- రైతాంగ సమస్యలే అసలు కారణమా?
- జగన్‌కు అనూహ్య మద్దతే!
- పీఆర్‌పీ, ఎంఐఎమ్‌లకూ లబ్ధి
- అధికార, ప్రతిపక్షాల పరస్పర బురద జల్లుడు
- రైతులకు దక్కినదేమిటి?
- ముందుకు వచ్చిన ఉప ఎన్నికల సమస్య?
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన ఘట్టం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి తుస్సుమన్నది. ఊహించినట్టుగానే అవిశ్వాస తీర్మానం వీగిపోయి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విజయ దరహాసం చేశారు. అలాగే రాజకీయాలలో రెబెల్‌స్టార్‌గా ముద్రపడ్డ జగన్మోహనరెడ్డి కూడా తన సత్తా ఏమిటో చూపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతినిధులు కూడా సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించడానికి బదులు తెలంగాణ డిమాండ్‌ను తీర్చనందుకు నిరసనగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఈ ఘట్టానికి తమదైన టచ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన ఘట్టానికి సూత్రధారి అయిన తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఒరిగింది ఏమిటన్న ప్రశ్న తల ఎత్తడం సహజమే.
అసలు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో హఠాత్తుగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం కేవలం రైతాంగ సమస్యలేనా? మరింకేమైనా ఉన్నదా? అంటే ఒకటి రెండు అంశాలు కనిపించకపోవు. అక్రమ మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దనరెడ్డిపైనా, జగన్మోహనరెడ్డిపైనా సిబిఐ దర్యాప్తు నడుస్తున్న నేపథ్యంలో ఎడాపెడా నీతి శతకాలు వల్లిస్తూ వచ్చిన తెలుగుదేశం వారికి షాకిస్తూ చంద్రబాబు, మరో 13 మందిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు అనుమతించి సిబిఐ విచారణకు ఆదేశించడం, వారిలో కొందరు సుప్రీం కోర్టుకు వెళ్ళినా అక్కడి న్యాయమూర్తులు తిరిగి హైకోర్టును ఆశ్రయించమని ఆదేశించడం వరుసగా జరిగిపోయాయి. నీతి, అవినీతులపై పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పడని పరిణామం.
చంద్రుడికి మచ్చలున్నాయనే విషయాన్ని వారు అంగీకరించలేకపోయారు. న్యాయస్థానాలూ అనుకూలంగా తీర్పు ఇచ్చే పరిస్థితులు కనుపించలేదు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి వారికి ఒక బలమైన అంశం అవసరం. అందుకే అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది.దీనితో పాటుగా జగన్మోహన్‌రెడ్డి సత్తా కూడా తేల్చిపారేయాలని తెలుగుదేశం సరదాపడిపోయింది. జగన్మోహనరెడ్డికి అతడి తల్లి మినహా మరెవరూ మద్దతు ఇవ్వరని నిరూపించాలని తాపత్రయపడింది. అయితే అనూహ్యంగా 17మంది ఎమ్మెల్యేలు బాహాటంగా జగన్‌కు మద్దతుగా నిలబడి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం తెలుగుదేశం పార్టీకి అనుకోని దెబ్బ. దీనితో తెలుగుదేశం పార్టీకి ఏ ఆశా తీరకుండా పోయింది. ఈ అవిశ్వాస తీర్మానంలో లబ్ధి పొందిన పార్టీలు మూడు- వైఎస్‌ఆర్ పార్టీ, పిఆర్‌పి, ఎంఐఎం.
తమ తమ అస్తిత్వాలను, ప్రాధాన్యతలను నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ పార్టీలకు మంచి అవకాశాన్నిచ్చింది. వారు కీలక సమయంలో పట్టుబట్టి కూచోవడంతో కాంగ్రెస్ పార్టీ వారిని తమ కు అనుకూలంగా మలచుకోవడానికి నానా తిప్పలూ పడింది. ఎంఐఎంను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ఏకంగా హైదరబాద్ మేయర్ పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. వాస్తవంగా ఈ ఘట్టంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ నష్టపోగా, మిగిలిన చిన్న పొన్నా పార్టీలు లాభపడ్డాయి. తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే తనే అని, తాను ఓటు వేసినా ఒరిగేది ఏమీ ఉండదనే ప్రకటనతో లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్ తటస్థంగా ఉండేందుకు నిర్ణయించుకుని తనకు ఇద్దరి విధానాలు సమ్మతం కాదనే సందేశం పంపే ప్రయత్నం చేశారు.
మొత్తం మీద సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్థరాత్రి ఒకటిమ్ముప్పావు దాకా సాగిన అవిశ్వాస తీర్మానం చర్చలో ఊహించినట్టుగానే రసవత్తర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులిద్దరూ ఒకరిపై ఒకరు బురద జల్లుకొని, అవమానపరచుకున్నారు. హైకమాండ్ కాళ్ళు పట్టుకొని అధికారంలోకి వచ్చే ఖర్మ తనకు పట్టలేదని, తాను నేరుగా జనం నుంచి వస్తానని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రానని ముఖ్యమంత్రి కిరణ్ రిటార్టిచ్చారు. ఈ రకమైన బురద జల్లుడు కార్యక్రమం ద్వారా తమ రాజకీయ కక్షను అన్ని పార్టీల నాయకులూ తీర్చేసుకోవడం అవిశ్వాస తీర్మాన ఘట్టంలో ఒక కీలక అంశం.
రైతుల దుస్థితిపై ఆవేదన చెంది అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇంతకీ వారి కోసం సాధించిందేంటి? తమ కు రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉందని అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే సరిపోతుందని తెలుగుదేశం పా ర్టీ భావించిందా? కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఎటూ విధానపరమైన ప్రకటనలు కోరడం లేదు కనుక ఎలాగూ గెలుస్తామనే ధీమాతోనే ఇందుకు సిద్ధపడ్డారా అనే అనుమానాలు రావడంలో ఆశ్చర్యం లేదు. అవిశ్వాస తీర్మానం గెలిచినంత మాత్రాన కిరణ్ ప్రభుత్వం బలంగా ఉందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన 38 ఓట్ల మెజారిటీతో మాత్రమే నెగ్గారు. అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 136 మాత్రమే. ఈ నేపథ్యంలో ఎవరు ఎటు మొగ్గినా ప్రభుత్వానికి సమస్యే. ఎందుకంటే దక్కిన మెజార్టీలో 17 మంది ఎమ్మెల్యేలు చిరంజీవి గ్రూపు చెందిన వారు కావడం కీలకమైన విషయం.
ఈ క్రమంలో చిరం జీవి బలం రెండింతలు పెరిగినట్టే. ఆయన చక్రం తిప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ, ఎంఐఎంలో కానీ ఎవరు వ్యతిరేకమైనా కిరణ్ కుర్చీకి ముప్పు వాటిల్లడం ఖాయమే. ఒకరకంగా ఇకపై కిరణ్ సర్కార్ దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షులా గడుస్తుందనే ఆలోచన రావడం సహజమే. అయితే హైకమాండ్ ఆశీస్సులు దండిగా ఉండి ఒక సంవత్సర కాలంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకున్న కిరణ్ మాత్రం తను బేఫికర్ అనే భావన కలిగిం చేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ వర్గం ఇచ్చిన షాక్ అటు ముఖ్యమంత్రికి ఇటు పిసిసి అధ్యక్షుడు బొత్సకీ కూడా కనుపించని కమరు దెబ్బ. దెబ్బ పైకి కనిపించదు కనుక అదేమీ లేదని వారు నాటకమేసినా లోపల బాధ మాత్రం తీవ్రంగానే ఉంటుంది. అవిశ్వాస తీర్మానాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న జగన్ వారికి జన పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఈ పరీక్షలో విజయం సాధిం చేందుకు అధికార, ప్రతిపక్షాలు రెండూ నానా తిప్పలూ పడక తప్పదు.
వాస్తవానికి జగన్ ఓదార్పు యాత్ర కోస్తా ఆంధ్రలో సృష్టిస్తున్న సంచలనం, ముఖ్యంగా తెలుగుదేశానికి పెట్టని కోట అని భావిం చే కృష్ణా జిల్లాలో అతడికి వచ్చిన ఆదరణతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పటి వరకూ రాజకీయమంటే హైదరాబాదులోనే జరుగుతుందని భావించిన ఆ పార్టీ నాయకులు జనం మధ్యకు వెళ్ళక తప్పలేదు. అందుకే రైతు యాత్రల పేరి ట గ్రామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు రైతులు ఎంత కష్టపడుతున్నారనే విషయం తెలిసినట్టుంది. వాస్తవానిి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ప్రారంభమైంది తెలుగుదేశం పాలనా కాలంలోనే. నాటి కరవు పరిస్థితులు, ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను ఆ మార్గం ఎంచుకునేలా చేశాయి. నాడంతా మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే సాఫ్ట్‌వేర్ రంగం మీదే బాబు దృష్టి పెట్టారన్నది నిర్వివాదం.
ఇందుకు తోడుగా ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయన ప్రైవేటీకరణపై మోజు పెం చుకున్నదీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రైతు ప్రాధాన్యతా క్రమంలో చివరికి వెళ్ళిపోయాడు. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాననే భావన కల్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగా రైతులకు ఏమైనా చేస్తారా? లేక సబ్సిడీలు, ఉచితాలు ఉండవనే పాతపాటే అందుకుంటారా అన్నది వేచి చూడవలసిన అంశమే. తిరిగి అధికారంలోకి వచ్చే వరకూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం మరికొంత కాలం పాటు కష్టాలతో కాపురం చేయవలసిందే. రైతుల సమస్యల మీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కడిగిపారేశానని చెప్పుకోవచ్చేమో కానీ నిర్దిష్ఠంగా తమకు సాధించారని వారు అడిగితే మాత్రం ఆయన వద్ద సమాధానం సున్నా.
ఈ నేపథ్యంలో అసలు అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టినట్టు? వైఎస్‌ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అసెంబ్లీలో అన్నట్టుగా తన మీద సిబిఐ దర్యాప్తు ఆదేశించారు కనుకనే చంద్రబాబు దీనిని ప్రవేశపెట్టారా? అంటే దానికి సమాధానం ఆ పార్టీ నాయకులే చెప్పవలసి ఉంటుంది. ఏమైనా అవిశ్వాసం ప్రవేశపెట్టడం వల్ల ఉప ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితులను మాత్రం చంద్రబాబు సృష్టించారు. ఈ ఘట్టాన్ని తనకు అనుకూలంగా మలచుకొని జగన్ పెడుతున్న ఈ పరీక్ష అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్షానికీ కంటకప్రాయమైనదే. ఇప్పుడు ఈ రెండు పార్టీల పరిస్థితీ ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు నయానో భయానో గెలవకపోతే ప్రజలలో మరింత పలచనయ్యే ఆస్కారముంది.
అసెంబ్లీలో ప్రజల మీద ఇరు పక్షాలూ ఒలకబోసిన ప్రేమను ప్రజలు ఎంత మాత్రం నమ్ముతున్నారో ఈ ఎన్నికలే తేల్చనున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో తిరిగి మళ్ళీ జగన్‌దే పై చేయి అయితే 2014 ఎన్నికల కు దానిని ఒక సూచికలా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న పిఆర్‌పి, ఎంఐఎం వంటి పార్టీలు రేపు తమ మార్గాన్ని మళ్లించుకుంటే కాంగ్రెస్‌కూ, తెలుగుదేశానికీ కష్టమే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల రానున్న ఎన్నికల్లో ఓట్లు చీలుతాయనే భయం అవసరం లేదని తెలుగుదేశం భావించి, సంబరపడి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు జగన్ పెట్టిన జన పరీక్షలో అతడే నెగ్గితే మాత్రం 2014లో తెలుగుదేశం మళ్ళీ ఓట్ల చీలికను ఎదుర్కొనవలసి రావచ్చు. అంతిమంగా తెలుగుదేశం పార్టీ తన అవిశ్వాసంతో నిరూపించింది ఇది మాత్రమేలా ఉన్నది.
- డి. అరుణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి