10, డిసెంబర్ 2011, శనివారం

సాక్షాత్తూ అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబద్ధాలు ఆడుతోంది:జగన్

 ''మరో నాలుగు నెలలు గడిస్తే ఈ విద్యా సంవత్సరం అయిపోతోంది.. ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పూర్తయిపోయింది.. మళ్లా రెండో సెమిస్టర్‌లోకి అడుగుపెడుతున్నప్పటికీ.. వారికి కాలేజీ ఫీజులు కట్టాలన్న కనీస ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు'' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటును నమ్ముకుని చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తూ అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబద్ధాలు ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించి సొమ్ములు చెల్లించాం అని చెప్పి నిర్మొహమాటంగా అబద్ధాలు చెప్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తున్నపుడు గుండెలు తరుక్కుపోయేంత బాధనిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఈ విద్యాసంవత్సరం కూడా అయిపోతోంది. విద్యార్థులు ఒక సెమిస్టర్‌ను పూర్తిచేసుకొని మరో సెమిస్టర్‌లోకి అడుగుపెడతారు. ఇవాళ 2011-12 సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేని అధ్వానమైన పరిస్థితిలో, విద్యార్థుల భవిష్యత్తు పట్టని ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాధనిపిస్తోంది. అధ్వాన పాలకుల చేతిలో రాష్ట్రం ఉంది..
ఏదైనా ఒక గ్రామంలో రచ్చబండ వద్ద నిలబడి అర్హులై ఉండి పెన్షన్, ఇళ్లు, బియ్యం కార్డు లేనివారు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని వైఎస్సార్ అనుకున్నారు. అంతలా పేదలకు ప్రభుత్వ పథకాలు అందాలన్న కోరికతో రచ్చబండ పథకాన్ని తెచ్చారు. దేశం మొత్తం మీద పేదలకు 48 లక్షల ఇళ్లిస్తే దివంగత నేత పట్టుబట్టి ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఇవాళ అధ్వాన పాలకుల చేతిలో నా రాష్ట్రం ఉంది. రచ్చబండ పథక ఉద్దేశాన్నే నీరుగారుస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికీ రెండు వేల ఇళ్లు ఇస్తారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే ఇళ్లు కట్టిస్తారట.. మిగిలిన వారిని గాలికి పోండని చెప్తున్నారట.

క్రాప్ హాలిడే ప్రకటించి ఏడాది..
ఇవాళ రాష్ట్రంలోనే కాదు గదా.. దేశ చరిత్రలోనే ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి సమ్మె చేయబట్టి సరిగ్గా ఏడాది గడచి పోయింది. నిరుడు ఖరీఫ్ నుంచి రైతులు సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికిగాని.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా పట్టడం లేదంటే బాధనిపిస్తోంది. మరోవైపు రోజు రోజుకూ ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. గతంలో రూ.500 ఉన్న డీఏపీ ఇవాళ రూ.వెయ్యికి పెరిగింది. రెండు బస్తాల వడ్లు అమ్మినా కూడా ఒక డీఏపీ బస్తా రాని అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. పండిన పంట కోయాలంటే రైతు భయపడుతున్నాడు. 

మరోవైపు పంట కోయడానికెళ్లే రైతు కూలీకి రోజుకు రూ.వంద కూడా గిట్టని పరిస్థితి. పోనీ కూలీ రేట్లు పెంచమని రైతుల వైపు చూద్దామా? అంటే రైతన్న పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాల్వల్లో నీళ్లు ఉంటాయి. పొలానికి మాత్రం నీళ్లివ్వని అన్యాయమైన పరిస్థితులున్నాయి అని జగన్ ఓదార్పు యాత్రలో లో బాగంగా గుంటూరు జిల్లాలో ప్రసంగించారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి