6, డిసెంబర్ 2011, మంగళవారం

'నెట్‌లో దూషణలను అరికడతాం'

ఇంటర్నెట్‌లో దూషణలను అరికడతామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో వచ్చే సమాచారాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో మంగళవారం ఆయన హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అభ్యంతరకర సమాచారాన్ని అరికట్టాలంటూ ఆయన ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కోరడంపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. అయితే, పత్రికా స్వేచ్ఛలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని సిబల్ మీడియాకు స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో దూషణలను, విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని, అసభ్యకరమైన అంశాలను కట్టడి చేయడంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు సహకరించకుంటే, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని, అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లను కించపరచేలా ఇటీవల పలు వ్యాఖ్యలు, చిత్రాలు ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారం పొందాయి.

వ్యక్తులను, మత విశ్వాసాలను కించపరచే సమాచారాన్ని అరికట్టాల్సిందిగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు ప్రభుత్వం ఇదివరకే సూచించినా, అవి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొద్ది వారాలుగా ప్రభుత్వం గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ తదితర వెబ్‌సైట్ల ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు సాగించింది. వీటిపై సెన్సార్ విధించాలని ప్రభుత్వం భావించడం లేదని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీడియా స్వేచ్ఛలో జోక్యం కల్పించుకోవాలనుకోవడం లేదని సిబల్ చెప్పారు. అయితే, అభ్యంతరకరమైన అంశాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కోరినట్లు తెలిపారు. ఫేస్‌బుక్, గూగుల్ ఇప్పటికే ఈ అంశంపై సానుకూలంగా స్పందించాయి. అభ్యంతరకర సమాచారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ అంశంలో ప్రభుత్వానికి సహకరిస్తామని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్థానిక చట్టాలను పాటిస్తామని, చట్టాలను ఉల్లంఘించే సమాచారాన్ని తొలగిస్తామని గూగుల్ తెలిపింది. అయితే, కేవలం వివాదాస్పదంగా మారిన కారణంగా ఎలాంటి సమాచారాన్నీ తొలగించబోమని గూగుల్ స్పష్టం చేసింది. తమ విధానాలకు లోబడే చేస్తామని తెలిపింది.

థరూర్, దిగ్విజయ్ మద్దతు

ఇంటర్నెట్‌లో జోక్యం చేసుకుని, భావప్రకటనా స్వేచ్ఛను అరికట్టే చైనా వంటి దేశాల సరసన భారత్ చేరరాదంటూ పలువురు విమర్శలు గుప్పించినా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, ఎంపీ శశి థరూర్ మాత్రం ఈ అంశంలో సిబల్‌కు మద్దతుగా నిలిచారు. ఇంటర్నెట్‌లో మతవిశ్వాసాలను కించపరచే వ్యాఖ్యలు హింసాత్మక సంఘటనలకు దారితీసే అవకాశాలు ఉన్నందున తాను సిబల్ వ్యాఖ్యలను సమర్థిస్తానని థరూర్ ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరులను దూషించడం కాదని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తనను కించపరచేలా ఇంటర్నెట్‌లో వ్యాఖ్యలు పోస్ట్‌చేసిన 22 మందిపై దిగ్విజయ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఇలాంటి నేరాలకు ఢిల్లీ ఐటీ చట్టం కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దిగ్విజయ్ తరఫు న్యాయవాది రోహిత్ కొచర్ చెప్పారు. అయితే, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఆర్‌ఎల్‌డీ ఎంపీ జయంత్ చౌదరి ఈ వాదనతో విభేదించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి