13, డిసెంబర్ 2011, మంగళవారం

పది స్థానాలైనా గెలవాలి

లేదంటే మధ్యంతరం తప్పదు!

* 'ఉప'పోరుపై కాంగ్రెస్ మనోగతం

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రాష్ట్ర శాసన సభకు మధ్యంతర ఎన్నికలు జరుగకుండా చూడాలంటే ఉపఎన్నికల్లో పది నుండి పనె్నండు సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పోటీ జరగనున్న ఇరవై నాలుగింటిలో అధిక స్థానాలను గెలుచుకుంటే అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు తప్పవని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం ఇటీవల శాసనసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌కు చెందిన జగన్ అభిమాన ఎమ్మెల్యేలు పదహారు మంది అనుకూలంగా ఓటు వేయటం తెలిసిందే. ఈ పదహారు మందిపై వేటు వేసిన అనంతరం ఈ ఖాళీలకు జరిగే ఉపఎన్నికల్లో కనీసం పదింటిని గెలుచుకోవాలన్నది రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకుల ఆలోచన. గతంలో ఏర్పడిన ఏడు ఖాళీలకు ఇప్పుడు ఏర్పడనున్న పదిహేడు ఖాళీలను జోడిస్తే మొత్తం ఖాళీల సంఖ్య ఇరవై నాలుగుకు చేరుకుంటుంది. ఈ ఇరవై నాలుగు ఖాళీలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్తరప్రదేశ్ తదితర ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతోపాటు ఉపఎన్నికలు జరుగవచ్చునని భావిస్తున్నారు. ఈ ఇరవై నాలుగు ఖాళీల్లో పది లేదా పనె్నండు సీట్లను దక్కించుకోవాలని పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. కోస్తాంధ్రలోని పది, రాయలసీమ, తెలంగాణలోని ఏడేసి ఖాళీలకు జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక కోసం బొత్స ఆయా జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంతనాలు ప్రారంభించారు. పార్టీ తరపున పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థులను వీలున్నంత త్వరగా ఎంపిక చేయటంతోపాటు ఎన్నికల ప్రచారానికి కూడా వెంటనే శ్రీకారం చుట్టాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఉపఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం గురించి ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌తో చర్చించనున్నారు. ఆజాద్‌తో చర్చలు జరిపిన అనంతరం ఆయన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డితో మంతనాలు జరిపిన తరువాత ఖాళీ అయిన స్థానాలకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, నాయకులతో విస్తృత స్థాయి చర్చలు జరిపి గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఉపఎన్నికల్లో ఏమాత్రం ఎదురు దెబ్బ తగిలినా ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిపోతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే బొత్స ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాలులో తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులతో దాదాపు ఒక గంట పాటు మంతనాలు జరపటం గమనార్హం. ఉప ఎన్నికలతో పాటు పలు ఇతర అంశాల గురించి ఆయన వారితో చర్చలు జరిపినట్లు తెలిసింది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి