14, డిసెంబర్ 2011, బుధవారం

ఇదీ సంగతి

రాష్ట్ర పరిస్థితిపై సోనియాకు బొత్స నివేదిక

 పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని రాష్ట్ర రాజకీయాలపై ఒక నివేదికను అందజేశారు. ఉదయం ఆయన 10,జనపథ్‌కు వెళ్లి పార్టీ అధ్యక్షురాలితో సమావేశమయ్యారు. తెలుగుదేశం శాసన సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన శాసన సభ్యులపై చర్య తీసుకోవటం, తదనతరం ఎదురయ్యే ఉపఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలికి వివరించినట్లు తెలిసింది. ఉపఎన్నికల్లో విజయం సాధించగలిగే సత్తా ఉన్న వారికే పార్టీ టికెట్ కేటాయించాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన పదహారు మంది కాంగ్రెస్ శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించిన అనంతరం గతంలో రాజీనామా చేసిన వారిని కలుపుకుంటే మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఖాళీ అవుతాయని ఆయన సోనియా గాంధీకి వివరించారు. కోస్తాంధ్రలో పది, తెలంగాణ, రాయలసీమలో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతాయనీ, వీటిలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించినట్లు తెలిసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభావం, తెలంగాణలో టిఆర్‌ఎస్‌కి ప్రజలిస్తున్న మద్దతు తదితర అంశాలు కూడా పరిశీలనకు వచ్చాయని అంటున్నారు.
ఆజాద్‌తో భేటీ
ఆయన పార్టీ అధ్యక్షురాలితో సమావేశమయ్యేందుకు ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల గురించి సమాలోచనలు జరిపారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన వారిపై చర్య తీసుకోవటం, ఉపఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం తదితర అంశాలపై వారు చర్చలు జరిపినట్లు తెలిసింది. సోనియా గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో జరిపిన సమావేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు బొత్స నిరాకరించారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి