10, డిసెంబర్ 2011, శనివారం

హేమమాలినికి ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’

'డ్రీమ్‌గాళ్' హేమమాలినిని ప్రతిష్టాత్మక ఏయన్నార్ జాతీయ అవార్డు వరించింది. 2011 సంవత్సరానికి సంబంధించి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆమెను ఈ పురస్కరానికి ఎంపిక చేసింది. ఐదు లక్షల నగదుతో పాటు పురస్కారాన్ని ఆమెకు అందజేస్తారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే ఓ భారీ వేడుకలో ఈ పురస్కారాన్ని ఆమె అందుకుంటారు. 

ప్రసిద్ధ నటులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డా.అక్కినేని నాగేశ్వరరావు 2005లో తన పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. తొలుత దేవానంద్ ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత షబనా ఆజ్మీ, అంజలీదేవి, వైజయంతిమాల బాలి, లతా మంగేష్కర్, కె.బాలచందర్ వంటి లబ్ద ప్రతిష్ఠులు ఈ పురస్కారాన్ని ఇప్పటివరకూ స్వీకరించారు. తాజాగా ఈ అవార్డుకు హేమమాలినిని ఎంపిక చేసినట్లు శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -''ఏయన్నార్ ఏ కార్యం తలపెట్టినా అందులో ఓ అర్థం, పరమార్థం ఉంటాయి. ఈ ఉన్నత పురస్కారాలు కూడా అదే విధంగా ఉంటూ వచ్చాయి'' అని చెప్పారు. ఏయన్నార్ మాట్లాడుతూ -''1991లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకుంటున్న సమయంలో నా పేరుతో అదే స్థాయిలో ఓ అవార్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. 2005 నుంచి ఈ అవార్డులు బహూకరిస్తున్నాం. 

నటి, దర్శకురాలు, నృత్య కళాకారిణి అయిన హేమమాలినికి ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేయడం బహు ప్రశంసనీయం. కేంద్రమంత్రి దినేష్ త్రివేది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తాం. నా తదనంతరం కూడా మా కుటుంబసభ్యులు ఈ పురస్కారాన్ని కొనసాగిస్తారు'' అని తెలిపారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి