* ఈ నెల 19 నుండి ఎమ్మెల్యేలతో మాట్లాడనున్న స్పీకర్
* శోభానాగిరెడ్డితో షురూ...రోజుకు ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ
* నెలాఖరులోగా అనర్హతపై స్పీకర్ నిర్ణయం
జగన్ వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తీవ్రమైన జాప్యం జరిగినప్పటికీ...ఈసారి మాత్రం త్వరితగతినే నిర్ణయం ప్రకటించాలనే యోచనలో స్పీకర్ ఉన్నారు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా విప్‌ను దిక్కరించి అవిశ్వాసానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనలో స్పీకర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 17 మందిపై ఈ నెలాఖరులోగా అనర్హత వేటు వేయడం ఖాయంగా కన్పిస్తోంది.
పార్టీలు ఇచ్చిన విప్‌ను దిక్కరించి అవిశ్వాసానికి మద్దతిచ్చిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్దమౌతోంది. పిఆర్పీ, కాంగ్రెస్‌ల తరఫున గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు జగన్ వర్గంలో కొనసాగుతున్నారు. వీరిలో కొందరిపై గతంలోనే ఆయా పార్టీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా...నిర్ణయం మాత్రం వెలువడలేదు. తాజాగా పిఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డితో పాటు...16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ వర్గంగా ఉంటూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అసెంబ్లీ సాక్షిగా, స్పీకర్ కళ్లముందే వీరంతా విప్ దిక్కరించారు. దీనిపై ప్రభుత్వ విఫ్ కొండ్రు మురళి స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
దీంతో వీరందరిపై అందిన అనర్హత పిటిషన్లను ఈ నెల 19 నుండి స్పీకర్ విచారించేందుకు సిద్దమౌతున్నారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డితో మొదలు కానున్న ఈ ప్రక్రియలో రోజుకు ముగ్గురు ఎమ్మెల్యేలతో స్పీకర్ బేటీ అయి వివరణ తీసుకోనున్నారు. ఈ తతంగమంత ఈ నెలాఖరులోగా పూర్తి చేసి...అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే దిశగా స్పీకర్ కార్యాలయం కదులుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి