5, డిసెంబర్ 2011, సోమవారం

అవిశ్వాసం, అనర్హత వేటు: వైయస్ జగన్ వ్యూహం

వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధపడే తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్ వర్గం ఎమ్మెల్లో పూతలపట్టు రవి మినహా ఎవరూ తగ్గలేదు. అవిశ్వాసం సమయం వచ్చే వరకు జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది. కానీ విప్ బేఖాతరు చేస్తూ, అంచనాలు తలక్రిందులు చేస్తూ కాంగ్రెసు నుండి పదహారు మంది, పిఆర్పీ నుండి శోభా నాగి రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

సిఎం, పిసిసి చీఫ్, మంత్రులు మంతనాలు జరిపినా, వోటు వేసిన అనంతరమే వేటు పడుతుందని హెచ్చరికలు జారీ చేసినా ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలకడం వెనుక ఉప ఎన్నికలకు సమాయత్తమైనట్లుగానే కనిపిస్తోంది. జగన్ తన ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చి ఉప ఎన్నికలకు వెళ్లి తన సత్తా నిరూపించుకునేందుకే వేటుకు వెరవకూడదని వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఒకటికే పరిమితమైన తన బలాన్ని రెండంకెల స్థాయికి పెంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ప్రభుత్వాన్ని ఢీకొట్టినట్లుగా కనిపిస్తోంది.

జగన్ ఎమ్మెల్యేలు కూడా తాము వేటుకు భయపడేది లేదని స్పష్టంగా చెప్పుకొచ్చారు. వేటు వేస్తే ప్రజాక్షేత్రంలో జగన్ బలం నిరూపించుకుంటామని సవాల్ విసిరారు. కాపు రామచంద్రా రెడ్డి అయితే, మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని ఈ రాత్రికే అనర్హత వేస్తే సంతోషిస్తామని సోమవారం మీడియా పాయింట్ వద్ద చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కైందన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలు సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకే ఈ వేదికను జగన్ మలుచుకున్నారు. టిడిపికి మద్దతివ్వడం అందులోనూ తన వర్గం ఎమ్మెల్యేలందరితోనూ ఓటు వేయించడం ద్వారా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసుకు వ్యతిరేకమే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి