వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ తర్జనభర్జన
హైకమాండ్‌తో మాట్లాడే వరకు నిర్ణయం పెండింగ్‌లో!
అసమ్మతి తెలిపిన పార్టీ ఎమ్మెల్యేలపై ఊగిసలాట
బొత్స, చిరు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం తేనీటి విందు
హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన మరుక్షణమే శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటింపజేస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అనర్హత వేటు వేయిస్తే.. ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని వారు జంకుతున్నారు. నిజానికి అధికార పార్టీ నుంచి ఐదారుగురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయరని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భావించారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే ఐదారుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగటానికి ముందు మంత్రులు వట్టి వసంతకుమార్, డి.శ్రీధర్‌బాబు ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ వారెవరూ ఊహించని రీతిలో అధికార పార్టీ నుంచి 17 మంది (శోభానాగిరెడ్డితో కలిపి) ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయటంతో షాక్‌కు గురయ్యారు. తాము ఆయా ఎమ్మెల్యేలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, చివరకు బెదిరింపులకు దిగినా భయపడకుండా సర్కారుకు వ్యతిరేకంగా ఓటేయటాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి వీరందరిపై అనర్హత వేటు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దల మనసులో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఒకవైపు కరువు నెలకొని ఉంది.. మరోవైపు రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించటం లేదు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం నాన్చుతున్న తీరుతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు వె ళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. పైగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణంతోపాటు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, జోగు రామన్న, గంపా గోవర్ధన్‌ల రాజీనామాల ఆమోదంతో మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ సమయంలో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే.. మొత్తం 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తుంటే అధికార పార్టీకి బలమైన అభ్యర్థులే లేని దుస్థితి నెలకొంది. దీనికితోడు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా మెజారిటీ స్థాయిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లటమంటే ఆత్మహత్యా సదృశ్యమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందువల్లే వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు చేసే విషయంలో ఊగిసలాడుతున్నారు. అయితే ఆయా ఎమ్మెల్యేలను అట్లాగే వదిలేస్తే పార్టీ చులకన అవుతుందన్న భయమూ పట్టుకుంది. అంతేకాకుండా ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలు దీనిని అలుసుగా తీసుకుని చెలరేగే ప్రమాదమూ ఉందనే ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఆయా ఎమ్మెల్యేలపై గంపగుత్తగా కాకుండా దశల వారీగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసి అనర్హులుగా ప్రకటింపజేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశంపైనా కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల్లో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారనే విషయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తొలుత నలుగురైదుగురిపై వేటు వేయించాలని, ఆ తరువాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇచ్చిన రాజీనామాలను ఉపయోగించుకుని మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటింపజేస్తే ఏ విధంగా ఉంటుందని యోచిస్తున్నారు. అట్లాకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామని, అయితే నిర్ణయాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టే విధంగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేద్దామనే ప్రతిపాదనలపైనా కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై తొందరపాటుతో కాకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న భావనకొచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో హైకమాండ్ పెద్దలతో మాట్లాడి వారి సూచన మేరకు నడుచుకోవాలని, అప్పటిదాకా ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.
మంత్రులతో సీఎం భేటీ...
మరోవైపు అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం గట్టెక్కిన నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవిలతోపాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తేనీటి విందు ఇచ్చారు. మంత్రులు జానారెడ్డి, రఘువీరారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వట్టి వసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, మహీధర్‌రెడ్డి, విశ్వరూప్, డి.కె.అరుణ తదితరులు విందుకు హాజరై ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం, పీసీసీ చీఫ్ కొద్దిసేపు సమావేశమైనట్లు తెలిసింది. ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలను గట్టిగా ఖండించాలని సీఎం మంత్రులకు సూచించారు. విందు భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు చిన్నపిల్లల రాజకీయాలు చేస్తున్నారని, తాను ఆయా ఎమ్మెల్యేలను బెదిరించినట్లు, ప్రలోభాలకు గురిచేసినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి