11, డిసెంబర్ 2011, ఆదివారం

జగన్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి

అవిశ్వాస తీర్మానం తర్వాత బండ్లు ఎవరో, ఓడలెవరో తెలిసిపోయింది. విలేకరుల సమావేశంలో ఓవైపు శోభానాగిరెడ్డిని, మరోవైపు బాలనాగిరెడ్డిని కూర్చోబెట్టుకుని విలువలపై జగన్ ఉపన్యాసం ఇచ్చాడు. తన ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారని, నైతిక విలువలను కాపాడారని చెప్పాడు. ఆయన దృష్టిలో ఎమ్మెల్యేలకు చెల్లించిన వెలలే విలువలా?' అని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శోభానాగిరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వైఎస్ రెక్కల కష్టమేనా? అని ప్రశ్నించారు.

 

 2009 ఎన్నికల్లో వీరిపై ఇతరులను నిలబెట్టారని, జగన్ ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరితోపాటు, అదే తరహాలు మరికొందరి మద్దతే తీసుకుంటున్నారని, ఇందులో తర్కమేమిటని విరుచుకుపడ్డారు. ఇప్పుడు వీరంతా విలువల ముసుగులు తొడుక్కుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జగన్ కొనుక్కున్న ఎమ్మెల్యేలలో కొందరిని కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నారని వైఎస్ తనయుడు ఆవేదన చెందుతున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

 

 ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ముఠాతత్వాలు, బెదిరింపులు జగన్ కుటుంబానికి మొదటినుంచీ అలవాటేనని దుయ్యబట్టారు. శాసనవ్యవస్థను, అధికారులను నియంత్రించేందుకు జగన్ అలవాటుపడ్డారని, ఆయన ధనదాహం కారణంగా అధికారులు జైళ్లపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు న్యాయవ్యవస్థపై కూడా జగన్ విమర్శలు సంధిస్తున్నారని ఆగ్రహించారు.

 

అది జంతువుల లక్షణం

 'అడ్డుగా ఏదొచ్చినా తుదముట్టించడం జంతువుల లక్షణం. జగన్ అనుసరిస్తున్న పంథా కూడా ఇదే' అని రేవంత్ దుయ్యబట్టారు. 'తనకు అడ్డొచ్చినవారిపై తన పత్రిక, చానల్ ద్వారా జగన్ విషం కక్కుతున్నాడు' అని విమర్శించారు. కాగా.. తెలుగుదేశం హయాంలో జరిగిన నిజాం, పాలేరు షుగర్స్ అమ్మకాలు కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకే జరిగాయని, అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణల్లో భాగంగానే ఆయా సంస్థల అమ్మకాలు జరిగాయని తెలిపారు.

 

 ప్రభుత్వానికి భారంగా ఉన్నందునే నాడు వాటిని విక్రయించినట్లు స్పష్టం చేశారు. వాటి అమ్మకాలు తప్పనుకుంటే.. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీపై విషప్రచారం చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన మాటలు, ఆయన మీడియా రాతలు, కథనాల్లో నిజాలు లేవని విమర్శించారు. 'రైతులకు మద్దతుగానే జగన్ వర్గీయులు అవిశ్వాసానికి ఓటేశారని చెప్పుకొంటున్నారు. కానీ రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న ఆవేదనతో నాడు నిరవధిక దీక్ష చేపట్టిందీ, నేడు పోరుబాట పట్టిందీ చంద్రబాబే. ఇప్పుడు రైతులకు మద్దతుగా అవిశ్వాసం పెట్టిందీ టీడీపీనే' అని పేర్కొన్నారు.

 

 ఇక.. పర్యావరణ పరిరక్షణ చట్టాలనుంచి వొట్టినాగులపల్లి భూములను మినహాయించడం నిబంధనలమేరకే జరిగిందని, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈపీపీఆర్ఐ సర్వే కూడా జరిగిందని వివరించారు. 40-50 గ్రామాల్లో సర్వే జరిగిన అనంతరమే జీవో నెం. 257 జారీ అయ్యిందని చెప్పారు. అంతేతప్ప జగన్ పత్రిక పేర్కొన్నట్లు శ్రీనిరాజు, కుర్రా వెంకటేశ్వరరావుకు లబ్ధి చేకూర్చేందుకు కాదని చెప్పారు.

 

జడ్జీలకు ఒకరు చెప్పాల్సిన పనిలేదు

 న్యాయమూర్తులకు ఏది మంచో, ఏది చెడో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని జగన్‌ను ఉద్దేశించి హితవు పలికారు. విచక్షణ లేని జగన్ పత్రిక విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏ కేసులు ఏ బెంచికి వెళ్లాలో ఆ బెంచికే వెళతాయని వెల్లడించారు. న్యాయవ్యవస్థపై విమర్శనాస్త్రాలను సంధించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇటువంటి అంశాలపై ప్రజలు సైతం పోరాడాల్సి ఉందన్నారు. విలువలు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి