13, డిసెంబర్ 2011, మంగళవారం

సిఎంకు షాక్‌

విద్యుత్‌ శాఖపై శంకర్రావు సమీక్ష

 హాజరైన ట్రాన్స్‌కో సిఎండి

 మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు

 పవర్‌ హాలిడే ఎత్తివేస్తామని ప్రకటన

 

 

చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి శంకర్రావు ఈ సారి ఏకంగా ముఖ్య మంత్రికే షాక్‌ ఇచ్చారు. సిఎం స్వయంగా చూస్తున్న విద్యుత్‌శాఖపై ఆయన మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశం చర్చనీయాంశమైంది. 'పవర్‌ హాలిడేపై సమీక్ష' అంటూ ముందుగానే మీడియాకు సమాచారం పంపి మరీ ఆయన ఈ సమావేశం నిర్వహించడం విశేషం. మంత్రి జరిపిన ఈ సమీక్షపై తమకు సమాచారమేమి లేదని సిఎం కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఆయన మాత్రం 'నాకు కేటాయించిన శాఖల్లో చిన్నతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఆ పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా స్థితిగతులపై సమీక్షించాం' అని సమర్ధించు కున్నారు.అయితే, విద్యుత్‌ కొరతకు సంబంధించిన సమీక్షకే మంత్రి పరిమితం కాలేదు. సమావేశానంతరం జనవరి నెలనుండి పవర్‌హాలిడేను ఎత్తివేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 19వ తేది నుండే రెండురోజుల కోతను ఒక్కరోజుకు పరిమితం చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. మంత్రి చేసిన ఈ ప్రకటన ఉన్నత స్థాయి వర్గాల్లో కలకలం రేపింది. వాస్తవానికి రాష్ట్రంలో విద్యుత్‌ కొరత నేపధ్యంలో పరిశ్రమలకు విద్యుత్‌ కోతను విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. తమకు నిరంతరా యంగా విద్యుత్‌ సరఫరా చేయాలని కొద్దిరోజులుగా ఆ పరిశ్రమల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సిఎం ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందచేసినా పరిస్థితిలో మార్పురాలేదు.

 

 

ఈ నేపధ్యంలో మంత్రి జోక్యంతో రెండు గంటల్లో సమస్య పరిష్కారం కావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 5 నుండి ఆరు లక్షల వరకు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. వీటిమీద ఆధారపడి సుమారుగా 1.50 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పవర్‌హాలిడే విధానం వల్ల వీరందరి ఉపాధి దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చిన్నతరహా పరిశ్రమల యజమానులకు సైతం యూనిట్లను నిర్వహించడం అసాధ్యంగా మారిందని చెప్పారు. దీంతో పలు ప్రాంతాల్లో యూనిట్లు మూస ివేయడానికి సైతం సిద్దపడుతున్నారని అన్నారు. తాను జరిపిన సమీక్షలో విద్యుత్‌ ఉత్పాదన మెరుగుపడుతున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు చెప్పారని తెలిపారు. దీంతో ఈ నెల 19 నుండి వారంలో ఒక్క రోజు మాత్రమే కోత విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జనవరి నెలనుండి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తిస్థాయిలో కోత ఎత్తివేస్తామని చెప్పారు. ట్రాన్స్‌కో సిఎండి అజరుజైన్‌ మాట్లాడుతూ భూపాలపల్లి, కాకతీయ థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి మెరుగుపడిందని అన్నారు. ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ అదనంగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. దీంతో చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్‌ ఉత్పత్తిని మెరుగు పరుస్తామని, జూన్‌ నెల నుండి అన్ని రంగాలకూ కోత లేకుండా సరఫరా చేయగలమని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి