలేకపోవటంతో పుల్లీల ద్వారా కొందరు రోగులను రక్షించారు. క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ యూనిట్లలోని రోగులు కదల లేని పరిస్థితుల్లో ఉండటం వల్ల.. ప్రమాదంలో వారు చనిపోయారని అగ్నిమాపక శాఖ అదనపు డీజీ డి.బిస్వాస్ తెలిపారు.

ఐసీయూ, ఐసీసీయూ, ఇంటెన్సివ్ థెరపీ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న రోగులు అత్యధికంగా ఈ ప్రమాదంలో మరణించారు. మరణించిన 90 మందిలో నలుగురు ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారని కోల్‌కతా పోలీసు కమిషనర్ తెలిపారు. మృతుల్లో ఒక బంగ్లాదేశ్ జాతీయుడు, ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ మాజీ సభ్యుడు అజయ్‌ఘోషల్, ష్యాంపూర్ (హౌరా) మాజీ ఎమ్మెల్యే సిసిర్‌సేన్‌లు కూడా ఉన్నారు. ఆస్పత్రి నుంచి రక్షించిన దాదాపు 94 మంది రోగులను ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి ప్రధాన భవనంలోకి, సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సందర్శించిన మమతాబెనర్జీ: ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం పూర్వాపరాలపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తునకు ఆదేశించారు. ఆస్పత్రి లెసైన్సును రద్దుచేసి, సీల్ చేయనున్నట్లు ప్రకటించారు. నిర్లక్ష్యపూరిత వైఖరితో 90 మంది మృతికి కారణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంపై బెయిల్‌కు అవకాశం లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఆస్పత్రి యాజమాన్య బోర్డులో సభ్యులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆర్.ఎస్.గోయెంకా, ఎస్.కె.టోడిలు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారని సీఎం మీడియాకు తెలిపారు.

ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి బేస్‌మెంట్ ప్రమాదకరంగా ఉందని అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆస్పత్రి యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారని.. కానీ వారు ఎలాంటి జాగ్రత్తలూ చేపట్టలేదని మమత వెల్లడించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సీఎంను చుట్టుముట్టేందుకు మృతుల, బాధితుల బంధువులు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీలతో వారిని చెదరగొట్టారు. మమతాబెనర్జీ పోలీసులను వారించి వారితో మాట్లాడారు. ఈ ప్రమాదంలో ఆంకాలజీ విభాగం నుంచి అణుధార్మికత లీక్ అయిందా అన్నది గుర్తించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ దళానికి చెందిన నిపుణుల బృందం పరిశీలించిందని మమత తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆస్పత్రి యాజమాన్యం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామంది. గాయపడిన వారికి, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో ఉన్న రోగులకు పూర్తిగా కోలుకునే వరకూ ఉచిత చికిత్స అందిస్తామని పేర్కొంది.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కోల్‌కతా ఆస్పత్రి ప్రమాదంలో 90 మంది మృతి చెందటం పట్ల రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి