కేంద్ర మంత్రి పదవికి ఇంకొంతకాలం ఎదురుచూపే
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కాంగ్రెస్‌లో కలిసిపోయిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఇప్పట్లో కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలు కనిపించటం లేదు. పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆదేశం మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు అజిత్ సింగ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు అజిత్‌సింగ్‌తో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది. అజిత్‌సింగ్‌ను 17 లేదా 18 తేదీల్లో కేంద్ర కేబినెట్‌లోకి చేర్చుకుంటున్నారు. అజిత్‌సింగ్‌తోపాటు చిరంజీవికి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పిస్తున్నట్టు వార్తలు రావటం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన తరువాతే కేబినెట్‌లోకి చేర్చుకుంటారని ఏఐసిసి, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. చిరంజీవిని మొదట మంత్రివర్గంలో చేర్చుకుని, తరువాత రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని, ఆయన్ని మొదట రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక చేసిన అనంతరం కేబినెట్‌లో చేర్చుకుంటారని ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. చిరంజీవిని ఈ వారాంతంలో కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుంటారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటానికి ప్రధానంగా రెండు కారణాలను ఏఐసిసి చూపుతోంది. ఒకటి ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకపోవటం, చిరంజీవితోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఒకరు లేదా ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావటం. చిరంజీవి ఒక్కరినే కేబినెట్‌లోకి చేర్చుకోవటం వలన తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు లేఖలు రాశారు. 'చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లో చేర్చుకోవటం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురికి స్థానం కల్పించటం మంచిది' అని హైకమాండ్‌కు రాసిన లేఖల్లో స్పష్టం చేసినట్టు సమాచారం. దీనివల్ల పార్టీలో చాలాకాలంగా పని చేస్తున్న వారికి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని వీరు వాదిస్తున్నారు. ఈ కారణం చేతనే హైకమాండ్ ప్రస్తుతానికి చిరంజీవిని కేబినెట్‌లో చేర్చుకునే కార్యక్రమాన్ని రెండు నెలల పాటు వాయిదా వేసిందని అంటున్నారు. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అనంతరం కేంద్ర కేబినెట్‌లో చేర్చుకుంటారని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి