2, డిసెంబర్ 2011, శుక్రవారం

అవిశ్వాసం ఫై జగన్ వ్యూహం

అవిశ్వాస రాజకీయం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు శుక్రవారం ఇక్కడ సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి రావాల్సిందిగా జగన్‌కు వారు చెప్పారు. ఈమేరకు గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని హైదరాబాద్‌కు జగన్ చేరుకున్నారు. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తనవైపు కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారన్నది అంచనా వేయడంతోపాటు కొత్తగా మరికొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని జగన్ అనుకుంటున్నారు. పాతవారిలో తనవైపు పదిహేనుమంది వరకు ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడతారని జగన్ అంచనా వేస్తున్నారు. వీరికి తోడుగా మరో పదిహేను నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఇందుకోసం జగన్‌కు అత్యంత సన్నిహితులైన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంతనాలు ప్రారంభించినట్టు తెలిసింది. తన శిబిరంలోకి వచ్చే ఎమ్మెల్యేల ‘అవసరాలను’ తీర్చేందుకు జగన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కనీసం 30మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగడితే అవిశ్వాసంపై ఓటింగ్ జరిగినపుడు బలాబలాల్లో మార్పు రావచ్చని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం పడకపోయినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు తనకు మద్దతుగా ఉండే పాతిక ముప్పయ్‌మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఈ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, అపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీయడానికి వీలుంటుందని ఆయన భావిస్తున్నారు.
ఎవరి ప్రచారం వారిది
ఇలాఉండగా, అవిశ్వాస తీర్మానానికి మద్దతుపై కాంగ్రెస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ తెచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏవిధంగా మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు వారు ప్రచారం చేస్తున్నారు. అయితే దీన్ని జగన్ వర్గం ఎమ్మెల్యేలు తిప్పికొడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పట్ల కాంగ్రెస్‌కు అంత అభిమానం ఉన్నట్లయితే సిబిఐ నమోదు చేసిన కేసులో వైఎస్ పేరు ఉంటే ఎందుకు ఖండించలేదని జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కనీసం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ కూడా ఎందుకు దాఖలు చేయలేదని వారంటున్నారు.
విజయమ్మ ద్వారా పిలుపు
రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినట్లయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేదలకు, బలహీనవర్గాలకు ప్రవేశ పెట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, వైఎస్ మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని శాసనసభలో పిలుపు ఇవ్వనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి